Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చపాతీ లేదా పుల్కా... ఎప్పుడూ వీటిని అదే రుచిలో తినాలంటే బోరే కదా. అందుకే కొంచెం కొత్తగా ఆరోగ్యకరమైన రుచుల్లో ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... ప్రయత్నించండి మరీ...
సోయా రోటీ
కావలసిన పదార్ధాలు: గోధుమపిండి - కప్పు, సోయా పిండి - పావుకప్పు, పసుపు - అరటీస్పూను, కారం - ఒకటిన్నర టీ స్పూన్లు, జీలకర్ర - అరటీస్పూను, కొత్తిమీర తురుము - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: ఓ గిన్నెలో సోయా, గోధుమపిండి, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. తర్వాత మూడు టీస్పూన్ల నూనె పోసి బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి పిండి ముద్దను కలపాలి. పిండిని ఉండల్లా చేసి పలుచని రోటీల్లా చేసుకుని నూనె పోస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.
మెంతి తెప్లా
కావలసిన పదార్ధాలు: గోధుమపిండి - రెండు కప్పులు, మెంతికూర తురుము - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - టీస్పూను, వెల్లుల్లి ముద్ద - రెండు టీస్పూన్లు, అల్లం ముద్ద - అరటీస్పూను, కారం - ఒకటిన్నర టీస్పూను, పంచదార - టేబుల్ స్పూను, ధనియాలపొడి - అరటీస్పూను, జీలకర్రపొడి - అరటీస్పూను, పసుపు - అరటీస్పూను, జీలకర్ర - టీస్పూను, నువ్వులు - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: ఓ గిన్నెలో పిండి పోసి మిగిలినవన్నీ అందులో వేసి కలపాలి. అందులోనే మూడు టేబుల్స్పూన్ల నూనె కూడా పోసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలపాలి. తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని చపాతీల్లా చేసి పెనంమీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
మల్టీగ్రెయిన్ రోటీ
కావలసిన పదార్ధాలు: జొన్నపిండి - పావుకప్పు, సజ్జపిండి - పావుకప్పు, గోధుమపిండి - పావుకప్పు, సెనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు, రాగిపిండి - పావుకప్పు, కొత్తిమీర తురుము - మూడు టేబుల్ స్పూన్లు, టమాటా - పావుకప్పు, పచ్చిమిర్చి ముక్కలు - టీస్పూను, కారం - టీస్పూను, పసుపు - పావుటీస్పూను, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: ఓ గిన్నెలో అన్ని పిండులూ వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తర్వాత ముద్దను ఉండల్లా చేసుకోవాలి. ఇపుడు ఓ ప్లాస్టికÊ కాగితం మీద నెయ్యి లేదా నూనె రాసి దానిమీద ఉండని పెట్టి చేత్తో వత్తుతూ రొట్టెలా చేయాలి. ఇప్పుడు దీన్ని నాన్‌స్టిక్ పెనం మీద వేసి, నూనె పోస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
మిరియాల రోటి
కావలసిన పదార్ధాలు: గోధుమ పిండి - ఒకటిన్నర కప్పులు, సోంపు గింజలు - అరటీస్పూను, జీలకర్ర - అరటీస్పూను, వాము - అరటీస్పూను, మిరియాలు - పది, ఇంగువ - చిటికెడు, పాలు - అరకప్పు, నూనె లాదా నెయ్యి - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలు అన్నీ వేసి వేయించాలి. తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. గోధుమ పిండిలో ఇంగువ, మిరియాలపొడి మిశ్రమ, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు పిండి ముద్దను చిన్న ఉండల్లా చేసుకుని పలుచని రొట్టెల్లా చేసి నాన్‌స్టిక్ పాన్ మీద నెయ్యి లేదా నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
సొరకాయ రొట్టె
కావల్సిన పదార్ధాలు: గోధుమపిండి - రెండు కప్పులు, సొరకాయ తురుము - ముప్పువు కప్పు, పెరుగు - అరకప్పు, పసుపు - పావుటీస్పూను, కారం - ఒకటిన్నర టీస్పూన్లు, నూనె - తగినంత, ఉప్పు - సరిపడా.
తయారు చేసే విధానం: గిన్నెలో పిండి పోసి పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. పెరుగు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు తగ్గినన్ని నీళ్లు పోసి కలిపి ముద్దలా చేయాలి. దీన్ని చిన్న ఉండల్లా చేసి రొట్టెల్లా చేసుకుని పెనం మీద రెండు వైపులా కాల్చి తీయాలి.