Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిరోజూ మంచినీళ్ళ సీసాలు, కూల్‌డ్రింక్ సీసాల పేరుతో ఎంతో ప్లాస్టిక్ వచ్చి చేరుతున్నది. ఈ మధ్య అనారోగ్యానికి వాడే టానిక్ సీసాలు, మందు సీసాలు కూడా ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయి. ఇలా ఇంట్లోనే ఎంతో ప్లాస్టికÊ వచ్చి కూర్చుంటోంది. మరి వీటి వలన ఎంత కాలుష్యం జరుగుతుందో తెలుసుకదా! ప్లాస్టిక్ కాలుష్యం భూమి, సముద్రాలను ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం ఒక మిలియన్ నుండి 8 మినియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తీరప్రాంతాల నుండి సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయి. ప్రతి సంవత్సరం ప్రపంచం 368 మిలియన్ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో కేవలం 9 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేయబడుతున్నది. మరో 12 శాతం ప్లాస్టిక్ కాల్చివేయబడుతుంది. పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించిన ఈ ప్లాస్టికÊ వ్యర్థాలు పర్యావరణానికి నష్టాన్ని కలుగజేస్తాయి. 90 శాతం పక్షుల శరీరాల్లో ప్లాస్టిక్ చెత్త ఉన్నదని, ఆవుల వంటి జంతువుల పొట్టలో ప్లాస్టిక్ సంచులున్నాయని తెలుస్తున్నది. అందుకే మనింటి కొచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను బయట పారేయకుండా పిల్లలు ఇష్టపడే ఎన్నో బొమ్మలు తయారు చేసుకోవచ్చు.
పిగ్గీ బ్యాంక్
స్ప్రైట్, కోకోకోలా వంటి కూల్డ్రింకు బాటిల్స్‌తో కిడ్డీ బ్యాంక్ తయారు చేద్దాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా మంది ఇళ్ళలో కూల్‌డ్రింగ్ బాటిల్స్ ఉంటాయి. అరలీటర్ బాటిల్ తీసుకుంటే సరిపోతుంది. పెప్సీ కానీ స్ప్రైట్ కానీ అరలీటర్ బాటిల్‌ను తీసుకొని మొత్తం రంగును వేసేయాలి. మూతి ఉన్న భాగంలో నాలుగు చుక్కలు పెట్టాలి. రెండు కళ్ళను కొద్దిగా పై భాగంలో పెట్టాలి. నలుపురంగుతో పెయింట్ చేయడం కానీ మార్కెట్లో దొరికే కళ్ళను తెచ్చి అతికించడం గానీ చేయవచ్చు. రెండు అట్టముక్కల్ని చెవుల వలె కత్తిరించుకోవాలి. దీనికి కూడా బాటిల్‌కు వేసిన రంగునే వేసుకోవాలి. అప్పుడు ఈ అట్ట ముక్కల్ని తెచ్చి కళ్ళు వెనకగా చెవుల వలె అతికించాలి. ఇప్పుడు పంది ఆకారంతో కనిపిస్తుంది. ఇది పిగ్గీ బ్యాంక్ అన్నమాట. ఇంకొక బాటిల్‌ను గుండ్రంగా కత్తిరించి దీనికి బేస్‌గా వాడాలి. అప్పుడు గుండ్రంగా ఉన్న బాటిల్ పడిపోకుండా నిలబడి ఉంటుంది. మరి ఇంతకీ చిల్లర కాయిన్స్ ఎటునుంచి వేయాలి? బాటిల్‌పై భాగాన చిన్న చీలిక లాగా కత్తిరించాలి. దాంట్లో నుంచి కాయిన్స్ లోపలకు వేయవచ్చు. పిల్లలకు డబ్బును దాచుకోవడం అనేది నేర్పించడానికి ఇది బాగా పనికొస్తుంది. పిల్లలకు ఇలాంటి ఇంట్లోనే తయారు చేసిస్తే చాలా బాగుంటుంది.
విమానం
ఒక లీటరు మంచినీళ్ళ బాటిల్‌తో విమానం చేద్దాం. ఇవన్నీ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బాటిల్ మీద తెల్లని పేపర్‌ను అతికించాలి. మూతి భాగం వదిలేసి మిగతా భాగమంతా అతికించాలి. బాటిల్‌కు రెండు వైపులా నాలుగు గుండ్రాలుగా కలర్ దిద్దాలి. విమానం కిటికీల మాదిరిగా స్కెచ్ పెన్నుతో దిద్దాలన్న మాట. ఇదంతా మనకు నచ్చిన రంగులో చేసుకోవచ్చు. అయితే నీలి రంగులో ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక అట్ట ముక్కను విమానం రెక్కల వల్లె కత్తిరించుకొని వాటికి కూడా రంగువేసి ఉంచాలి. ఒక వేళ రంగు వేయడం కష్టంగా ఉంటే పల్చని కాగితం తెచ్చి అతికించాలి. రెండు పేపర్ గ్లాసులను తీసుకొని వాటికి కూడా రెక్కలకు వేసిన రంగునే వేయాలి. ఈ పేపర్ గ్లాసుల మీదుగా విమానం రెక్కలు అతికించి బాటిల్‌కు రెండు వైపులా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు రెక్కల ఆకారం వస్తుంది. అలాగే బాటిల్ మూత దగ్గర కూడా ఒక అట్టను అతికించాలి. విమానానికి తోక లాగా పైకి ఉన్నట్టు ఉండే భాగాన్ని కూడా తయారు చేయాలి. అన్నీ గట్టి అట్టముక్కలతో చేయాలి. ఫాల్ అట్టలు, కొత్త షర్టులలో వచ్చే అట్టలు, చీరల్లో వచ్చే అట్టలు అన్నీ పనికొస్తాయి. విమానం బొమ్మకు నీలం రంగు ఉపయోగిస్తే ఎయిర్ ఇండియా విమానంలా ఉంటుంది. తోక భాగాన్ని తయారు చేశాం కదా. బాటిల్ పై భాగాన చీలిక పెట్టి, దాంట్లో ఈ అట్టను దూరిస్తే తోక వచ్చేస్తుంది.
