Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెక్నాలజీలో కొత్త శకం ఆరంభమయ్యాక ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వినియోగం ఎక్కువైంది. సాంకేతిక విప్లవంలో భాగంగా నెట్ వినియోగం, కంప్యూటర్ల వాడకం పెరిగిపోయింది. కంప్యూటర్, వైఫై లేని ఇల్లే లేదు. ప్రతి చిన్న పనికీ కంప్యూటర్ మీదే ఆధారపడుతున్నాం. మానవ జీవితంలో కంప్యూటర్ల రాక వలన కొన్ని కష్టసాధ్యమైన పనులు సులభంగా మారినప్పటికీ అన్నింటికీ వాటిపై ఆధారపడటం మంచిది కాదు. ఎందులోనైనా అతివినియోగం ఎప్పుడూ అనర్థదాయకమే. దీంతో ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వ్యర్థాలు ప్రతి ఇళ్ళలో పేరుకుపోవడం మొదలయ్యాయి. దీనిని 'ఇవేస్ట్'గా వ్యవహరిస్తున్నారు. ఇంకా మనం ప్లాస్టిక్‌నే వెళ్ళగొట్టలేకపోయాం. భవిష్యత్‌లో 'ఇవేస్ట్' అంతకన్నా పెద్ద ప్రమాదాన్నే సృష్టించవచ్చు. టీవీలు, వాషింగ్ మెషీన్లు, గ్రైండర్లు వంటి గృహౌపకరణాల్లో రోజుకో మోడల్ వస్తున్నందున పాత మోడల్స్ రిపేరు చేయటానికి విడి భాగాలు దొరకక పార వేయాల్సి వస్తున్నది. కొద్ది మార్పులతో కొత్త వాటికి అనుమతి ఇస్తున్నందున ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సరే మనమయితే 'ఇవేస్ట్'లో భాగమైన సీడీలతో కొన్ని బొమ్మలు తయారు చేద్దాం.
గడియారం
మొదటగా పనికిరాని సీడీతో గడియారాన్ని తయారు చేద్దాం. సీడీ మెరుస్తూ, నున్నగా ఉండటం వల్ల ఏ అలంకరణకైనా సూటవుతుంది. గడియారం చేద్దామనుకున్నాం కాబట్టి మొదటగా అంకెల్ని తయారు చేద్దాం. మన ఇంట్లో ఉన్న పాత క్యాలెండర్‌ను తీసుకోండి. పెద్ద పెద్ద అంకెలున్న క్యాలెండర్ అయితే బాగుంటుంది. ఒకే రంగులో ఉన్న అంకెల్ని కత్తిరించి పెట్టుకోవాలి. లేకపోతే రంగులున్న అంకెల్ని కూడా పెట్టుకోవచ్చు. ఒకటి నుంచి పన్నెండు దాకా అంకెల్ని కత్తిరించి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు గడియారం అలంకరణ మొదలు పెడదాం. ఒక గట్టి అట్టను తీసుకొని ఏదో ఒక ఆకారంలో కత్తిరించుకోవాలి. అంటే నేను పువ్వులాగా కత్తిరించాను. దాని మీద పసుపు, ఎరుపు రంగుల కాగితాలతో అతికించాలి. ఇలా పువ్వు ఆకారమే కాదు, ఏదైనా జంతువు ఆకారంలో కూడా చేసుకోవచ్చు. డాల్ఫిన్, చేప, గుర్రం, ఒంటె ఏ ఆకారమైనా కత్తిరించుకోవచ్చు. ఇలా రంగుల కాగితాలతో అలంకరించిన అట్టను తీసుకొని, దానిపై ఈ సీడీని అతికించుకోవాలి. ఇప్పుడు సీడీ మీద అంకెల్ని వరసగా అతికించాలి. పేపర్‌ను కత్తిరించి రెండు ముళ్ళు తయారు చేసి మధ్యలో అతికించాలి. దీన్ని ఇలా బొమ్మ రూపంలోనైనా ఉంచవచ్చు. లేదా బ్యాటరీ అమర్చుకుంటే నిజమైన గడియారం అయిపోతుంది. సీడీ మధ్యలో రంధ్రం ఉంటుంది కాబట్టి దాంట్లో నుండి వైర్లు బ్యాటరీ ఫిక్స్ చేయవచ్చు. సీడీ మీద అంకెల్ని పెయింట్ కూడా చేయవచ్చు.
ఫొటోఫ్రేమ్
సీడీతో ఫొటో ఫ్రేములు తయారు చేయవచ్చు. చాలా బాగుంటుంది. నాలుగు సీడీలను తీసుకోవాలి. మన ఫ్యామిలీ ఫొటోఫ్రేమ్ చేసుకోవాలంటే నాలుగు కావాలి కదా! ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యుల ఫొటోలను తీసి పెట్టుకొని వాటిని గుండ్రంగా కత్తిరించుకోవాలి. లేదా ఏదో ఒకక ఆకారంలో కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించిన ఫొటోలను నాలుగు సీడీలపై అతికించాలి. ఇలా అతికించాక చుట్టూ ఉన్న ఖాళీలో లేస్‌ను కానీ అద్దాలను కానీ అతికించుకుంటే బాగుంటుంది. పొడుగాటి లావుపాటి తాడును తీసుకొని సీడీలను వరస క్రమంలో అతికించాలి. అమ్మ, నాన్న, పిల్లల ఫొటోలు వరసగా అతికించాలి. ఈ తాడు చివర గంటలు, పూసలతో అలంకరిస్తే బాగుంటుంది. పై భాగాన తాడును తగిలించుకునే విధంగా ముడేయాలి. ఇంకా ఈ నాలుగు సీడీలతో వంశ వృక్షం లాగా కూడా తయారు చేయవచ్చు. ఒక చెట్టు ఆకారాన్ని వేసుకొని నాలుగు కొమ్మల్లో నాలుగు ఫొటోలు పెడితే బాగుటుంది. నాలుగు సీడీలను అటీన్ ఆకారంలో కూడా అతికించుకుని ఒకచోట పెట్టుకోవచ్చు. ఫొటో ఫ్రేములను ఎలాగైనా అలంకరించుకోవచ్చు. మనం తినే చిప్స్ ప్యాకెట్ వంటి వాటిని ఒకే ఆకారంలో కత్తిరించి వాటిని కూడా అలంకారంలో వాడవచ్చు. సీడీల ఫొటో ఫ్రేములు చాలా అందంగా ఉంటాయి.
