Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2019లో వడోదరలోని విశ్వామిత్ర నదికి అనుసంధానించబడిన భుఖీ ప్రవాహాన్ని శుభ్రం చేయడానికి ముందుకు వచ్చింది స్నేహ షాహి. దానికోసమే స్వచ్ఛంద సేవకుల బృందానికి నాయకత్వం వహించింది. ఆ బృందం 700 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను అందులోనుంచి తొలగించారు. అప్పటి వరకు కనుమరుగైన మొసళ్లు మళ్ళీ ఆ ప్రవాహంలో తమ జీవనాన్ని ప్రారంభించాయి.
స్నేహ షాహి వడోదరలోని మహారాజ్ సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విద్యార్థిగా ఉన్నప్పుడు UNEP ప్లాస్టిక్ టైడ్ టర్నర్ ప్రోగ్రామ్‌కు సంతకం చేసింది. ఇది 300 మంది విద్యార్థులను ఒకచోట చేర్చింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచింది. బీహార్‌కు చెందిన స్నేహ తన తండ్రి వైమానిక దళంలో ఉండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి నివసించింది. ఆమె కుటుంబం వడోదరలో స్థిరపడిన తర్వాత ఆమె ఎంఎస్ చేసేందుకు యూనివర్సిటీలో చేరింది.
అధ్యయనం చేస్తున్నాను
''మనం చాలా ప్రయాణించినప్పుడు, చాలా ప్రదేశాలను దగ్గరగా చూసినప్పుడు, ఆ పరిసరాలు మనం చూసినపుడు ఎలా ఉన్నాయో, అసలు గతంలో ఎలా ఉన్నాయో అనే విషయాలను గమనించడం ప్రారంభిస్తాం. అలాగే నేనూ కూడా వాటి గురించి మరింత అధ్యయనం చేయడం ప్రారంభించాను. వివిధ పర్యావరణ వ్యవస్థలలోని కనెక్టివిటీని, వ్యక్తులలో, ప్రకృతితో వారి సంబంధాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను'' అని స్నేహ అంటుంది.
ప్లాస్టిక్ టైడ్ టర్నర్
2019లో స్నేహ ప్లాస్టిక్ టైడ్ టర్నర్ ప్రచారంలో పనిచేయడం ప్రారంభించింది. దీనికి యూనివర్సిటీతో పాటు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా సహకారం అందించింది. ''సుమారు 200 మంది కళాశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పర్యావరణ శాస్త్ర విభాగం నుండి 90 మంది చేరారు. ప్లాస్టిక్ గురించి సర్వేలు నిర్వహించడంలో, వాటాదారుల సంబంధాలను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తున్నారు. మేము చాలా మంది పోలీసు అధికారులను, స్థానిక అధికారులను, దుకాణదారులను ఇంటర్వ్యూ చేసాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఏమిటో, ప్లాస్టిక్‌పై వారి అవగాహన ఏమిటో, దాని గురించి వారు అర్థం చేసుకున్నారో, ప్లాస్టిక్‌ను అంతం చేయకూడదని వారికి వివరించడానికి పెద్ద సంఖ్యలో వ్యక్తులను సర్వే చేసాము'' ఆమె చెప్పింది.
నిర్లక్ష్యం చేయబడతాయి
టైడ్ టర్నర్ క్యాంపెయిన్‌లో పనిచేస్తున్నప్పుడు స్నేహ, ఆమె బృందం విశ్వామిత్ర నదికి అనుసంధానించబడిన 7.5 కిలోమీటర్ల పొడవు గల భుఖి అనే పట్టణ ప్రవాహాన్ని చూశారు. మొదట్లో ఇది నాలా (డ్రెయిన్) అని వారు భావించారు. కానీ మ్యాపింగ్‌లో ఇది సహజమైన నది అని తేలింది. అయితే ఇది మునిసిపాలిటీచే గుర్తించబడలేదు. ఎందుకంటే ఇలాంటి చిన్న విషయాలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయి. వాటి వల్ల ఉపయోగం లేదని పట్టించుకోవడం మానేస్తారు.
వ్యర్థాలతో మూసుకుపోయింది
''అయితే వరదల నిర్వహణకు, పట్టణ జీవవైవిధ్యాన్ని నిర్వహించడానికి అవి చాలా కీలకమైనవి. భుఖీ ప్రవాహ లోతైన కోణాన్ని పరిశీలించినప్పుడు జంతువులు, ప్రత్యేకంగా మొసళ్ల కదలికలు లేనంత వరకు ప్లాస్టిక్లు, ఘన వ్యర్థాలతో అది మూసుకుపోయిందని మేము తెలుసుకున్నాము'' అని ఆమె వివరిస్తుంది. స్నేహతో పాటు ఆమె చదివే ఎంఎస్ విశ్వవిద్యాలయం నుండి 10 మంది జూనియర్లు కలిసి పెద్దఎత్తున దీనికోసం పనిచేశారు.
అవగాహన పెంచడం ద్వారానే
మట్టితో, నీటితో, వ్యర్థాలతో... ఇలా మూడు రకాలైన డేటాను సేకరించారు. డేటాను సేకరించడం, ప్రచురించడం వల్ల పని జరగదని వారు గ్రహించారు. అందుకే దీనిపై అవగాహన పెంచడం ద్వారా మానవ కోణాన్ని ఎందుకు చేర్చకూడదనే ఆలోచన వచ్చింది. ''ఇది అవగాహన కార్యక్రమంతో ప్రారంభమైంది. నెమ్మదిగా నదిలోని చాలా వ్యర్థాలు తొలగించబడ్డాయి. దానిని మరింత బలోపేతం చేయడానికి నది ఒడ్డున స్థానిక తోటలను పెంచవచ్చని ప్రజలకు చూపించే ప్రయత్నంలో ఇది కొద్దిగా ఇంజనీరింగ్‌లోకి వెళ్లింది. సీతాకోకచిలుకలు, పక్షులను అక్కడకు రప్పించడానికి నాటిన స్థానిక మొక్క జాతులు ఏమిటో అర్థం చేసుకోవడంలో ఇది మాకు సహాయపడింది'' ఆమె జతచేసింది.
