Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనిలో సంతోషం, సంతృప్తి ఉన్నప్పుడే దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. రోజూ విపరీతమైన ఒత్తిడితో పని ప్రదేశంలోకి అడుగుపెడితే కెరీర్లో ఒక రకమైన నిర్లిప్తత, నిరాసక్తత ఆవహిస్తాయి. సుమారు 56 శాతం మంది ఉద్యోగినులు ఇలాంటి ఒత్తిడితోనే (వర్క్‌ప్లేస్ బర్నవుట్) సతమతమవుతున్నట్లు తాజాగా నిర్వహించిన డెలాయిట్ సర్వే పేర్కొంది. ‘Women@Work 2022 : A Global Outlook’ పేరుతో నవంబర్-2021 నుంచి ఫిబ్రవరి-2022 వరకు నిర్వహించిన ఈ సర్వేలో పది దేశాల నుంచి 5 వేల మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో భారత్ నుంచి 500 మంది ఉన్నారు.
- కిందటి ఏడాదితో పోల్చితే సుమారు 56 శాతం మంది ఉద్యోగినులు పని ప్రదేశంలో విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే తీవ్రంగా విసుగెత్తిపోయామని వారు చెబుతున్నారు.
- ఈ ఒత్తిడితోనే దాదాపు 40 శాతం మంది ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త ఉద్యోగ వేటలో పడ్డట్టు తెలిపారు.
- సర్వేలో పాల్గొన్న సగానికి పైగా మహిళలు రాబోయే రెండేండ్లలో తమ ఉద్యోగానికి రాజీనామా ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. వీరిలో కేవలం 9 శాతం మంది ఐదేండ్ల పాటు ప్రస్తుత సంస్థలోనే కొనసాగుతున్నారు.
- పనిచేస్తున్నప్పటికీ తమను ముఖ్యమైన సమావేశాలకు దూరంగా ఉంచుతున్నారని దాదాపు 60 శాతం మంది మహిళలు పేర్కొన్నారు.
- సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలిగించడం, పురుషాధిపత్యం ఉన్న కార్యకలాపాల్లోకి మహిళా ఉద్యోగుల్ని ఆహ్వానించకపోవడం, సాధారణ చర్చలకు దూరంగా ఉంచడం.. వంటివి భారత్‌లో పనిచేస్తోన్న ఉద్యోగినులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని సర్వే తేల్చింది. ఇలాంటి ఫిర్యాదులు 24 శాతం వరకే యాజమాన్యాల దృష్టికి వెళ్లాయని తెలిపింది.
- 87 శాతం మంది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మద్దతును యాజమాన్యం నుంచి పొందామని, పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యం గురించి సౌకర్యవంతంగా మాట్లాడగలిగామని పేర్కొన్నారు.
- లింగ సమానత్వం కోసం పాటుపడుతోన్న మహిళా ఉద్యోగుల్లో ఎక్కువ శాతం సానుకూల అనుభవాలను పొందినట్టు కేవలం 3 శాతం మంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు నివేదిక తెలిపింది.
- మనలో చాలామంది ఒత్తిడి, ఆందోళనల్ని చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. నిజానికి ఇవి శారీరకంగా, మానసికంగానే కాదు.. కెరీర్ పైనా నెగెటివ్ ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.
- అధిక ఒత్తిడి కారణంగా విపరీతమైన అలసట, బీపీ, శ్వాస సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, టైప్-2 మధుమేహం.. వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇంకొంతమందిలో అయితే ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.
- ఒత్తిడి మితిమీరితే డిప్రెషన్, కోపం, యాంగ్జైటీ, మనపై మనకే అసహ్యం కలగడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి వీటి నుంచి బయటపడడానికి మందులు వాడడం, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమూ ఏర్పడచ్చు.
- ఈ మానసిక సమస్య మనల్ని ఒంటరిగా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. నెరవేర్చాల్సిన బాధ్యతల నుంచి దూరం జరగడం, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వంటి దురలవాట్లను క్రమంగా దగ్గర చేస్తుంది.
- ఇక ఇలాంటి ఒత్తిడితో సరిగ్గా పనిచేయలేం.. ఒకవేళ చేసినా ఆ పనిలో అస్సలు సంతృప్తి ఉండదు. ఎప్పుడెప్పుడు ఆ కంపెనీలో నుంచి బయటపడదామా? సహోద్యోగుల నుంచి దూరమవుదామా? అన్న ఆలోచనలోనే ఉండిపోతారు. ఒక రకంగా ఇది మన కెరీర్‌ని దెబ్బతీసినట్టే.
- కెరీర్లో దూసుకుపోవాలంటే మనలోని నైపుణ్యాలు, సామర్థ్యమే మనకు బలం. అందుకే వాటిపై నమ్మకముంచాలి. మనలో ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి దరి చేరకుండా జాగ్రత్తపడచ్చు.
- మీరు చేస్తోన్న ఉద్యోగంలో మీకు సంతృప్తి ఉందా? లేదా? అనే విషయం గుర్తించండి. ఒకవేళ మీ లక్ష్యం అది కాదు అనుకుంటే.. మీ అంతిమ లక్ష్యమేదో దానిపై దృష్టి సారించాలి. ఈ దిశగా ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
- ఎంత బిజీగా ఉన్నా ఎవరికి వారు కాస్త సమయం కేటాయించుకోవాలి. అప్పుడే ఎలాంటి ఒత్తిడినైనా అధిగమించి నాణ్యమైన ఉత్పాదకతను సంస్థకు అందించచ్చు.
- ఉద్యోగులు తమలోని ఒత్తిడిని స్వయంగా గుర్తించేందుకు వీలుగా ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు, నిపుణులతో ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేసి వారికి వివరించాలి.