Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఎంతో మంది పోరాటాలు చేసి ఆత్మబలిదానాలు చేసి సాధించిన రాష్ట్రం మనది. ఇందులో మహిళ పాత్ర కూడా కీలకంగా ఉంది. తమ ఆకాంక్షలను నిజం చేసుకునేందుకు ఇంటి నుండి అడుగు బయట పెట్టి మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఎనిమిదేండ్ల తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఒరిగిందేమిటో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యమ నేతలు మనతో పంచుకుంటున్నారు.
మహిళల ఆక్షాంక్షలకు విలువ లేదు
తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల ఆకాంక్షలు కూడా చాలా ముఖ్యమైనవి. సింగరేణి కార్మికులు సమ్మె చేసిన, ఆర్టీసీ చక్రం తిరక్కుండా ఆగిపోయినా, యావత్ తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల నుండి కూలీ పని చేసుకునే వారి వరకు జీతాలు లేకుండా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతి దాంట్లో మహిళల భాగస్వామ్యం ఉంది. కుటుంబంలో మహిళలు పిల్లల సహకారం లేకుండా మగవారు ఉద్యమాల్లో పాల్గొనలేరు. ఇది ఒక భాగమైతే మరోకటి మహిళలంటే బోనాలు, బతుకమ్మలు మాత్రమే కాదు. వాటితో పాటు కీలకమైన పోరాట రూపాల్లో కూడా ఉన్నారు. అరెస్టులయ్యారు, జైలుకు వెళ్ళారు, ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఇక బిడ్డలను కోల్పోయిన తల్లుల గర్భశోఖాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా చాలా పోరాటాల్లో ఎక్కువగా మగవారి సంఖ్యనే ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మహిళలు ఇంతగా ఉన్నారంటే వాళ్ళ ఆకాంక్షలకు కూడా ప్రాధాన్యం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎలా ఉంది. అభివృద్ధిలో మహిళలకు స్థానం ఎక్కడుంది.
మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. వాటిపై చర్యలు తీసుకునే విషయంలో గత పాలకులకన్నా అధ్వాన్నంగా ఉన్నారు. గతంలో ప్రతి సంవత్సరం మహిళలపై జరుగుతున్న దాడులపై రివ్యూ జరిగేది. వివిధ శాఖలను, మహిళా సంఘాలను పిలిచి ఈ సమావేశాలు పెట్టేవారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. రాష్ట్ర వచ్చిన తర్వాత పూనం మాలకొండయ్య కమిటీ వేసి సిపార్సులు తీసుకున్నారు. అవి కేవలం సిఫార్సులుగానే మిగిలిపోయారు. అసలు మహిళలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి... అన్నింట్లో వాళ్ళను భాగస్వామ్యం చేయాలి, సాధికారత కల్పించాలి. అవేమీ లేకుండా ఆడవాళ్ళంటే పెండ్లి కోసమే పుట్టినట్టు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్లు పెట్టారు. మహిళల నిజమైన అభివృద్ధిని కోరుకోకుండా పెండ్లి చేసి పంపించేయడమే అని పాలకులు నిర్ణయించేశారు. ఒక ఫ్యూడల్ భావం ఇందులో క్లియర్గా మనకు కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టారు. రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో మహిళలు సగం ఉన్నారు. ఒక్క పించ్ఛన్లు తప్ప మహిళల అభివృద్ధి, రక్షణ గురించి నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదు. పెన్షన్లు ఒక్కటి ఇస్తే మహిళలు ఆత్మగౌరవంగా బతగలరా? కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై గతంలో ఇంత హింస లేదు. కులదురహంకార హత్యలు లేవు. కానీ ఇప్పుడు వాటి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యమంత్రి కనీసం వీటిపై నోరు విప్పడం లేదు. వీటన్నింటినీ పరిశీలించినపుడు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగలేదు.
