Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు. కష్టాలు, కన్నీళ్లు సహజం. అయితే కష్టాలు వచ్చాయని కుంగిపోయి కూర్చుంటే ఇక ముందుకు వెళ్ళలేము. అందుకే ''జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ ఉన్నంత సేపు అది సాఫీగా వెళుతుంది'' అన్న ఐన్‌స్టీన్ మాటలను స్ఫూర్తిగా తీసుకుంది. నలుగురు పిల్లల్ని, తననూ వదిలేసి భర్త వెళ్ళిపోయినా ధైర్యంగా నిలబడింది. మగవారి ఆధిపత్యం ఉన్న ప్లంబింగ్ రంగంలో నిలదొక్కుకుని పేరు తెచ్చుకుంటోంది. నలుగురు కుమార్తెలకు ఒంటరి తల్లిగా ఉంటూ వారి జీవితాలను తీర్చిదిద్దేందుకు కష్టాలను అధిగమించింది. ఆమే కేరళలోని గిరిజన తెగకు చెందిన శైలజ అయ్యపన్. ఆమె స్ఫూర్తిదాయక జీవిత విశేషాలు మానవి పాఠకుల కోసం...
ముఫ్పై ఏండేండ్ల శైలజా అయ్యప్పన్‌ను భర్త విడిచిపెట్టిన తర్వాత ఒంటరిగా నలుగురు ఆడపిల్లల్ని పెంచింది. ఆర్థిక సంక్షోభం ఉన్న తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సామాజిక కట్టుబాట్లను అధిగమించింది. పురుషులు మాత్రమే చేసే ప్లంబింగ్ ఆమెకు జీవనోపాధిగా మారింది. ఈ వృత్తిలోకి రాకముందు స్వీపర్‌గా, కుక్‌గా పనిచేసేది శైలజ. ఎప్పుడూ ఏదో ఒకటి భిన్నంగా చేయాలని కోరుకునే మనస్తత్వం ఆమెది. పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు భర్త ఆమెను విడిచిపెట్టి పోయాడు. అప్పుడు పిల్లల్ని పోషించుకోవడం కోసం చిన్నచిన్న పనులు చేసుకునేది. కానీ వచ్చే ఆదాయం ఆ కుటుంబ అవసరాలు తీర్చలేకపోయాయి.
అటవీ ప్రాంతం వల్ల
పాఠశాల విద్యను మధ్యలోనే మానేసిన శైలజ కేరళలోని అతిరప్పిల్లిలోని షోలయార్‌లోని ఆదిమ గిరిజన సమాజమైన కదర్ తెగకు చెందినది. ఈ ప్రాంతం అటవీప్రాంతంగా ఉంది. సమీప పట్టణమైన చాలకుడి 65 కి.మీ దూరంలో ఉంది. దాంతో కుటుంబ అవసరాలకు సరిపోయే ఉద్యోగాన్ని సంపాదించడం చాలా కష్టం. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా ఆమె చిన్న చిన్న ఉద్యోగాలను చేసేది.
శిక్షణ తీసుకుంది
ఆ సమయంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జన్ శిక్షన్ సంస్థాన్ (జేఎస్‌ఎస్) ఆమెను రక్షించింది. స్కిల్ ఇండియా క్యాంపెయిన్ కింద వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు తమ ప్రాంతంలోని మహిళలు, పిల్లల కోసం ఈ సంస్థ వెతుకుతోంది. భారత ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ ఇండియా ప్రచారం 2022 నాటికి భారతదేశంలోని 30 కోట్ల మందికి పైగా వివిధ నైపుణ్యాలలో శిక్షణనిచ్చే లక్ష్యంతో ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని అక్షరాస్యులు, పాఠశాల మానేసిన వారికి వృత్తిపరమైన శిక్షణను అందిస్తుంది.
కొత్త ప్రారంభం
''అతిరప్పిల్లి గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షురాలు థంకమ్మ.వి వారు ఇచ్చే వృత్తి శిక్షణా కోర్సుల గురించి చెప్పినప్పుడు వేరే ఆలోచన లేకుండా వెంటనే అందులో చేరాను. కోర్సు చదవాలనే ఆసక్తితో త్వరగానే నేర్చుకున్నాను'' అని శైలజ చెబుతోంది. శైలజతో పాటు ఆమె కుతుళ్ళు కూడా స్కిల్ ఇండియా మిషన్ నుండి ప్లంబింగ్‌లో పూర్తి శిక్షణ తీసుకున్నారు. శైలజ ఇప్పుడు ఆ ప్రాంతంలో అందరూ కోరుకునే ప్లంబర్.