ప్రమాదకరమైన ప్రదేశం కాబట్టి
ఈ విధంగా చిన్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం ప్రారంభించారు. విశ్వవిద్యాలయం నుండి వారికి 300 మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వ్యర్థాలను శుభ్రం చేయడంలో సహాయం చేసారు. ''మొసళ్ల కారణంగా ఇది ప్రమాదకర ప్రదేశం. కాబట్టి మేము నాలుగు నుండి ఐదు గంటలు మాత్రమే శుభ్రం చేయగలిగాము. సుమారు 700 కిలోల ప్లాస్టిక్‌ను తొలగించాము. దానిలో కొంత భాగాన్ని ఆల్కహాల్ ఉపయోగించి మౌల్డింగ్ చేయడం ద్వారా రీసైకిల్ చేసాము. మిగిలిన వాటిలో వైద్య వ్యర్థాలు లేదా గాజు, రసాయన వ్యర్థాలు అన్నీ ట్రాక్టర్ల ద్వారా పల్లపు ప్రదేశాలకు తరలించాము'' ఆమె చెప్పింది.
ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం
నది శుభ్రం చేసిన తర్వాత వర్షా కాలంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వారు చూసే మొసళ్ళు క్రమంగా కనిపించడం ప్రారంభించాయి. బృందం వాటిని పర్యవేక్షిస్తూనే ఉంది. వారు కూడా తమ పెరట్లోకి వెళ్లి చిన్న చిన్న సమస్యల కోసం పరిష్కారం వెతుక్కోవచ్చని ఎక్కువ మంది ప్రజలు గ్రహించేలా చేయడమే వారి లక్ష్యం. ఇది మంచినీటి వనరుల గురించి అవగాహన పెంచడం, వాటిపై ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించడం ద్వారానే సాధ్యం.
అమలు చేయడం ముఖ్యం
స్నేహ YRE - యంగ్ రిపోర్టర్స్ ఫర్ ది ఎన్విరాన్మెంట్లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకంపై వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ''నా ఇంట్లో, నేను పనిచేసే సంస్థలలో సేంద్రీయ, అకర్బన వ్యర్థాల కోసం, ప్లాస్టిక్‌ల కోసం విభజన వ్యవస్థను అమలు చేయడానికి నేను ప్రయత్నించాను. దాని ప్రకారం వ్యర్థాలను మూడు భాగాలుగా విభజింపబడి ఉంటాయి. అలా కాకుండా UN అయినా, UNICEF అయినా నాకు ఇచ్చిన ఏ ప్లాట్‌ఫారమ్‌లో అయినా ప్లాస్టిక్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే వ్యర్థాలు దానిలోకి చేరడం వల్ల పర్యావరణానికి జరిగే పమాదాలను నేను అర్థం చేసుకున్నాను'' ఆమె చెప్పింది.
లక్ష్యం కోసం పని చేయాలి
ఇంతకుముందు కంటే వాతావరణ మార్పు, స్థిరత్వం గురించి చాలా మంది మాట్లాడటం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని స్నేహ అంటుంది. ''యువతకు నేను కోరుకునే విషయం ఏమిటంటే... వారి అభిరుచిని ఒక గొప్ప లక్ష్యం కోసం పని చేయడంగా మలుచుకోవాలి. మన సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయడం లేదు. కాబట్టి ప్రజలు అమలు కోసం పని చేయగలిగితే అద్భుతాలు సృషించవచ్చు'' అని ఆమె చెప్పింది.
సామాజిక పర్యావరణ అంశాలపై
స్నేహ చేసిన కృషి నేషనల్ జియోగ్రాఫిక్ వారి వన్ ఫర్ చేంజ్ ప్రచారంలో ప్రదర్శించబడింది. ఇది పర్యావరణ ప్రదేశంలో మార్పు చేసేవారి కథనాలపై దృష్టి సారిస్తుంది. స్నేహ ప్రస్తుతం పీహెచ్డీ చేస్తుంది. ఆమె ఫీల్డ్ సైట్ తమిళనాడులోని తామిరబరణి నది. ఇది తమిళనాడులోని దక్షిణ బిట్ కన్యాకుమారి, టుటికోరిన్‌లకు మద్దతునిచ్చే ఏకైక శాశ్వత నది. ''నా దీర్ఘకాలిక ప్రణాళిక ఏమిటంటే సామాజిక, పర్యావరణ అంశాల లెన్స్‌తో సిస్టమ్‌ను అధ్యయనం చేయడం. నీటి నాణ్యతను వ్యక్తుల కథలతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తాను. సంవత్సరాలుగా నీటి నాణ్యత మారడం గురించి వారు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఎలా సంభాషిస్తున్నారో తెలుసుకుంటాను. ఈ నది, ఈ నీటి నాణ్యత ఆధారంగా ఎలాంటి వైవిధ్యం అందుబాటులో ఉందో అధ్యయనం చేస్తాను'' అని ఆమె ముగించింది.