Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీర్తి జల్లి... ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. మనసున్న ఐఏఎస్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసరంటే పైనుంచి ప్రభుత్వ విధానాల అమలు పరచటమే వీరి పని అనుకుంటాం. వీరికి విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉన్నా కొంత మంది అధికారులు తమ పరిధి దాటరు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీకు మేమున్నాం అంటూ ప్రజల కష్టాల్లో అడుగులు వేయడానికి కూడా వెనుకడుగు వేయనివారు కొందరున్నారు. అలాంటి వారిలో ఆమె కూడా ఒకరు. అస్సాంలో ఇటీవలె వరదలు ముంచెత్తుతున్న సమయంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్ స్వయంగా ఆ మునిగిపోయిన ప్రాంతాలను పర్యవేక్షించారు. బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారిణి మట్టి, బురద, నీరు అనేది చూడకుండా ఆ ప్రాంతాలు కలియదిరడగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఆమె అధికారిగా ఉన్న అస్సాం ప్రజలు మాత్రమేకాదు దేశ వ్యాప్తంగా నీరాజనాలు పడుతున్నారు. ఆ ఆఫీసర్ తెలంగాణ బిడ్డ కావడం మనకు గర్వకారణం.
కీర్తి సొంతూరు జనగాం జిల్లా సమీపంలో ఓ చిన్న గ్రామం. తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. కీర్తి, ఐశ్వర్య. కనకయ్య ఇంటర్ చదువుతున్న సమయంలో తల్లి చనిపోవడంతో ఆయన హైదరాబాద్ వచ్చేశారు. అప్పటి నుండి ఉస్మానియా యూనివర్సిటో పరిధిలోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. తినడానికి తిండి లేకపోతే టీ, బిస్కేట్లు తిని ఆయన లా పూర్తి చేశారు. అలా ఆయన ఎంతో కష్టపడి చదువుకుని మంచి లాయరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రభుత్వ లాయరుగా నియమించబడ్డారు. తర్వాత బార్ కౌన్సెల్ అధ్యక్షులుగా కూడా పని చేశారు. ఆయన చదువుకునే సమయంలో వామపక్ష విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐతో పరిచయం అయింది. అవే భావాలను నేటికీ కొనసాగిస్తున్నారు.
ఆడపిల్లలకు చదువే ధైర్యం
ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని బంధువులు, స్నేహితులు కనకయ్యను జాలిగా చూసేవారు. కానీ ఆయన ఆడపిల్లలని ఎప్పుడూ దిగులుపడలేదు. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా అమ్మాయిలను స్వశక్తితో ఎదిగేలా చేశారు. చదువే అన్నింటికీ పరిష్కారమరి, ఆడపిల్లకు చదువే ధైర్యం ఇస్తుందని, బాగా చదువుకోవాలని చెప్పి పెంచారు. చిన్నప్పటి నుండి సమాజంపై అవగాహన కల్పించారు. తోటివారికి సాయం చేయాలని చెప్పేవారు. పుస్తకాలు కూడా బాగా చదివించేవారు. ఆ భావాలతోనే పెరిగిన అమ్మాయిలిద్దరూ బాగా చదువుకున్నారు.
ఇక పెండ్లి చేసేయమన్నారు
తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో 2011లో బి.టెక్ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరికైన ఐఏఎస్ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువుల్లో ఎవరూ అప్పటి వరకు ఐఏఎస్‌కు వెళ్లలేదు. ఒకపక్క చదువు పూర్తయిన వెంటనే ''అమ్మాయికి ఇక పెండ్లి చేయండి, ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారు'' బంధువులు అంటుండేవారు. కాని కీర్తి తండ్రి కనకయ్యకు కూతుర్ని ఐఏఎస్ చేయాలని పట్టుదల. చిన్నప్పటి నుంచి ఆయన ఎంతోమంది ధీర మహిళలను ఉదాహరణగా చూపిస్తూ కీర్తిని పెంచారు. ఐ.ఏ.ఎస్ కోచింగ్‌లో చేర్పించారు. రెండేండ్లు కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండి కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకూ సాధించింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా...
ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం వచ్చింది. జోర్హట్ జిల్లాలోని తితబార్ ప్రాంతానికి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా కీర్తి నియమించబడ్డారు. అప్పుడే 2016 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. తన కృషికిగాను నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 'బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డ్' అందుకున్నారు.
రక్తహీనతపై యుద్ధం
2019లో హైలాకండి జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడి ప్రజలు ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే మహిళా కార్మికులు రక్తహీనతతో బాధ పడుతున్నారు. పిల్లల్లో పౌష్టికాహారలోపం విపరీతంగా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె స్త్రీలలో రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి 'ఉసిరి మురబ్బా' (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి అందరికీ పంపిణీ చేయించారు. దాంతో మంచి ఫలితాలు వచ్చాయి.
పిల్లల కోసం ప్రత్యేకంగా..
కీర్తిది ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించే మనస్తత్వం. ఆ ఆలోచనల్లో భాగంగానే అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి భోజనాన్ని క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది. అంగన్వాడీ కేంద్రాలలో 'డిబ్బీ ఆదాన్ ప్రధాన్' అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్ తాము తింటారు. దాని వల్ల వేరే రకాల ఆహార పదార్థాలు తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి మంచి కీర్తి తెచ్చి పెట్టింది.
