Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది మహిళలు తమ గురించే మర్చిపోయి చుట్టూ ఉన్న వారి గురించే తెగ ఆలోచిస్తుంటారు. ప్రతి క్షణం, ప్రతి పనిలో అవతలి వాళ్లను సంతృప్తిపరచలేమేమో అనే ఫీలింగ్‌తో ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇది వారిలో విపరీతమైన ఒత్తిడికి దారితీస్తుంది. దీని కారణంగా ఏకాగ్రత లోపం, మతిమరుపు, మూడ్ స్వింగ్స్, ఆందోళన, కోపం, చిరాకు.. వంటి లక్షణాల్ని గమనించచ్చు. ఇక వీటి మూలంగా బరువు పెరగడం, పొత్తి కడుపులో నొప్పి, కండరాల సమస్యలు, చర్మ సమస్యలు, యాంగ్జైటీ, శ్వాస తీసుకోలేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం.. వంటి అనారోగ్యాలు బాధిస్తాయి. ఇవి మన వ్యక్తిగత, ఇటు వృత్తిపరమైన జీవితాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తుంటుంది. అయితే దీన్ని ఎదుర్కోవాలంటే మాత్రం మన జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు.
వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేసుకోవడంలో మహిళలు తమను తామే మర్చిపోతుంటారు. నిజానికి ఇది వారి వ్యక్తిగత జీవితానికి ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి దీన్ని అధిగమించాలంటే ఎవరి కోసం వారు కొంత సమయం కేటాయించడం ముఖ్యం. నచ్చిన వారితో సమయం గడిపేందుకు వ్యక్తిగత ప్రదేశాన్ని ఏర్పాటుచేసుకోవాలి. అలాగే నచ్చిన పనులు చేయడం వల్ల స్వీయ ప్రేమ పెరుగుతుంది. జిమ్‌తో పాటు ఇంట్లో చేసే వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది.
ప్రతి పనినీ పర్‌ఫెక్ట్‌గా చేయాలని అసాధారణ లక్ష్యాలు పెట్టుకోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుంటుంది. నిజానికి ఈ విషయంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కారని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ప్రతి రోజూ ఇల్లంతా నీట్‌గా ఉంచాలి, సమయానికి ఆఫీస్ వర్క్ పూర్తిచేయాలి, పిల్లల్ని చూసుకోవాలి.. ఇలా ఒక రోజులో ఇన్ని పనులు సాధ్యం కాకపోవచ్చు.. కాబట్టి ప్రాధాన్యతల్ని బట్టి చేయాల్సిన పనులేవో నోట్ చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయడం.. వంటి పనులు వారాంతాలకు వాయిదా వేసినా నష్టం లేదు. ఇలా అవసరమైన పనులే చేయడం వల్ల మీకంటూ కేటాయించడానికి కాస్త సమయం చిక్కుతుంది. ఫలితంగా ఒత్తిడినీ అధిగమించచ్చు.
ఇంట్లో వాళ్లెవరూ చెప్పిన పనిని నీట్‌గా చేయరు.. అటు ఆఫీస్‌లోనూ ఫలానా పనిని నేనైతేనే పర్‌ఫెక్ట్‌గా చేయగలను.. అంటూ అదనపు భారం తమ నెత్తిన వేసుకుంటారు కొందరు మహిళలు. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది. పైగా మనం రోబోలం కాదు కదా.. ప్రతి పనినీ క్షణాల్లో పూర్తిచేయడానికి! కాబట్టి ఇంటి పనుల్లో కొన్ని మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు పంచండి. ఇక ఆఫీస్‌లో మీకు సాధ్యమైనంత పనులే స్వీకరించి.. అదనపు పని భారానికి 'నో' చెప్పడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చేయాలనుకున్న పనుల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తారు. దాంతో మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సమస్యలను అధిగమించడానికి ఇదీ ఓ ఉపాయమే.