Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైపుణ్యాలు, అర్హత ఉన్నా.. నాయకత్వ హోదాలకు వచ్చేసరికి మగవారికే ఎక్కువ అవకాశమిస్తుంటాయి చాలా సంస్థలు. ఈ విషయంలో 'మాకూ సత్తా ఉన్నా అవకాశమే ఇవ్వలేదు' అని సమాధానమిచ్చే మహిళలే ఎక్కువ. నిరూపించుకోవడానికి హోదానే అవసరం లేదు. ప్రయత్నముంటే చాలంటున్నారు నిపుణులు. అప్పుడు హోదా దానంతటదే వరిస్తుందంటున్నారు.
బాధ్యత తీసుకోవడం: ఏదైనా పని, అసైన్మెంట్ చేయాల్సొస్తే ముందుండండి. అయితే ప్రతిదాన్నీ భుజాన వేసుకోవద్దు. మీ నైపుణ్యాలకు తగ్గవీ, సమర్థంగా చేయగలనన్న ధీమా ఉన్నవాటికే ప్రాధాన్యమిస్తే మంచిది. విజయాలే కాదు.. వైఫల్యాలు ఎదురైనా బాధ్యత తీసుకోగలగాలి. పొరబాటు జరగ్గానే కారణాలు వెదికే ధోరణి వద్దు. ఇది నాయకుల లక్షణం కాదు.
అందరితో కలసి: 'నేను.. నా' అని గొప్పలు పోయేవారి కోసం ఏ సంస్థా చూడదు. బృందాన్నంతటినీ గెలుపు బాట పట్టించే వాళ్లకే ప్రాధాన్యమిస్తాయి. మీటింగ్లు, ఆలోచనలు పంచుకోవడం వంటి వాటిల్లో కొందరు మొహమాటం కొద్దో, బిడియం కొద్దో చెప్పడానికి వెనకాడుతుంటారు. అలాంటి వాళ్లని చొరవ తీసుకుని మరీ అభిప్రాయాన్ని అడగండి. ఏదైనా ప్రాజెక్టు మీకంటే ఇతరులు బాగా చేస్తారనిపిస్తే వాళ్ల పేర్లను సూచించండి.
చెప్పాలి, వినాలి: ఆలోచనలను పంచుకోవడంలోనూ, ఇతరుల ఆలోచనలపై అభిప్రాయాలను చెప్పడంలోనూ ఎప్పుడూ వెనకాడొద్దు. అవతలి వ్యక్తి మీ పై అధికారి అయినా ఈ విషయంలో వెనకడుగేయొద్దు. అలాగే ఎవరైనా మీదాని పట్ల అభ్యంతరం చెప్పినా కోపగించుకోవద్దు. దానిపై చర్చకు ఆహ్వానించండి. ఒకటి.. విషయంపై స్పష్టతను ఇవ్వగలుగుతారు లేదూ లోపాలను తెలుసుకోగలుగుతారు.
మాట దాటొద్దు: ఎప్పటికప్పుడు పనిని పర్యవేక్షిస్తూ సకాలంలో పనిని పూర్తి చేయించగలిగే వారినే ఉత్తమ ఉద్యోగులుగా సంస్థలు పరిగణిస్తాయి. కాబట్టి ప్రణాళిక వేసుకుని పని పూర్తిచేయండి.