Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు మనకో పెద్ద సవాలు. గర్భధారణ, హార్మోన్ల అసమతౌల్యం.. ఇలా బోలెడు కారణాలు మనం లావవ్వడానికి. తగ్గించుకోవడానికి నడక, పరుగు, వ్యాయామం అంటూ బోలెడు చేస్తుంటాం కదా! నీటినీ ప్రయత్నించండి అంటున్నారు నిపుణులు.
- నీటిలో కెలరీలుండవు. శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపేయడంతోపాటు కొవ్వునీ కరిగించి, శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కాబట్టి ఉదయాలను నీటితో ప్రారంభించండి. చాలావరకూ ఉదయాన్నే ఆహారం మానేస్తుంటాం. ఆకలిని తట్టుకోవడానికి ఏదో ఒకటి నోట్లో వేసుకుంటాం. మళ్లీ భోజన సమయానికి ఆకలి లేకపోవడం.. సాయంత్రాలు చిరుతిళ్లు.. ఇలా తెలియకుండానే బరువు పోగేసుకుంటాం. ఏదైనా తినాలనిపించినప్పుడల్లా నీటిని ఎక్కువ మొత్తంలో తాగుతుండండి. అతిగా తినడం అదుపులోకి రావడంతోపాటు కొవ్వూ అదుపులో ఉంటుంది. అయితే వేళకి భోజనం మాత్రం తప్పనిసరి.
- సాధారణ, చల్లని నీటి స్థానంలో గోరు వెచ్చని నీటిని చేర్చుకోండి. కొవ్వుని కరిగించడంలో ఇది సాయపడుతుంది. తద్వారా బరువూ తగ్గుతారు. ఎండాకాలమైనా రోజులో కనీసం ఒకట్రెండు సార్లైనా వేడి నీటిని తీసుకోవడం తప్పనిసరి.
- భోజనం చేసేప్పుడు, చేశాక నీళ్లు తాగుతాం కదా! ఇది అజీర్తి, గ్యాస్‌కు మూలమవుతుంది... బరువు పెరుగుదలకు కారణమవుతుంది. ఈసారి తినే ముందు నీళ్లు తాగి చూడండి. అతిగా తినడాన్ని తగ్గించడమే కాదు.. బరువునీ అదుపు చేస్తుంది.
- అస్తమానూ మంచినీళ్లు తాగాలంటే కాస్త ఇబ్బందే! దానికి రుచి ఉండదు మరి. నీటిలో అల్లం, తేనె, సబ్జా, నిమ్మ రసం, పండ్ల ముక్కలు వేసి ఉంచి, తాగుతుండండి. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లూ, పోషకాలూ అందుతాయి.