- సంధ్య, పీఓడబ్ల్యూ
పెనంలో నుంచి పొయ్యిలో పడ్డాము
తెలంగాణ వచ్చినంత మాత్రాన మహిళలకు జరిగిందేమీ లేదు. గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇంకా సమస్యలు పెరిగిపోయాయి. రాష్ట్రం వస్తే అవకాశాలు పెరుగు తాయని భావించాం. విద్యా, వైద్యం, ఉపాధిలో తమకు ప్రాధాన్యం పెరుగుతుందని చాలా మంది కోరుకున్నారు. డ్వాక్రా మహిళలైతే వడ్డీలేని రుణాలు, పది లక్షల రుణాలు ఇస్తారని ఆశపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఏదో జరిగిపోతుందంటే నమ్మారు. బోనాలు, బతుకమ్మలు పట్టుకొని పోరాటంలో ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఎన్నో కోరుకుని మహిళలు పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంటి నుండి బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. తమ బతుకులు బాగుపడతాయని భావించారు. కానీ ఇప్పుడు కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తెచ్చి కేసీఆర్ కుటుంబం చేతిలో పెట్టినట్టుగా ఉంది. ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేయడం తప్ప మరేమీ లేదు. కవిత వచ్చి బతుకమ్మ పేరుతో పది కోట్లు ఖర్చు పెట్టి హంగామా చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కూడా కేవలం టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న వారికే ఇస్తున్నారు. ఆసరా పెన్షన్లు ఇప్పటి వరకు అతీగతి లేదు. మహిళ పేరు మీద భూమి ఇస్తామన్నారు. అది పక్కకు పోయింది. పది లక్షల రుణాలు అన్నారు. ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు. పొదుపు సంఘాల మహిళలకు సహకారం ఇచ్చి వాళ్ళకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. అదీ లేదు. విపరీతంగా మహిళలు, పిల్లల మీద దాడులు పెరిగిపోయాయి. మద్యం ఏరులై పారిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా ఉంది. మద్యం వల్ల హింస పెరిగిపోయి మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళల సమాధుల మీద పాలన కొనసాగిస్తున్నారు. షీటీమ్స్ అన్నారు గానీ వాళ్ళేం చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. సంవత్సరాల తరబడి కొట్లాడితే మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. అది కూడా కేవలం నామమాత్రం కోసమే ఉంది. దీని వల్ల మహిళలకు జరిగిందేమీ లేదు. మహిళా సంఘాలను పిలిచి ఏం చేయాలి అని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ దాడులు జరిగినపుడు ఎన్కౌంటర్లు చేసి చంపేస్తున్నారు. ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన దాడులు ఆగుతాయా? టీవీ షోలల్లో మహిళలను దారుణంగా కించపరుస్తున్నారు. వాటి గురించి పట్టించుకోరు. రాష్ట్రంలో మహిళల జీవితంలో ఎలాంటి మార్పు లేదు. కేవలం ఓట్ల కోసం మాత్రమే మహిళలను ఉపయోగించుకుంటున్నారు. పొదుపు సంఘాల మహిళలను డబ్బులు ఇచ్చి అధికార పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు.
- ఎన్.జ్యోతి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి
ఎలాంటి మార్పూ లేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ప్రజలు చేయని పోరాటం లేదు. ఇందులో మహిళలు ప్రధాన భూమిక పోషించారు. ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పడింది. చరిత్ర చూసినపుడు ఏ ఉద్యమం చూసినా మహిళల భాగస్వామ్యం ఎంతో ఉంది. జాతీయోధ్యమం కావొచ్చు, సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం కావొచ్చు, ప్రత్యేక తెలంగాణ పోరాటం కావొచ్చు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉద్యమం నడిపిన సాధించుకున్న రాష్ట్రం ఇది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహిళల జీవన విధానంలో మార్పు వస్తుందని ఆశించారు. కానీ ఆశలన్నీ అడిఆశలే అయ్యాయి. మహిళలకు ఇచ్చిన ఏ హామీలనూ పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. జిల్లాకు ఒక మహిళా పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ నీటి మీద రాతలుగా మారాయి.
ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆ రాష్ట్రానికి ఆర్థికంగా, సామాజికంగా ఓ ప్రణాళిక ఉండాలి. మన రాష్ట్రానికి అది లేదు. దానివల్ల పేదలు, సామాన్యులు, మహిళలు ఆర్థికంగా వెనకబడిపోతున్నారు. అసమానతలు పెరిగిపోతున్నాయి. అసంఘటితరంగంలో పని చేసి మహిళలకు ఉద్యోగ భద్రత లేక, శ్రమకు తగ్గ వేతనం రాక అభద్రతా భావంతో జీవిస్తున్నారు. కరోనా వల్ల ఉద్యోగాలు పోయిన మహిళలు కుటుంబాలను పోషించుకోలేక అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలపై మరింత భారం పడింది. పిల్లలకు తిండి లేక పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. గర్భిణీలు రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో మహిళలకు మొండిచెయ్యి చూపిస్తున్నారు.
మద్యం ఏరులై పారుతుంది. రాష్ట్రంలో చిన్న పిల్లలపై దగ్గర నుండి 60 ఏండ్ల మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మరోపక్క కులదురహంకార హత్యలు జరుగుతున్నాయి. దానికి మూలాలు ఏమిటో ఆలోచించి వాటిని రూపుమామే చర్యలను ప్రభుత్వం తీసుకోవడం లేదు. మహిళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో ముందుకు పోయినపుడే నిజమైన సాధికారత. ఇప్పటికైనా ఎన్నికల మ్యానిఫెస్టేలో మహిళల అభివృద్ధికి ప్రధాన పాత్ర ఇస్తాం అని స్పష్టం చేయాలి. లేకుంటే మహిళలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పితీరతారు.
- మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి