Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామూలుగా చాలా ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో పెడితేగానీ నోట్లో ముద్ద కూడా పెట్టుకోరు చిన్నారులు. స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో కూడా తల్లిదండ్రులకు చెప్పేస్తుంటారు పిల్లలు. అయితే కరోనా నాటి నుండి ఫోన్లకు పిల్లలు అతుక్కుపోవడం ఇంకాస్త పెరిగింది. అప్పటి వరకు పాఠశాలకు వెళుతూ, పుస్తకాలతో, ఆటలతో కాలం గడిపేస్తున్న పిల్లలకు ఒక్కసారిగా లాక్ డౌన్ రావడంతో వాళ్ల జీవితాలు మారిపోయాయి. కరోనా నిబంధనల మేరకు పాఠశాలలు లేకపోవడంతో పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు ఆన్లైన్ క్లాసులు పేరుతో మొబైల్ ఫోన్లను పట్టుకోవాల్సి వచ్చింది.
అయితే పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్లైన్ క్లాసులు పేరు చెప్పి గేమ్స్ ఆడుతూ బానిసలవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పిల్లలు ఎక్కువ సమయం గడుపుతున్నారు. చాలా మంది పెద్దలపై కూడా సోషల్ మీడియా ప్రభావం గట్టిగానే ఉంది. గంటలు, రోజుల తరబడి సోషల్ మీడియాలో గడిపేస్తుంటారు కొందరు. అయితే సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్‌లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న అంశంపై పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ నెలలో అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, చైనాతోపాటు భారత్ ఈ సర్వే నిర్వహించారు.
సర్వేలో భాగంగా మొత్తం 3100 మంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీడియో గేమ్స్ కూడా పిల్లలపై సానుకూల ప్రభావమే చూపిస్తోందని, వీడియో గేమ్‌లు పిల్లల మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయని ఈ సర్వేలో పాల్గొన్న 40శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియా వల్ల ఇదే విధమైన ప్రభావం ఉన్నట్లు, సోషల్ మీడియాతో పిల్లల తెలివితేటలు పెరుగుతాయని 30శాతం మంది తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం. అయితే పాఠశాలలు ఆన్లైన్, వర్చువల్ పద్ధతిలో బోధన తగ్గించాలని సర్వేలో పాల్గొన్న 80శాతం మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు.