Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడుగు జీవులు, శ్రామిక జనావళి ఆరోగ్య రక్షణకై నిరంతరం పరితపిస్తూ మానవత్వం ఉట్టిపడే వ్యక్తి డా. చిర్రావూరి శ్యామలాంబ. తన జీవితం మొత్తం నిస్వార్థసేవలతో, వైద్య విజ్ఞాన సేవకులందరికీ మార్గదర్శిగా చరితార్ధులయ్యారు. తల్లీ, బిడ్డల ఆరోగ్య రక్షణలో, పసిబిడ్డల పెంపకంలో తక్కువ ఖర్చుతో, సహజ సిద్ధంగా చిన్నారులను ఆరోగ్యంగా పెంచటంలో ఆమె ఇచ్చే సలహాలు అత్యున్నత పధంలో విలసిల్లుతున్నాయి. అవి పుస్తక రూపంలోకి కూడా తీసుకొచ్చారు. ఆ పుస్తకంలోని ఆమె వైద్య సలహాలు ప్రజాశక్తిలో ప్రతివారం సీరియల్‌గా కూడా అచ్చువేశారు. ప్రజల ఆరోగ్యానికి ఇంతటి సేవలు అందించిన ఆమె మే, 29 నాడు తన 72 ఏండ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
శ్యామలాంబ హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిలోఫర్ హాస్పిటల్లో సూపరెండెంట్‌గా పని చేసి రిటైరయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆమె ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. పేద మహిళలకు, పసిపిల్లలకు వైద్య సేవలు అందించారు. ఆమె దగ్గరకు వచ్చే రోగులకు కేవలం వైద్య సేవలు అందించడమే కాకుండా వారి కష్టసుఖాలను కూడా అడిగి తెలుసుకునేవారు. కొందరికి ప్రయాణం ఖర్చులు కూడా ఇచ్చిపంపేవారు.
ఇల్లే వైద్య సహాయ కేంద్రం
ఇటీవల కాలం వరకు శ్యామలాంబ ఆరోగ్యం క్షీణించినప్పటికీ పిల్లలకు వైద్యం అందిస్తూనే ఉన్నారు. ఆమె ఇల్లే ఒక వైద్య సహాయ కేంద్రంగా మారిపోయింది. ఇలా తన చివరి దశ వరకు మానవత్వ విలువలను చాటిన వైద్య విజ్ఞాన శాస్త్రవేత్త డా. శ్యామలాంబ. ఆమె తల్లీ, పిల్లల వైద్య నిపుణురాలైనా స్త్రీ, పురుషులందరి ఆరోగ్య సమస్యలకు తన వైద్య పరిజ్ఞానంతో ఏ రకమైన వ్యాధికైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారు.
ఇంటికి వెళ్ళిమరీ
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని మొటూరు ఉదయం ట్రస్టు భవనంలో మేము మెడికల్ క్యాంపులు పెడితే ఆమె తప్పకుండా వచ్చేశారు. నేను కనిపిస్తే ముందుగా శారద ఎలాగుంది అని మా అమ్మాయి శారదను గురించి అడిగేవారు. శారద అంటే ఎందుకో అంతగా అభిమానించేవారు. శారద ఆరోగ్యం బాగోలేదని తెలిసి వాళ్ళు చిక్కడపల్లిలో ఉండగా ఒకసారి ఇంటికి వెళ్లి చూశారు. తర్వాత శారద సంసారం ఇసీఐఎల్‌లోని ఎ.ఎస్.రావు నగర్‌కి మారితే అక్కడకు కూడా వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి హెచ్చరించి వచ్చారు. ఇలా ఎంత మందిని స్వయంగా కలిసి తన వైద్య సేవలు అందించారో. వైద్య వృత్తి పట్ల అంతటి నిబద్ధత ఆమెది. మానవతా విలువల, వైద్య విజ్ఞాన యుగకర్తగా ఆమె జీవితం అజరామరం.
ఆమె చరిత్ర మరువలేనిది
వీరోచిత తెలంగాణ ప్రజా పోరాటంలో, వీర తెలంగాణ యోధుల ఆరోగ్య రక్షణకై పంజాబ్ నుండి వచ్చిన ప్రముఖ డాక్టరు తులే (సత్యపాల్ తులే)కు సొంత బిడ్డ వలె, చిన్ననాడే వైద్యసేవలలో రాటు దేలి, వైద్యవిద్యార్ధిగా అభివృద్ధి అయిన శ్యామలాంబ తన గురువు డా.తులేకు ధీటుగా వైద్య విజ్ఞానం పొంది ప్రముఖ వైద్యాధికారిగా ప్రభుత్వ నిలోఫర్ హాస్పిటల్లో అత్యంత ఆదర్శవంతంగా సేవలందించిన ఆమె చరిత మరువలేనిది.
