Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సువర్ణ రాజ్... రెండేండ్ల వయసులో పోలియో బారిన పడింది. పవర్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్ ఇప్పుడు అథ్లెటిక్స్‌లో రాణించేందుకు అనేక అసమానతలను ఎదుర్కొంది. వికలాంగుల న్యాయవాదిగా, కార్యకర్తగా విశేష సేవలు అందిస్తుంది. వికలాంగ పిల్లల కోసం త్వరలోనే అకాడమీని ప్రారంభించాలనుకుంటున్న ఆమె స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో...
2015లో హర్యానాలోని పంచకులలో జరిగిన 18వ జాతీయ పారా-అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో సువర్ణ కూడా పాల్గొంది. ఆ సమయంలో ఆమెకు ఓ షాక్ తగిలింది. ''అక్కడ అథ్లెట్లకు వాష్‌రూమ్‌లు అందుబాటులో లేవు, ఓ పెద్ద హాలులో దుప్పట్లు పరిచి వాటిపై మమ్మల్ని నిద్రపొమ్మన్నారు. అటువంటి వాతావరణంలో ఉన్న క్రీడాకారులు తమ ఆటను ఎలా ప్రదర్శించగలరు''.
ప్రధానికి ట్విట్
సువర్ణ వెంటనే ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేసింది. ''సర్ ఇప్పుడు 11:25 గంటల రాత్రి సమయంలో పంచకులలోని టౌ దేవిలాల్ స్టేడియం వద్ద ఇద్దరం వికలాంగ మహిళలం రోడ్డుపై నిలబడి ఉన్నాము. మాకు సహాయం చేయడానికి పీసీఐ (పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా) నుండి ఎవరూ లేరు. మాకు మరుగుదొడ్లు అందుబాటులో లేవు. కనీసం సదుపాయం కూడా లేక అవమానాలకు గురౌతున్నాము''.
నన్ను అనుమతించలేదు
సువర్ణ ట్విట్ తర్వాత పారా-అథ్లెట్లు వారికి అందుబాటులో ఉండే హోటల్ల వంటి మెరుగైన వసతికి మార్చబడ్డారు. కానీ సువర్ణ మాత్రం తన ధైర్యానికి తర్వాత మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ''నేను ఆడేందుకు(టేబుల్ టెన్నిస్) వేదిక వద్దకు వెళ్ళినప్పుడు వారు నన్ను ఆడటానికి అనుమతించలేదు. మరుసటి రోజు ఆడమని నన్ను అడిగిన వికలాంగ కమీషనర్‌కి నేను ఫిర్యాదు చేసాను. నేను ఇంటికి పతకం తీసుకెళతానని కచ్చితంగా భావించిన ఈవెంట్లో గెలిచే అవకాశం కోల్పోవడంతో నేను నిరాకరించాను'' అని ఆమె చెప్పింది.
నేలపై పడుకుంది
మరో బాధాకరమైన సంఘటన కూడా ఆమె జీవితంలో అనుభవించింది. 2017లో నాగ్‌పూర్-నిజాముద్దీన్ గరీబ్ రథ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే అధికారులు, సహ-ప్రయాణికులు ఆమెకు కేటాయించిన పై బెర్త్‌కు బదులుగా లోయర్ బెర్త్ ఇవ్వడానికి నిరాకరించడంతో సువర్ణ నేలపై బలవంతంగా పడుకోవలసి వచ్చింది.
తల్లిదండ్రులు చూసుకోలేక
నాగ్‌పూర్‌లో జన్మించిన సువర్ణకు రెండేండ్ల వయసులో పోలియో సోకడంతో రెండు కాళ్ల కదలికలు దెబ్బతిన్నాయి. అప్పటి నుండి ఆమె 90 శాతం వైకల్యంతో బాధపడుతోంది. వీల్‌చైర్‌లోనే తిరుగుతుంది. ''తల్లిదండ్రులు నన్ను చూసుకోలేక చిన్నప్పటి నుంచే హాస్టల్లో చేర్పించారు. అక్కడే నేను వివిధ రకాల క్రీడలను నేర్చుకున్నాను. నా ఉపాధ్యాయుల ఒత్తిడితో పవర్‌లిఫ్టింగ్‌ను ప్రారంభించాను'' అని ఆమె గుర్తుచేసుకుంది.
అనేక పతకాలు గెలుచుకుంది
సువర్ణ 2002 నుండి 2008 వరకు క్రీడను కొనసాగించింది. ఈ ప్రక్రియలో జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలను గెలుచుకుంది. క్రీడలతో పాటే బికామ్, ఎంకామ్లను కూడా పూర్తి చేసింది. వివాహం కూడా చేసుకుంది. తర్వాత ఢిల్లీకి వెళ్లి అక్కడ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆమె తన బిడ్డను కడుపులోనే కోల్పోవలసి వచ్చింది. ఆ సమయంలో అత్యంత బాధను, కష్టాన్ని అనుభవించింది. జాండిస్‌తో బాధపడుతూ దాదాపు ఏడాది పాటు మంచం పట్టిన ఆమె శరీరం కోలుకోవడానికి దాదాపు రెండేండ్లు పట్టింది. వెయిట్ లిఫ్టింగ్ నుండి అథ్లెటిక్స్ వరకు సువర్ణ తన భర్త ప్రదీప్ అడుగుజాడల్లో టేబుల్ టెన్నిస్‌ను చేపట్టింది. వివిధ జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది.