జంతువులు
సీడీలతో రకరకాల జంతువుల్ని సృష్టించవచ్చు. పెద్ద పొట్ట ఉన్న జంతువుల్ని ఎంచుకుంటే సీడీలతో సులభంగా చేయవచ్చు. అంటే తాబేలు ఉన్నదనుకోండి. శరీరాన్ని సీడీతో అమర్చవచ్చు. తర్వాత కాళ్ళు, తల, తోక అమరిస్తే సరిపోతుంది. తల, కాళ్ళు, తోకలను అట్ట ముక్కలతో తయారు చేసుకోవాలి. అంటే ఒక పెద్ద అట్టను తాబేలు ఆకారంలో కత్తిరించుకుని పొట్ట దగ్గర సీడీని అతికిస్తే సులభంగా చేయవచ్చు. ఇప్పుడు సీడీ మీద అంటే తాబేలు శరీరాన్ని పెయింట్ చేసుకోవచ్చు. లేదా పూసలు, తళుకులతో అలంకరించవచ్చు. కళ్ళ కోసం నల్లటి పెద్ద గుండీలను వాడుకోవచ్చు. ఇలాగే పులిని కూడా చేయవచ్చు. దీనికి రెండు సీడీలు కావాలి. ఒక సీడీ తల కోసం వాడాలి. ఒక సీడీ శరీరం కోసం వాడాలి. తల కోసం వాడే సీడీలో పెద్ద కళ్ళు, పులి ముక్కు, మూతి వచ్చే విధంగా పెయింట్ చేయాలి. లేదా కాగితాలు కత్తిరించి అతికించాలి. తల చుట్టూ పసుపు రంగుతో జుట్టు వచ్చేలా అట్టను అతికించాలి. దానికి చెవులు కూడా పెట్టాలి. శరీరం సీడీకి అట్ట కాళ్లు తయారు చేసి అతికిస్తే పులి బొమ్మ తయారవుతుంది. ఇలాగే నత్త బొమ్మను కూడా చేయవచ్చు. నత్త శరీరం మీదుండే మూపురానికి సీడీని వాడాలి. సీడీ మీద గుండ్రంగా తిరుగుతున్నట్లుండే లేస్‌ను అతికించాలి. వలయాకారపు శరీరాన్ని సూచిస్తున్నట్టుగా ఉండాలి. మిగతా శరీరాన్ని అట్టముక్కతో, రంగు కాగితాలతో తయారు చేయాలి.
పూల కొమ్మలు
సీడీలతో పూల కొమ్మల్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క పువ్వున్న కొమ్మలాగా చేయవచ్చు. ఒక సీడీని తీసుకొని మధ్యలో ఉండే పుప్పొడి లాగా మార్చి దాని చుట్టూ రెక్కలు అతికించుకోవాలి. ఎరుపురంగు, పసుపురంగు కాగితాలను రెక్కలుగా కత్తిరించాలి. రెక్కలు రకరకాల ఆకారాల్లో కత్తిరించవచ్చు. ఈ రెక్కల్ని సీడీ చుట్టూతా అతికిస్తే పువ్వులా తయారవుతుంది. దీనికి ఒక ఐస్‌క్రీం పుల్లను అతికిస్తే కాడలా ఉపయోగపడుతుంది. ఈ కాడకు ఒక ఆకు అతికిస్తే పూల కొమ్మ తయారవుతుంది. మధ్యలో పసుపు రంగు కాగితం ముక్కలు కానీ, విత్తనాలను కానీ అతికిస్తే సరిపోతుంది.
గ్రీటింగ్ కార్డ్
సీడీలను ముత్యాలు, బీడ్స్‌తో అలంకరించవచ్చు. వీటి మీద ఐలవ్యూ రాస్తే గ్రీటింగ్ కార్డ్‌లా ఉపయోగపడుతుంది. రంగురంగుల కుందన్స్, రాళ్ళు, ముత్యాలు ఏది బాగుంటుందనిపిస్తే అది తెచ్చి అందంగా అలంకరించాలి. రెండు మూడు సీడీలు ఇలా అలంకరించి ఒక తాడుకు అతికిస్తే గోడకు వేలాడదీసుకోవచ్చు. లేదంటే సీడీ వెనకవైపు డబుల్‌వే స్టిక్కర్ అతికించుకుంటే గోడకు డైరెక్ట్‌గా అతికించేసుకోవచ్చు. చీరలు కుట్టుకునేటప్పుడు మిగిలిపోపయిన పూసలు, బీడ్స్‌ను ఇలాంటి వాటికి ఉపయోగించవచ్చు. రంగురంగుల వస్త్రపు ముక్కల్ని కూడా కత్తిరించి సీడీని డెకరేట్ చేయవచ్చు. మీ క్రియేటివిటీ మీ ఇష్టం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్