Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ర్యాంకింగ్‌లో మహిళా అభ్యర్థులు టాప్ 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. మే 30వ తేదీ నాడు 2021 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామిని సింగ్లా మొదటి మూడు స్థానాల్లో నిలవడం ఒక చారిత్రాత్మక క్షణం... ఐశ్వర్య వర్మ నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొత్తం అభ్యర్థుల్లో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు ఉన్నారు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కి అధికారులను ఎంపిక చేయడానికి సివిల్ సర్వీస్ పరీక్షలు మూడు దశల్లో... ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. పరీక్ష ప్రాథమిక లేదా రాతపూర్వక భాగం జనవరి 2022లో నిర్వహించారు. ఈ సంవత్సరం ఏప్రిల్, మేలో ఇంటర్వ్యూలు జరిగాయి.
శృతి శర్మ
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల పూర్వ విద్యార్థి శృతి శర్మ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె జామియా మిలియా ఇస్లామియాలోని రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో చేరారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆమె యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమవుతుంది.
అంకితా అగర్వాల్
అంకిత స్వస్థలం కోల్‌కతా. ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ (ఆనర్స్)లో గ్రాడ్యుయేట్ అయిన అంకిత ఐఏఎస్ అధికారి కావాలనే తన ఆకాంక్షను కొనసాగించడానికి ముందు ఒక సంవత్సరం పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసింది. ఆమె గతంలో 2019లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై మొత్తం మీద 236వ ర్యాంక్‌ను సాధించింది.
గామిని సింగ్లా
పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల (పీఇసీ) చండీగఢ్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. గామినికి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అధికారి కావాలని కోరిక. ఇప్పటికి ఆమె కల నిజమైంది. యూపీఎస్సీ ఫలితాలు ప్రకటించిన తర్వాత మొదటి ఐదు స్థానాల్లో నలుగురు మహిళలు నిలవడంతో సోషల్ మీడియాలో విసృతమైన ప్రచారం జరుగుతుంది. 'ఫ్యూచర్ ఈజ్ ఫిమేల్' వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీరి స్ఫూర్తితో భవిష్యత్‌లో మరింత మంది మహిళలు తమ కలలను నిజం చేసుకోవాలని కోరుకుందాం.