Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాకీ హంట్ బ్రోయర్స్మా... అంగవైకల్య అథ్లెట్. ప్రాంతాంతక వ్యాధితో తన కాలును కోల్పోయింది. అది ఆమెలో మరింతగా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పట్టుదలతో కృషి చేసింది. 104 రోజుల్లో 104 మారథాన్‌ల ద్వారా ప్రపంచ రికార్డును సాధించింది. తన లక్ష్యాన్ని చేరుకుంది.
దక్షిణాఫ్రికాకు చెందిన హంట్ బ్రోయర్స్మా 2002లో అరుదైన ప్రాణాంతకత సమస్య కారణంగా ఆమె కాలును మోకాలి కింది భాగాన్ని తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె జీవితంపై ఆశలు వదులుకోలేదు. మరింత కృషి చేయాలనే నిర్ణయం తీసుకుంది. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో పరుగెత్తడం ప్రారంభించింది. చివరికి ఆమె దాన్ని చేసి చూపించింది. ఈ 46 ఏళ్ల అథ్లెట్ ఇంతకు ముందు రన్నర్ కాదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె తన కాలు కోల్పోయిన తర్వాత మాత్రమే తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని భావించింది. 2016 నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆరు సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత ఆమె ఎట్టకేలకు తన లక్ష్యాన్ని చేరుకుంది.
ప్రియమైన పరుగు...
ప్రపంచ రికార్డు కోసం తన చేసిన కృషి, ప్రయత్నాల గురించి ఆమె తరచుగా తన సోషల్ మీడియా అకౌంట్లో అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తుంది. ''ప్రియమైన పరుగు... నీ వల్ల నేను ఇప్పుడు కొంచెం భిన్నంగా ఉన్నాను. నీవు నాకు ధైర్యాన్ని, బలాన్ని, స్నేహాన్ని, విశ్వాసాన్ని అందించినందుకు ధన్యవాదములు'' అని హంట్-బ్రోర్స్మా తన లక్ష్యాన్ని పూర్తి చేసే సమయానికి ఇలా రాసింది.
వీరికి నొప్పి ఉండదు
బ్లేడ్‌లతో పరిగెత్తే రన్నర్‌లు, సాధారణ అథ్లెట్‌లను ప్రజలు పోల్చినప్పుడు తనకు ఎదురయ్యే అనేక విమర్శల గురించి కూడా ఆమె ప్రస్థావించింది. మొదటివారు పాదాల నొప్పి, అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అయితే రెండో వారికి ఈ నొప్పి ఉండదు.
మాకూ నొప్పి ఉంటుంది
''అవును వారు అనేది నిజమే. నా కుడి కాలికి నొప్పి రాదు. అయితే స్టంప్ నొప్పితో పాటు ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిగెత్తినప్పుడు నా స్టంప్ అన్ని పౌండింగ్‌లను తీసుకుంటుంది. స్టంప్ ఇప్పటికీ నా అవయవంలో భాగం. నేను చాలా మైళ్లు చేసినప్పుడు అది ఉబ్బుతుంది. అది నా ఎముకలపై ప్రభావం చూపుతుంది. ఇలా జరిగినప్పుడు నా సాకెట్, స్టంప్ మధ్య ఘర్షణ నిజంగా బాధాకరంగా ఉంటుంది. వాపు, నొప్పిని తగ్గించుకోడానికి మోకాలి వెనుక భాగంలో ఐసింగ్ చేసుకుంటాను. దానివల్ల కొంత ఉపశమనం ఉంటుంది. ఆపై ఎముక తిరిగి స్థానానికి కదులుతుంది. నా స్టంప్ దిగువన కూడా పౌండింగ్ ప్రభావం పడుతుంది. నేను నిజానికి కొన్ని సార్లు గాయపడ్డాను. తరచుగా వచ్చే తిమ్మిరి వల్ల కాలు తీసి మసాజ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తిమ్మిరి తగ్గాలంటే కొన్ని గంటలు పడుతుంది. మారథాన్ ఛాలెంజ్ సమయంలో నేను సరిగా నిద్రపోలేదు. అప్పుడు నా హిప్ ఫ్లెక్సర్‌లు, క్వాడ్‌లు, స్నాయువు, ఐటీ బ్యాండ్‌పై ప్రభావం ఉంటుంది. ఇక నా స్టంప్‌పై వచ్చే బొబ్బల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంవత్సరాలుగా నేను దానిని ఎదుర్కోవడం నేర్చుకున్నాను'' అంటూ విమర్శలకు సమాధానమిస్తూ హంట్ బ్రోర్స్మా రాశారు.
సమస్యలు అడ్డుకాలేదు
హంట్ ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించింది. కానీ శస్త్రచికిత్స తర్వాత ఆమె మరింత ప్రేరణ పొందింది. ఒక యోధలా క్యాన్సర్‌తో పోరాడిన సమయంలో ఆమె లోపల నుండి ప్రేరణను గుర్తించింది. రన్నింగ్ బ్లేడ్‌పై 10,000 డాలర్లు ఖర్చు చేసి ఆపై శిక్షణ ప్రారంభించింది. తను శారీరకంగా, మానసికంగా క్షేమంగా ఉందని నిర్ధారించుకుంది. తన జీవితంలో ఎప్పుడూ ఆశను వదులుకోలేదు. అంతే కాదు గత కొన్ని రోజులుగా ఆమె ప్రొస్తెటిక్ పడిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తన లక్ష్యాన్ని చేరుకోకుండా ఏదీ ఆపలేకపోయింది.
ప్రతి కోణంలోనూ...
ఆమె అన్ని అభ్యాసాలు, శిక్షణలు ఉన్నప్పటికీ తన రోజువారీ విధులను ఎప్పుడూ వదులుకోలేదు. ఇందులో తన ఇద్దరు పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం, వారిని పికప్ చేయడం, అలాగే హోమ్‌వర్క్, డిన్నర్, ఇంటి పనులు వంటి అన్ని రకాల సాధారణ తల్లిదండ్రులు చేసే పనులు కూడా ఆమె రోజు వారి జీవితంలో ఉన్నాయి. ఇలా ప్రతి కోణంలోనూ ఆమె ఒక యోధురాలు. హంట్ బ్రోయర్స్మా తన పిల్లలకు మాత్రమే కాదు అసాధ్యమైన వాటిని కలలు కనే వారికి కూడా స్ఫూర్తినిస్తుంది.