Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో మహిళలుగా మనకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ పనినైనా చేపట్టి అందులో విజయం సాధించగల నైపుణ్యాలు మన దగ్గర ఉన్నాయి. అయితే అనుకున్నది సాధించగల ఓర్పు, నేర్పు మాత్రమే కాదు.. వివిధ అంశాలకు సంబంధించి మరెన్నో ప్రత్యేకతలు మన సొంతం. ఇంకా మనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం...
ఇప్పుడు ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పయనిస్తోంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌తో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అయితే మొట్టమొదట కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసింది ఒక మహిళే అన్న విషయం చాలామందికి తెలియదు. అవును.. లండన్‌కు చెందిన అడా లవ్లేస్ అనే మహిళ 1843వ సంవత్సరంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేశారు.
- పురుషులతో పోల్చుకుంటే మనలో రకరకాల రంగులను గుర్తించే నైపుణ్యం ఎక్కువగా ఉంటుందట. ఈ విషయంలో 20 శాతం ఎక్కువ కచ్చితత్వంతో గుర్తిస్తామట. ఉదాహరణకు పురుషులు నీలం రంగును ఒక్కటే గుర్తించగలిగితే, మహిళలు అందులోనే ఉండే మరో నాలుగు వైవిధ్యాలను కూడా గుర్తించగలరట.
- రుచిని గుర్తించడంలో మనమే టాప్. ఎందుకంటే నాలుకలో ఉండే రుచి మొగ్గలు మగవారి కంటే మనలోనే ఎక్కువగా ఉంటాయట.
- రోజులో ఒక మహిళ సుమారు 20 వేల పదాలను ఉచ్చరిస్తుందట. అదే పురుషులైతే కేవలం 7 వేల పదాలను మాత్రమే మాట్లాడతారట. మెదడులో ఉండే కొన్ని రకాల ప్రొటీన్లే ఇందుకు కారణమని పరిశోధనల్లో వెల్లడైంది.
- పురుషుల కంటే మహిళల గుండె వేగంగా కొట్టుకుంటుందట. పురుషుల గుండె నిమిషానికి 70 నుంచి 72 సార్లు కొట్టుకుంటే అదే మహిళల గుండె 78 నుంచి 82 సార్లు కొట్టుకుంటుందట.
- నెలసరి సమయంలో మహిళలుగా మనం పలు రకాల సమస్యలను ఎదుర్కొంటుంటాం. అయితే మన జీవిత సమయంలో దాదాపు నాలుగు సంవత్సరాలు నెలసరిలోనే గడుపుతామట.
- ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి తగ్గిపోతోందని వింటూనే ఉంటాం. కానీ రష్యాలో మాత్రం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటారు. అక్కడ మగవారి కంటే దాదాపు కోటి మంది మహిళలు ఎక్కువగా ఉన్నారట.
- ప్రతి మహిళ మాతృత్వాన్ని ఎంతో ఆనందిస్తుంది. ఇప్పటికీ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు లేకపోలేదు. అయితే ఇప్పటివరకు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన రికార్డు మాత్రం రష్యాకు చెందిన వసిల్యేవా పేరు మీదే ఉంది. ఆమెకు 69 మంది సంతానం. ఆమె నాలుగు సార్లు నలుగురు, ఏడు సార్లు ముగ్గురు, పదహారు సార్లు కవలలకు జన్మనిచ్చింది.