గౌరవంగా బతుకుతున్నాను
''ప్రస్తుతం నేను నెలకు కనీసం రూ. 5,000 సంపాదిస్తాను. నా కూతుళ్లలో ఒకరికి పెండ్లయింది. ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మరో ఇద్దరు చదువుతున్నారు. నేను ఇప్పుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలుగుతున్నాను'' అని ఆమె చెప్పింది. జెఎస్‌ఎస్ మూడు నెలల కోర్సు కోసం 2020-21లో షోలయార్ గిరిజన కాలనీకి చెందిన శైలజతో సహా 20 మందిని ఎంపిక చేసింది.
లింగ వివక్షతో పోరాడుతూ...
స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆమెను అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా పురుషాధిక్య రంగంలో విజయవంతంగా పనిచేస్తూ లింగ వివక్షతో పోరాడుతున్నందుకు సత్కరించింది. దేశ వ్యాప్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్న నలుగురు మహిళల్లో శైలజ ఒక్కరే కేరళ రాష్ట్రానికి చెందినవారు. మిగిలిన వారు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీకి చెందినవారు.
విచిత్రంగా చూశారు
లింగ వివక్షతో పోరాడుతున్న శైలజ తన ప్రాంతంలోని మహిళలు ప్లంబింగ్ వంటి ఉద్యోగాలలో చాలా అరుదుగా ఉపాధి పొందుతారని అంగీకరించింది. కోర్సు పూర్తయిన తర్వాత కూడా ఆమె బ్యాచ్‌మేట్స్‌లో కొంతమంది మాత్రమే పని చేయడానికి ఫీల్డ్‌కి వెళ్లారు. ''కోర్సు పూర్తయిన తర్వాత మేము సమీపంలోని కాలనీల నుండి ఉద్యోగాలు పొందడం ప్రారంభించాము. నేను కోర్స్‌లో చేరి పని చేయడం ప్రారంభించినప్పుడు చాలా మంది నా కనుబొమలు చిట్లించి విచిత్రంగా చూశారు. చాలా మంది నా సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించారు. మహిళలు ఈ ఉద్యోగం చేయడం సాధారణం కాదు. కానీ నాకు జీవనోపాధిని కల్పించి, నా పిల్లలను పోషించుకోగలిగే ఆశాకిరణం ఈ ఉద్యోగం'' అని శైలజ చెబుతోంది. ఆమె ప్లంబర్‌గా పనిచేయడం ప్రారంభించి సంవత్సరం అయ్యింది. ఆమెకు ఇంకా పెద్ద నిర్మాణ కాంట్రాక్టులు లేనప్పటికీ ఇళ్లలో మరమ్మతులు, ఇన్‌స్టాలేషన్ పనులను చేస్తుంది.
తక్కువ ఛార్జీలు తీసుకుంటున్నాను
''కదర్ గిరిజన కాలనీ ప్రభుత్వ తాగునీటి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చినందున మెజారిటీ ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. శిక్షణ పొందిన ప్లంబర్‌ని పట్టుకోవడం ఈ ప్రాంతంలో కష్టం. నేను వారి కోసం చాలా తక్కువ ఛార్జీతో పని చేస్తున్నాను'' అని ఆమె జతచేస్తుంది. కొన్ని సమయాల్లో నెలకు 10 మంది చోట్ల ప్లంబింగ్ పనులు చేసే అవకాశం వస్తుందని ఆమె జతచేస్తుంది.
మహిళ కావడంతో...
ఒక మహిళ అయినందున ప్రజలు ఆమెను పనికి పిలవడానికి కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నారు. ''కానీ నాకు ఒక చోట పని లభించినప్పుడల్లా నేను దానిని నా చిత్తశుద్ధితో చేస్తాను. తవ్వడం దగ్గర్నుంచి పైపులు కోయడం వరకూ అన్నీ నేనే చేస్తాను'' అంటోంది శైలజ. పెద్దగా చదువులేని శైలజ ప్లంబింగ్ కోర్సు నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తను నేర్చుకున్న నైపుణ్యం వృధాగా పోకూడదని, ప్లంబర్‌గా ముందుకు సాగాలని ఆమె కోరుకుంటుంది.
- సలీమ