Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లి చేసుకొని వేరే ఊరికి వెళుతున్నారనో, చేసుకోబోయే వారికి నచ్చలేదనో.. కుటుంబం, ఆఫీసు రెండు బాధ్యతలతో సతమతమవుతున్నామనో, పిల్లలను చూసుకోవాలనో.. సాధారణంగా మనం ఉద్యోగాలకు దూరమవుతుంటాం. కారణమేదైనా... రాజీనామా చేసేముందు ఈ అంశాలను మాత్రం ఓసారి పరిశీలించుకోండి.
- రాజీనామాకు కారణం.. భర్తకు నచ్చకపోవడం అనుకుందాం. మరి అప్పటి దాకా చదివిన చదువు, కెరియర్, సాధించిన నైపుణ్యాలు... అన్నీ పక్కన పెట్టేయడం సబబేనా అని ఆలోచించుకోండి. ఉద్యోగమంటే అన్నిసార్లూ సంపాదన కోసమే కాదు. మీకంటూ లక్ష్యాలుంటే వాటిని వివరంగా చెప్పండి. బహుశా మీ అభిప్రాయం విన్నాక వాళ్లే మనసు మార్చుకోవచ్చు. పిల్లల విషయంలోనూ ప్రత్యామ్నాయాలు దొరుకుతాయేమో ఆలోచించండి. కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
- ఆఫీసు వాతావరణం నచ్చకా ఈ నిర్ణయం తీసుకునేవారు చాలామంది. మీదీ అదే కారణమైతే.. వేరే ఉద్యోగం చూసుకున్నాకే రాజీనామా గురించి ఆలోచించండి. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయమేమిటంటే.. వేరే చోటా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. అప్పుడేం చేస్తారు? కాబట్టి పైవాళ్ల ద్వారానో, హెచ్ఆర్ విభాగం ద్వారానో సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. అప్పటికీ ఫలితం లేకపోతే ఉద్యోగం వదలడం గురించి ఆలోచించండి. ప్రయత్నం మాత్రం తప్పనిసరి.
- లేదూ... ఇక కొనసాగే ప్రసక్తే లేదు అనుకుంటే మరి తర్వాతేంటి? ఆలోచించుకుంటే మంచిది. అప్పటిదాకా వృత్తిపనితో నిండిపోయే సమయం మిగిలిపోతుంది. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నా.. తర్వాత ఏమీ తోయకపోవచ్చు. పైగా నెలనెలా కొంత డబ్బు చేతికొస్తుంది. అది రాకపోయినా ఫర్లేదా అన్నదీ ఆలోచించుకోవాలి.
- ఉద్యోగమున్నప్పుడు మీకంటూ డబ్బులుంటాయి. ఇంట్లో వాళ్లకి ఇచ్చినా.. సరదా ఖర్చులు చేసుకున్నా అడ్డు ఉండకపోవచ్చు. కానీ ఆపై అది కొనసాగక పోవచ్చు. ఇంకా.. తర్వాత తిరిగి మీరు చేరాలనుకున్నా.. అప్పుడు అవకాశం దొరక్కపోవచ్చు. కాబట్టి.. మీ పైవాళ్లు ముఖ్యంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారన్న వాళ్లతో మాట్లాడండి. పరిష్కారం దొరకొచ్చు. ఒక్కోసారి వాళ్లే ప్రత్యామ్నాయ మార్గాలూ సూచించొచ్చు. వీలైతే దీర్ఘకాలిక సెలవు తీసుకోండి. ప్రశాంతంగా ఆలోచించి ఆపైనా అలాగే అనిపిస్తేనే.. అప్పుడు రాజీనామా పత్రం ఇవ్వండి.