Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వృత్తిగత జీవితంలో నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని ఆవరిస్తున్నాయా? రోజు రోజుకీ ఉద్యోగ జీవితంలో ఆసక్తి తగ్గిపోతోందా? అనుకున్నంత ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేయలేకపోతున్నారా? ఏదో తెలియని ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారా? అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు మీకోసమే..
మీ పనిని మీకు తగ్గ విధంగా మలచుకోండి. రోజూ చేసే పనినే విభిన్నంగా చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మీరు చేస్తున్న పనిలోనే రోజుకో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సంకల్పించండి.
మీ సహచర ఉద్యోగులతో విభేదాలే మీకు ఆఫీసు పనిలో నిరాసక్తతను, నిస్పృహలను కలిగిస్తున్నాయని అనుకుంటున్నారా? అయితే అలాంటి విభేదాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. స్నేహపూర్వకమైన వాతావరణంలో అందరినీ గౌరవిస్తూ, మీ పనిని నిస్వార్థంగా చేయండి.
కష్టపడి పని చేయడానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోండి. ఇలా చేయడం వల్ల మీకంటూ మీ ఆఫీసులో ఒక గుర్తింపు వస్తుంది. కేవలం కొన్ని విషయాలకే పరిమితమైపోకుండా, ఇతర విషయాల్లో కూడా కంపెనీ పురోభివృద్ధిని కోరుకొనే వారినే సంస్థ ప్రోత్సహిస్తుందని గుర్తుంచుకోండి.
మీరు ఏవైనా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నప్పుడు వాటి గురించి పదే పదే ఆఫీసులో ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. వాటి ప్రభావం పని మీద పడకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా పని మీద దృష్టి కేంద్రీకరించలేక పదే పదే తప్పులు చేస్తూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ప్రతి కంపెనీకి కూడా తమ పరిధుల్ని బట్టి కొన్ని నియమ నిబంధనలుంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటికనుగుణంగానే పద్ధతులు ఉంటాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఉత్సాహంగా పని చేయాలనుకొంటే వాటికి అలవాటు పడడమే మంచిది.
ప్రణాళికాబద్ధంగా పని చేయకపోవడం కూడా మీ అనాసక్తికి కారణం కావచ్చు. మీకిచ్చిన పనిని నిర్ణీత సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
మరో ముఖ్యమైన విషయమేమిటంటే బద్ధకం పెంచుకున్నా కూడా పనిలో ఆసక్తి తగ్గుతుంది. అంతేకాదు మిగతా వారితో పోల్చుకుంటే వృత్తిగత జీవితంలో ఇతర ఉద్యోగులతో పోటీ పడటంలో మీరు వెనుకబడతారు కూడా. అందుకే పనులను వాయిదా వేయడం, ఆలస్యంగా పనులను ప్రారంభించడం వంటివి చేయకూడదు.
కొంతమంది ఫుల్‌టైమ్ కోర్సులు చేస్తూ కూడా, ఎనిమిది గంటల డ్యూటీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలా చేయడం కూడా ఉద్యోగ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాంటి వారు రెండు పడవల మీద ప్రయాణం చేయడం మాని, కెరీర్ మీదే దృష్టి కేంద్రీకరించడం మంచిది.