Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో పెండ్లయి సంవత్సరాలు గడిచిన చాలామంది దంపతులు ఉన్నట్టుండి విడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇక పెండ్లి కాని ప్రేమికుల సంగతి చెప్పక్కర్లేదు. చాలామంది ప్రేమికులకి బ్రేకప్ అనేది సాధారణమైపోయింది. అయితే వీరంతా విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ? ఆ.. ఏముంది.. పెండ్లయిన దంపతులైతే భర్త వేధింపులో, అత్తమామల సాధింపులో అయ్యుంటాయి.. ప్రేమికులైతే అభిప్రాయభేదాలు వచ్చుంటాయిలే.. అనుకుంటున్నారా? మీ ఆలోచన కొంతవరకు కరక్టే అయినా వీటన్నిటికీ మించి ఓ బలమైన కారణమే ఉందట.. అదేంటో మనమూ తెలుసుకుందాం...
దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య చిన్న స్పర్థని కూడా పెద్ద అగాధంలా మార్చేది డబ్బు. అవును.. చాలామంది భావించినట్టు చాలా సమస్యలకి డబ్బే పరిష్కారం కావచ్చు. కానీ దాంపత్య బంధానికి మాత్రం మొదటి శత్రువు డబ్బేనట. వివిధ అధ్యయనాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. చాలామంది దంపతులు తమ మధ్య డబ్బు ప్రస్తావన రాగానే జీవిత భాగస్వామిపై చిరాకు పడతారట. ఒకవేళ డబ్బు విషయంలో జీవిత భాగస్వామి ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కచ్చితంగా అభద్రతాభావంతోనే ఉంటారట.
ప్రశాంతంగా మాట్లాడుకోండి
ఆర్థిక రంగ నిపుణులైనా, మానసిక నిపుణులైనా ఈ సమస్యకి పరిష్కారం చూపడానికి ఇచ్చే సలహా ఒక్కటే! అదే కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం. ఉదాహరణకి ఒక వ్యక్తి వ్యాపారంలో వచ్చే నష్టాల గురించి తన భార్యతో చర్చించేవాడు కాదట. చిన్న నష్టాలే కదా రేపో మాపో కవర్ చేయొచ్చులే అనుకున్నాడట. తర్వాత చిన్న చిన్న నష్టాలన్నీ కలిసి వ్యాపారం దివాళా తీసే స్థాయికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య షాకైంది. మొదట్నుంచీ ఓ ప్రణాళికంటూ లేకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది వారి ఆర్థిక పరిస్థితి. ఆ తర్వాత భార్యే చొరవ తీసుకుని, తన తెలివి తేటలతో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించింది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు గురించి దంపతుల మధ్య ఏదైనా సమస్య వస్తే.. దానిని ఇద్దరూ కలిసి ఏవిధంగా అధిగమించవచ్చో ప్రణాళికలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికయ్యే ఖర్చు ఎక్కడ పెరుగుతోంది, ఎక్కడ తగ్గించాలి? వచ్చే రాబడిని దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఎలా పొదుపు చేయాలి? అనే విషయాలు తెలియాలంటే.. ఇద్దరూ కూర్చుని సానుకూలంగా మాట్లాడుకుంటే తప్ప ఏ సమస్యైనా పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు. అందుకోసం కొన్ని చేయాలంటూ సలహా ఇస్తున్నారు.అవేంటంటే...
- ముందు ఆర్థికంగా మీ గోల్స్ ఏంటో రాసిపెట్టుకోండి. తర్వాత వాటి గురించి మీ జీవిత భాగస్వామితో (లేదా కాబోయే వారితో) మాట్లాడండి.
- ఆ సమయంలో ఇద్దరికీ ఉన్న అప్పులు, ఆస్తుల గురించి ఎలాంటి సంకోచాలూ లేకుండా మాట్లాడుకోండి. అలాగే బ్యాంక్ ఖాతాలోని డబ్బు గురించి తెలపండి. అవసరమైతే ఇద్దరి పేరున జాయింట్ అకౌంట్ తెరవండి. దాని ద్వారానే ఎటువంటి లావాదేవీలైనా చేయండి.
- అత్యవసరం కోసం 'ఎమర్జన్సీ ఫండ్' కింద కొంత డబ్బుని ఎప్పుడూ పక్కన పెట్టి ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దానిని వినియోగించాలి.
నెల నెలా ఆదాయ వ్యయాలతో ఒక బడ్జెట్ తయారు చేయండి. దాని ప్రకారం వారంలో ఒక సమయం పెట్టుకుని బేరీజు వేసుకోండి. ఈ సమయంలో అప్పుల గురించి దాచకండి. అలాగే పొదుపు, పెట్టుబడుల గురించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి.
- అన్నిటికన్నా ముఖ్యమైంది... సంయమనంతో ఉండడం! ఆర్థిక ప్రణాళికలో అప్పుడప్పుడూ అనుకున్నదానికి కొంత అటు, ఇటు అవ్వడం సహజం. మీరు కంగారు పడి, మీ భాగస్వామిని కంగారు పెట్టకుండా సామరస్యంగా పరిష్కారం కోసం ఆలోచించండి.
ఆర్థిక ప్రయాణం
సొంత కారులో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరూ కలిసి డ్రైవింగ్‌ని పంచుకుంటే ఎంత సులువుగా ఉంటుందో ఆలోచించుకోండి. ఆర్థిక ప్రయాణం కూడా అలాంటిదే అంటున్నారు నిపుణులు. దంపతులిద్దరూ ఒక ప్రణాళిక వేసుకుని ఒక సంవత్సరం తర్వాత ఏం చేయాలి.. అయిదు సంవత్సరాల తర్వాత తమ ఆర్థిక స్థితి ఎలా ఉండాలి వంటి వాటి గురించి చర్చించుకుంటే ఇద్దరికీ ఇంటి ఆర్థిక స్థితిపై అవగాహన ఉంటుంది. అంతేకాదు.. దీనివల్ల ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు కాబట్టి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందంటున్నారు నిపుణులు.