చక్రాల కుర్చీలోనూ వైద్య సేవలు
ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. నడవలేని, మాట్లాడలేని దశలో కూడా వైద్య సేవలు మానలేదు. ఆహారం లేదు. కొద్ది రోజులుగా కేవలం పండ్లరసాలే ఆమె ఆహారం. అయినా చక్రాల కుర్చీలో రోగులను చూసి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుని మందులు కాగితం మీద రాసి, తానే మందులు తెప్పించి ఇచ్చేవారు. ఇంట్లో భర్త, పనివాళ్లు ఎంత చెప్పినా వినకుండా శుష్కించి పోయిన శరీరంతోనే కేవలం తన మానసిక బలంతో సేవలందించారు.
తల్లీబిడ్డను క్షేమంగా మాకందించారు
నేను మొదటిసారిగా శ్యామలాంబను చూసింది ఒక ప్రమాదకర సంఘటనలో. అది 1982 జూన్ 5వ తేదీ రాత్రి 11 గంటల సమయం. నిలోఫర్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటరు గది గుమ్మం బయట నిలబడి ఉన్నారు. అది ఆమే అని అప్పటి వరకు నాకు తెలియదు. లోపల ఆపరేషన్ డ్యూటీలో ఉన్న డా.మైత్రేయి ''తల్లీ, బిడ్డా బతకడం కష్టం. ఇద్దరూ చనిపోతారు. తల్లి గర్భసంచిలో ఇప్పటి వరకు ఇటువండి కండిషన్ మేము ఎప్పుడూ చూడలేదు. కానీ ప్రయత్నిస్తాం'' అన్నారు. అది మా పెద్దమ్మాయి సరోజ ప్రసవ సమయం. ప్రమాదం తెలుసుకుని అల్లూరి సత్యనారాయణ అప్పటి సీఐటీయూ నాయకులు కా.భుజరంగరావు ఇంటికి వెళ్లి ఆయన సహాయంతో డా.శ్యామలాంబ ఇంటికి వెళ్లి ఆమె సహాయం కోరారు. వెంటనే ఆమెతో పాటు ఆమె భర్త కూడా కలిసి ఇద్దరూ కారులో హాస్పిటల్‌కు వచ్చి యూనిఫాం వేసుకుని డ్యూటీలో ఉన్న మైత్రేయికి తోడుగా నిలిచి ఆపరేషన్ పూర్తి చేశారు. అత్యంత ఆశ్చర్యకరంగా తమ చాకచక్యంతో తల్లీబిడ్డను క్షేమంగా మాకందించారు.
మానసిక శక్తి అద్భుతం
ఈమధ్య ఒకసారి డా.శ్యామలాంబకి ఫోన్ చేశాను. ఆమె భర్త ఫోను తీశారు. శ్యామలాంబ, మీరూ ఎలాగున్నారండి అని అడిగాను. ఆమె మాట్లాడలేదుకదమ్మా అన్నారు. మళ్లీ ఈ మధ్య ఒకసారి ఫోను చేశాను. బసవేశ్వర్రావుగారు ఈసారి ఫోను ఆమెకే ఇచ్చారు. శ్యామలాంబ ఫోనులో చాలా సన్నని స్వరంతో ఎలాగున్నారు? అన్నారు. అయ్యో మీకు ఓపిక లేదు మాట్లాడకండి అన్నాను. అయినా ఏదో చాలా నెమ్మదిగా చెప్పారు. నాకు అర్థం కాలేదు. అంతగా మంచాన్ని అంటుకుపోయి ఎముకల గూడులా ఉన్నా ఆమె మానసిక శక్తి అద్భుతం.
శ్రామికుల ఆరోగ్యం బాగుంటేనే
ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తర్వాత ఆమె మానసిక శక్తితోనే సేవలు అందించారు. తన చివరి మజిలో కూడా తన శక్తిని అద్భుతంగా రుజువు చేసుకున్నారు. కన్నుమూశారు. ''సమాజంలో మెజారిటీ సంఖ్యగా ఉన్న శ్రామికుల సంక్షేమం, ఆరోగ్యం బాగుంటేనే జాతికి మనుగడ. వారి అభ్యున్నతి కోసం కృషి చేయండి'' అనే సందేశానికి ఉదాహరణగా తన జీవితమంతా గడిపిన మహౌన్నత మానవతా మూర్తి అస్తమించారు. ఆమె సందేశం అజరామరం. ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనే, సమాజ సేవకులకు, అభ్యుదయ వాదులకు కర్తవ్యం కావాలి అని ఆశిస్తూ వైద్య ఆరోగ్య సేవలలో శ్యామలాంబ జీవిత కాలం ఒక స్వర్ణయుగం.
- అల్లూరి అమ్మాజీ