ఆటను విడిచిపెట్టింది
2014లో ఆమె కొరియాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొంది. 2013లో బ్యాంకాక్‌లో జరిగిన థారులాండ్ పారా టేబుల్ టెన్నిస్ ఓపెన్స్‌లో రెండు పతకాలను గెలుచుకుంది. అయినప్పటికీ 2012 నుండి జాతీయ స్థాయి పోటీలు లేకపోవడం, స్పాన్సర్‌షిప్‌ల కొరత కారణంగా ఆమె 2017లో ఆటను విడిచిపెట్టింది. 2017 చివరిలో ఆమె షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావెలిన్లపై దృష్టి సారించి అథ్లెటిక్స్ను ఎంచుకుంది.
గమనం మారిపోయింది
ఆమె జాతీయ ఈవెంట్లలో పతకాలు గెలుచుకుంది. అంతర్జాతీయ టోర్నమెంట్లకు కూడా అర్హత సాధించింది. వెల్‌స్పన్‌తో స్పాన్సర్‌గా సహవాసం చేయడం వల్ల క్రీడలో తన కెరీర్ గమనం మారిపోయిందని ఆమె చెప్పింది. గతేడాది పారాలింపిక్స్‌లో భారత జట్టు సాధించిన విజయం కూడా పారా అథ్లెట్లలో ఆశలు నింపింది. ''పారా స్పోర్ట్‌కు తగిన శ్రద్ధ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా మందికి అవకాశాల గురించి తెలుసు. ఇది ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకువస్తుందని నేను ఆశిస్తున్నాను'' అని ఆమె జతచేస్తుంది.
హక్కుల కోసం పోరాటం
తను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వికలాంగుల హక్కుల గురించి ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాలలో చాలా తక్కువ అవగాహన ఉందని సువర్ణ అంటుంది. ''వికలాంగుల హక్కుల చట్టం గురించి ప్రజలకు తెలియదు. పార్కులు, థియేటర్లు, ఇతర బహిరంగ ప్రదేశాలు వంటివి అందుబాటులో ఉంచాలని వారికి తెలియదు. వికలాంగులకు సహాయం చేయడానికి అనేక పథకాలు కూడా ఉన్నాయి. వికలాంగులు గౌరవంతో జీవించడానికి సున్నితత్వం చాలా ముఖ్యం. సమస్య కుటుంబం నుంచే మొదలవుతుంది. నన్ను చూసుకోవడం ఇష్టంలేక మా కుటుంబం నన్ను హాస్టళ్లకు పంపింది. నా తల్లిదండ్రులకు మూడవ కుమార్తె ఉందని చాలా మందికి తెలియదు. నా తండ్రి నా కండ్లలోకి చూడడానికి నిరాకరించాడు. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండేదాన్ని. బాధ భరించలేక కొన్ని సార్లు ప్రాణం తీసుకోవాలనుకున్నాను' అని చెప్పింది సువర్ణ.
గాయం నుండి వచ్చే కోపం
అయినప్పటికీ జీవితంలోని కష్టాలను అధిగమించడానికి ఆమె మంచి స్నేహితులను సంపాదించుకుంది. అంతర్జాతీయంగా కీర్తిని పొందడం ప్రారంభించినప్పుడే తల్లిదండ్రులు ఆమె వద్దకు వచ్చారు. ఆమె ఎంతో బాధపడుతూ ''వికలాంగుడైన బిడ్డను కలిగి ఉన్నప్పుడు ఒక కుటుంబం వికలాంగమవుతుంది. తల్లిదండ్రుల ప్రేమను పొందే వికలాంగ పిల్లలు చాలా తక్కువ. అవసరమైన వయసులో మీకు ప్రేమ, ఆప్యాయత లభించకపోతే ఇక దాని వల్ల ఉపయోగం ఏమిటి? చాలామంది నన్ను ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తి అని పిలుస్తారు. గాయం నుండి వచ్చే కోపాన్ని వారు అర్థం చేసుకోలేరు'' అంటుంది.
అకాడమీని ప్రారంభిస్తా
అందుకే వికలాంగుల హక్కులపై నిరంతరం అవగాహన కల్పించాలనేది ఆమె ప్రణాళిక. ''నా తల్లిదండ్రులు నా గురించి గర్వపడేలా చేయడానికి నాకు 34 సంవత్సరాలు పట్టింది. కాబట్టి వికలాంగ పిల్లల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అకాడమీని కూడా ప్రారంభించాలనుకుంటున్నాను. తద్వారా వారు విజేతలుగా మారవచ్చు'' అని సువర్ణ తన మాటలు ముగించింది.
- సలీమ