Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టపడి చదవడం అనగానే అమ్మాయిలే ఎక్కువ గుర్తొస్తారు. కానీ ఎంత మంచి పర్సంటేజీలు సాధించినా కొందరు ఉద్యోగాల విషయాని కొచ్చేసరికి వెనుకబడు తుంటారు. కారణమేంటి అంటే.. సమాజంలోని పురుషాధిక్యతతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం లేకపోవడం కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. మరి దానికోసం ఏం చేయాలో సూచనలిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...
- పుస్తకం మనకు కావల్సినంత సమాచారాన్ని అందిస్తుంది. కానీ దాని ఉపయోగం నిజజీవితంలో ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. అయితే ఇది అన్ని సార్లూ సాధ్యం కాదు. అందుకే మెంటార్లను ఏర్పరచుకోవాలి. లెక్చరర్లు, పరిశ్రమలో నిలదొక్కుకున్న వాళ్లు ఇలా ఎవరినైనా మెంటార్‌గా ఎంచుకోవచ్చు. వీళ్ల అనుభవం, ఒక్కో పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు వంటివన్నీ మీకు పాఠాలే. కెరియర్లో ముందకెళ్లడానికి అదే రంగంలోని వారితో స్నేహం మామూలే. కానీ వేరే రంగాల వారితోనూ మాట్లాడాలి. అప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే ఆలోచనా పరిధీ కూడా పెరుగుతుంది. ఒక విషయాన్ని భిన్న కోణాల్లో ఆలోచించడమెలాగో అర్థమవుతుంది. అయితే ఎక్కువగా వినడానికి ప్రాధాన్యమివ్వాలి.
- చాలావరకూ ప్రాజెక్టు, డిబేట్ వగైరా ఉంటే.. బాగా తెలిసిన అంశాన్ని ఎంచుకుంటాం. ఈసారి కష్టమైన దాన్ని ప్రయత్నించండి. రిస్క్ అనుకోవద్దు. విద్యార్థి దశలో రిస్క్ తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు? తెలియని అంశం మీ సామర్థ్యానికి సవాలు లాంటిది. ఇక్కడ ఆ విషయాన్ని తెలుసుకోవడమే కాదు.. తెలుసుకునే క్రమంలో దాటిన దశలు, పరిచయాలు.. అన్నీ కెరియర్ను ముందుకు నడిపేవే.
- అమ్మాయిలు అనేసరికి ఎక్కడికైనా పంపాలంటే కంగారు. దీంతో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వంటివన్నీ తెలిసిన వాళ్ల ద్వారా ఇప్పించడమో, దగ్గరుండి తీసుకెళ్లడమో చేస్తుంటారు. జాగ్రత్త మంచిదే... అయితే అది మిమ్మల్ని బంధించేయకూడదు. ప్రయత్నమేదైనా సొంతంగా చేయండి. కొత్త ప్రాంతంలో ఇంటర్న్‌షిప్ ప్రయత్నించండి. కొత్త మనస్తత్వాలు, అన్ని పనులూ సొంతగా చేసుకోవడం వంటివి తెలుస్తాయి.