పెండ్లి కూడా చాలా సింపుల్‌గా
2020 సెప్టెంబర్ 10 ఆమె పూణేకు చెందిన ఆదిత్యను వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరికీ పరిచయం. ఇద్దరి భావాలు ఒకటే కావడం, సమాజం పట్ల అవగాహన వీరి స్నేహాన్ని ప్రేమగా మార్చింది. అయితే కీర్తి వివాహం కూడా చాలా సాదాసీదాగా జరిగింది. అస్సాంలోని 'కచార్' జిల్లా హెడ్‌క్వార్టర్స్ అయిన 'సిల్చార్'లో కొంత మంది ప్రభుత్వ ముఖ్యాధికారులకు సెప్టెంబర్ 10న ఇంట్లో పూజ ఉంది రండి అని ఆహ్వానం అందింది. జిల్లాలోని ముఖ్యాధికారులు ఆ రోజు కీర్తి బంగ్లాకు చేరుకున్నారు. అక్కడకు వెళ్లాక మొత్తం 25 మంది అతిథులు కనిపించారు. తాము వచ్చింది కేవలం పూజకు మాత్రమే కాదనీ కీర్తి వివాహానికి అని అక్కడకు వెళ్ళేవరకు వారికి తెలియలేదు. తమ జిల్లా ముఖ్యాధికారి అంత నిరాడంబరంగా పెండ్లి చేసుకోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆనందించారు. అయితే జూమ్ ద్వారా ఈ వివాహాంను మరో 800 మంది బంధుమిత్రులు వీక్షించారు. ఆ సమయంలో కరోనా సోకడంతో తల్లిదండ్రులు పెండ్లికి హాజరుకాలేకపోయారు. కేవలం చెల్లెలు ఐశ్వర్య మాత్రం అమ్మాయి తరఫున హాజరయ్యింది. మరో గొప్ప విషయం ఏమిటంటే పెండ్లి తర్వాత కీర్తి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. తర్వాత రోజే విధులకు హాజరయింది.
ఒక్క ఉదాహరణ చాలు
2020 మే నెల నుంచి కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్ నియంత్రణ కోసం పోరాటం చేసింది కీర్తి. సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్ పేషెంట్స్‌కు సరిపోయేది కాదు. దాంతో కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్ నిర్మాణం జరుగుతోంది. పెండ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి వెళ్ళారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పని పట్ల, బాధ్యతల పట్ల, ప్రజల పట్ల ఆమెకున్న నిబద్ధత ఎలాంటిదో. వాస్తవానికి కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె ఎప్పుడూ కోరుకుంటుంది. మహిళా సాధికారతకోసం, రైతుల కోసం, ఎడ్యుకేషన్ కోసం తాను కృషి చేస్తానని తాను బాధ్యతల్లో చేరిన కొత్తలోనే కీర్తి ప్రతిజ్ఞ చేశారు. ఆ బాటలోనే పయనిస్తున్న ఆమె ఇప్పుడు ఎంతోమందితో కీర్తించబడుతున్నారు.
కీర్తికి క్రియేటివిటీ ఎక్కువ
నేను మొదటి నుండి నమ్మిన అభ్యుదయ భావాలను నా పిల్లలకు చెప్తూ పెంచాను. వారు కూడా నా మాటలు విని చక్కగా చదువుకున్నారు. తను ప్రజల కోసం సేవ చేస్తున్న తీరు చూస్తూ చాలా సంతోషంగా అనిపించింది. పోయిన జనవరి 26కు నేనూ నా భార్య కలిసి అస్సాంకి వెళ్ళాం. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు మేము కూడా పోతే మేము కీర్తి తల్లిదండ్రులమని తెలిసి అందరూ మా దగ్గరకు వచ్చి మీ అమ్మాయి ఎంత మంచి ఆఫీసర్ అంటూ పొగుడుతుంటే గొప్పగా అనిపించింది. కీర్తి ఎప్పుడూ క్రియేటివిటీగా ఆలోచిస్తుంది. అలాంటి కొత్త కొత్త ఆలోచనలతోనే ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది.
- జల్లి కనకయ్య, కీర్తి తండ్రి
నాన్న నుండే నేర్చుకున్నాను
మానాన్న చిన్నప్పటి నుండి చదువు గొప్పదనం ఏంటో చెప్తూ పెంచారు. కలం గొప్పదా కత్తి గొప్పదా అంటే కలమే గొప్పది అని చెప్పేవారు. పుస్తకాలు కూడా విపరీతంగా చదివించేవారు. మా అమ్మ కూడా చిన్నప్పటి నుండి నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహించేది. ఈ రోజు నేను ఇలా ప్రజల కోసం పని చేస్తున్నానంటే అది మానాన్న నుండి నేర్చుకున్న భావాలే. అసలు నేను ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి కూడా ఆ భావలే కారణం. ప్రజలకు మనకు చేతనైన సాయం చేయాలి అని నాకూ చెల్లికి నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు.
- కీర్తి జల్లి
- సలీమ