Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరటిపండే కాదు, అరటికాయ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో పీచు పుష్కలం. కానీ ఎంతసేపూ దీనితో పులుసూ, వేపుడూ తప్ప మరొక్కటి చేయం. అందుకే అరటికాయతో చేసే కొన్ని వెరైటీ రుచుల గురించి ఈ రోజు తెలుసుకుందాం...
కూటుకారి
కావల్సిన పదార్థాలు: సెనగపప్పు - అరకప్పు, అరటికాయలు - రెండు, కంద - 200 గ్రాములు, మిరియాలు - ఐదు, పసుపు - అర టీస్పూను, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - తగినంత, కొబ్బరితురుము - ఒకటిన్నర కప్పులు, జీలకర్ర - అరటీస్పూను, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు - టీస్పూను, మినప్పప్పు - టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం: సెనగపప్పును ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం ఆ నీళ్లు వంపేయాలి. బాగా కడిగి ఉడికించి పక్కన ఉంచాలి. కప్పు కొబ్బరి తురుము, జీలకర్రలో తగినన్ని నీళ్లు పోసి బాగా రుబ్బాలి. బాణలిలో అరటికాయ ముక్కలు, కందముక్కలు, మిరియాలపొడి, పసుపు, ఎండుమిర్చి ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి మీడియం మంట మీద కంద మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత ఉప్పు కూడా వేసి నీళ్లన్నీ ఆవిరయ్యే వరకూ ఉడికించాలి. ఇప్పుడు కొబ్బరి ముద్దను వేసి రెండు నిమిషాలు ఉడికించి పక్కన ఉంచాలి. చిన్న బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు వేసి తాలింపు చేయాలి. అందులోనే ఉడికించిన సెనగపప్పు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు మిగిలిన కొబ్బరి తురుము వేసి అది గోధుమరంగులోకి మారే వరకూ వేయించాలి. చివరగా ఉడికించిన కూరముక్కలను కూడా వేసి కలిపి వడ్డించాలి.
థారు బజ్జీ
కావల్సిన పదార్థాలు: దోరగా పండిన అరటి పండ్లు - నాలుగు, బియ్యప్పిండి - కప్పు, మైదాపిండి - కప్పు, పంచదార - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఉప్పు - రుచికి కొద్దిగా, బేకింగ్ సోడా - టీస్పూను, నువ్వులు - టేబుల్ స్పూను, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: అరటిపండ్లు తొక్క తీసి కాస్త మందంగా పొడవాటి స్లైసులుగా కోయాలి. బేకింగ్ సోడాలో ముప్పావుకప్పు నీళ్లు పోసి కలపాలి. వెడల్పాటి గిన్నెలో మైదా, బియ్యప్పిండి, ఉప్పు, పంచదార, కొబ్బరి తురుము, నువ్వులు వేసి కలపాలి. తర్వాత బేకింగ్ సోడా కలిపిన నీళ్లు పోసి కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి. బాణలిలో నూనెపోసి బాగా కాగాక అరటిపండు స్లైసుల్ని పిండిలో ముంచి తీసి నూనెలో వేసి వేయించాలి. రెండుమూడు చొప్పున అన్నీ వేయించుకుని తీసి బ్లాటింగ్పేపర్తో అద్ది అందించాలి.
కాలన్
కావల్సిన పదార్థాలు: అరటికాయ - ఒకటి, మోరంగడ్డ - రెండు, గిలకొట్టిన పెరుగు - మూడు కప్పులు, పసుపు - టీస్పూను, మెంతులు - టీస్పూను, మిరియాలపొడి - టీస్పూను, కొబ్బరితురుము - అరకప్పు, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - టేబుల్ స్పూను, మిరియాల పొడి - పావుటీస్పూను, ఆవాలు - పావుటీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు.
తయారు చేసే విధానం: కొబ్బరి తురుము, పచ్చిమిర్చి రెండూ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. గిలకొట్టిన పెరుగులో పసుపు వేసి కలపాలి. అందులోనే మోరంగడ్డ ముక్కలు, అరటికాయముక్కలు వేసి ఉడికించాలి. ఇప్పుడు రుబ్బిన కొబ్బరిముద్ద, ఉప్పు వేసి దగ్గరగా ఉడికించాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, మిరియాలపొడి, కరివేపాకు వేసి వేగాక ఉడికించిన కూర మిశ్రమంలో కలపాలి.
చిట్టినాడ్ అరటికాయపొడి కూర
కావల్సిన పదార్థాలు: అరటికాయ - మూడు, ఉల్లిగడ్డ - ఒకటి, పసుపు - పావుటీస్పూను, ఉప్పు - తగినంత, మసాలా ముద్దకోసం: కొబ్బరి తురుము - నాలుగు టేబుల్ స్పూన్లు, చింతపండు - చిన్న నిమ్మకాయంత, బెల్లం తురుము, టీస్పూను, మసాలాపొడి కోసం: మినప్పప్పు - రెండు టీస్పూన్లు, ఎండుమిర్చి - ఎనిమిది, దనియాలు - రెండు టీస్పూన్లు, సోంపు - టీస్పూను, తాలింపుకోసం: ఆవాలు - ముప్పావు టీస్పూను, కరివేపాకు - నాలుగు రెబ్బలు, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: మసాలాపొడికోసం తీసుకున్నవన్నీ వేయించి పక్కన ఉంచాలి. చల్లారాక పొడి చేయాలి. మసాలాముద్దకోసం తీసుకున్న కొబ్బరిని కొద్దిగా వేయించాలి. గోధుమరంగులోకి మారాక పక్కన ఉంచాలి. ఇప్పుడు దీనికి చింతపండు, బెల్లం తురుము, తగినంత ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. అందులోనే మసాలా పొడి కూడా కలిపి ఉంచాలి. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కోయాలి. అరటికాయల్ని ఉడికించి తొక్కుతీసి ముక్కలు ముక్కలుగా పొడిపొడిలాడేలా చిదమాలి. బాణలిలో నూనె వేసి తాలింపు దినుసులు వేగాక ఉల్లిముక్కలు వేయించాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు, మసాలా ముద్ద వేసి సిమ్లో పొడిపొడిలాడే వరకూ వేయించి తీయాలి.