పూలకుండీలు
లీటరున్నర, రెండు లీటర్ల పెప్సీ, స్ప్రైట్ బాటిల్స్‌తో పూల కుండీలు చేయవచ్చు. వీటి పొట్టలావుగా ఉంటుంది. కాబట్టి మట్టి పోసుకోవడానికి అనువుగా ఉంటుంది. రెండు లీటర్ల బాటిల్‌ను తీసుకొని మధ్యకు కత్తిరిస్తే రెండు ముక్కలు వస్తాయి కదా! అడుగు ఉన్న భాగం తీసకొని దానికి రంగులతో కానీ, రంగు కాగితాలతో కానీ, పూసలు, లేసులతో కానీ అలంకరించాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు ఈ బాటిల్స్‌ను పిల్లి, ఏనుగు, కుందేలు, గుర్రం వంటి ఆకారాలు వచ్చేలా తయారు చేసుకుంటే బాగుంటుంది. వీటికి బజార్లో దొరికే పెద్ద పెద్ద కళ్ళను పెడితే బాగుంటుంది. ఇక మనం అనుకున్నట్టు కత్తిరించిన బాటిల్ ఆకారాలు పెయింట్ చేశాక వాటిలో మట్టిని నింపి మొక్కలు పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌గా కూడా వాడుకోవచ్చు. టీపారు మీదగానీ, షింక్ దగ్గర కానీ పెట్టుకుంటే బాగుంటుంది.
ఫ్లవర్ వేజ్‌లు
అడుగున చదరంగా ఉండే మంచినీళ్ళ బాటిల్స్, లేదా మందుల సీసాలతో ఫ్లవర్ వేజ్‌లు చేసుకోవచ్చు. నిలబెట్టినపుడు పడిపోకుండా ఉండేందుకు అడుగు భాగం చదరంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు కూడా బాటిల్‌ను జంతువుల ఆకారంలో మలుచుకోవచ్చు. లేదంటే మామూలు ఫ్లోరల్ డిజైన్‌ను వేసుకోవచ్చు. దీనికి మూత తేసేసి వాడుకోవచ్చు. లేదంటే మూతను అలాగే ఉంచి దాని మధ్యలో ఒక రంధ్రాన్ని చేసి వాడుకోవచ్చు. ఇలా రంధ్రం చేసిన ఫ్లవర్‌వేజ్‌లో అయితే ఒకే ఒక్క కొమ్మను పెట్టుకోవడానికి వీలుంటుంది. మూతను మొత్తం తీసేస్తే పూల గుత్తిని పెట్టుకోవచ్చు. ఈ పూల గుత్తులు కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కుండీల్లో మొక్కలు చాలా వరకు ఎండిపోతాయి. కదా ఎండిన వేర్లయినా, ఆకులైనా, కొమ్మలయినా, రెమ్మలయినా రంగులు వేసి పూల కొమ్మలుగా మార్చవచ్చు.
స్టోరేజ్ బాక్సులు
పెప్సీ, కోకోకోలా వంటి అడుగు భాగం నాలుగు కాళ్ళులాగా ఉండే బాటిల్స్‌తో చిన్న చిన్న బాక్సులు, పర్సులు తయారు చేసుకోవచ్చు. వీటిలో చెవులకు పెట్టుకునే రకరకాల లోలాకులు, జడలకు పెట్టుకునే రబ్బరు బ్యాండ్లు ఇలా ఏవైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. లీటర్ బాటిల్ కింద భాగం నాలుగైదు అంగుళాలు ఉండేలా కత్తిరించాలి. వీటి అంచును ఐరన్ బాక్స్‌కు అంటిస్తే కోసు కోకుండా ఉంటుంది. తర్వాత ఇంకో బాటిల్ అడుగు భాగాన్ని ఒక అంగుళం ఉండేలా కత్తిరించాలి. దీన్ని కూడా కోసుకోకుండా ఐరన్ బాక్స్‌కు అతికిస్తే మొద్దుగా అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి జిప్ కుట్టుకుంటే పర్సులా ఉపయోగపడుతుంది. ఒకవేళ జిప్ కుట్టకపోయినా మూత విడిగా తీసే జువెల్లరీ బాక్స్లా ఉపయోగపడుతుంది. ఇది దూరంగా చూసినపుడు యాపిల్కాయలా కనిపిస్తుంది. అందుకే వీటికి ఎరుపు రంగు వేస్తే బాగుంటుంది. లేదంటే మీ కిష్టమైన రంగులు వేసుకోవచ్చు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్