Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయినప్పటికీ ఎంతో మంది పిల్లలు ఇప్పటికీ అనేక చోట్ల అక్రమంగా పని చేస్తూనే ఉన్నారు. కానీ చెత్త ఎరుకుని బతికే కమ్యూనిటీకి చెందిన అమ్మాయిల సమూహం జీవితంలో వారు కోరుకున్నది సాధించాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో అడ్డంకులును ఎదిరించి, అసమానతలను అధిగమించి చదువుకొంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో చాలా మందికి ఆనంద్ పర్బత్ అనే పేరు తెలిసే అవకాశం లేదు. ఇది కేవలం ఉనికిలో ఉన్న ప్రాంతాలలో ఒకటి. చాలా మంది చూడనిది, గుర్తించబడనిది. అయితే ఈ గుర్తించలేని కాలనీకి చెందిన ముగ్గురు అమ్మాయిల కథ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. నేర్చుకోవాలనే వారి అచంచలమైన సంకల్పమే దానికి ముఖ్య కారణం.
మొదటి అమ్మాయిలు వీరే
ఆనంద్ పర్బత్ వారి ట్రాన్సిట్ క్యాంప్‌లోని చాలా మంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. తమ కమ్యూనిటీ నుండి మొట్టమొదటిసారిగా ముగ్గురు అమ్మాయిలు చదువుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు యువతులు పెరిగిన వాతావరణం కలలు కనకుండా నిరుత్సాహపరిచేది. ఇప్పుడు ఆ అమ్మాయిలు సాధించిన విజయం వారి సంఘంలోని ఇతర పిల్లలకు ప్రేరణగా నిలిచింది.
చదువు జీవితాన్ని మారుస్తుందని
పూజ, పూనమ్, తులసి... ఒక్క రోజులో అనేక పనులు చేసేవారు. తెల్లవారుజామున బట్టలు ఉతకడం నుండి పాఠశాలకు హాజరు కావడం, ఆ తర్వాత ఇంటి పనులు చేయడం వరకు చాలా చేస్తున్నారు. చదువు తమ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతారు. వారు చెత్త ఏరుకునే పరిస్థితి నుండి గౌరవప్రదమైన జీవితానికి మారడం ద్వారా వారి కుటుంబాలను పేదరికం నుండి బయటపడేయగలమని బలంగా భావించారు.
ఆసక్తి పెరిగింది
వారి సంఘంలో వరల్డ్ విజన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఉండేది. గత పది సంవత్సరాల నుండి వారు రెమెడియల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ సెంటర్‌కు వెళ్ళినప్పటి నుండి పూనమ్‌కు పాఠశాల పట్ల ఆసక్తి మొదలైంది. ఇప్పుడు 19 ఏండ్ల వయసులో ఉన్న పూనమ్ ఇదంతా తన జీవితంలో ఎలా ప్రారంభమైందో గుర్తుచేసుకుంది.
పోలీస్ కావాలనుకున్నా కానీ
ముగ్గురిలో అత్యంత పొడుగు అయిన తులసి వ్యాపారం ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉంది. ''బ్యూటీ పార్లర్ వ్యాపారం ప్రారంభిస్తే చాలా డబ్బు సంపాదించగలమని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే సమాజంలోని వ్యక్తులు వివాహాలు, వేడుకలకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. నాకు ఎప్పటినుండో పోలీసు కావాలనే కోరిక ఉండేది. అది నాకు చిన్నప్పటి నుండి కల. అయితే చదువు కొనసాగించడానికి, నా కుటుంబాన్ని, నన్ను పోషించుకోవడానికి ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి. మేము చెత్త ఏరుకోవడం, అడుక్కోవడం, నింబు మిర్చి (నిమ్మకాయ కారం) అమ్ముకొని మేము జీవిస్తున్నాము. ఇవే మా కుటుంబ పోషణకు ఆధారం'' అని తులసి అంటుంది.
జీవితం దుర్బలంగా ఉంటుంది
పద్దెనిమిది సంవత్సరాల తులసి ఐదుగురు తోబుట్టువులలో పెద్దది. ఆమె తండ్రి రెండవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆమె తల్లి నిరక్షరాస్యురాలు. ఆమె తోబుట్టువులందరూ చెత్త ఏరుకోవడానికి ఇష్టపడుతున్నారు. వీధుల్లో తిరుగుతున్న జీవితం ఎంత కఠినంగా ఉంటుందో, పిల్లలు ముఖ్యంగా బాలికలు ఎంత దుర్బలంగా ఉంటారో ఆమె ప్రత్యక్షంగా చూసింది.
మాపై వేధింపులు ఎక్కువ
''మేము రోజూ తెల్లవారుజామున 3 గంటలకు ఐదు లేదా ఆరుగురు గుంపులుగా చెత్త సేకరించడానికి వెళతాము. ఉదయం 10 గంటలకు తిరిగి వస్తాము. ఒంటరిగా ప్రయాణించడం ప్రమాదకరం. మాపై జరిగే వేధింపులు, లైంగిక దాడుల గురించి అనేక నివేదికలు ఉన్నాయి. నేను ఒక నెల కిందట మా అమ్మ కోసం ఒంటరిగా రోడ్డు పక్కన నిలబడి ఉన్నాను. అప్పుడు నన్ను వేధించడానికి ప్రయత్నించిన వృద్ధుడితో పోరాడవలసి వచ్చింది. తులసి తాను ఎదుర్కొన్న ఇలాంటి ఎన్నో సంఘటనల గురించి మనతో పంచుకుంటుంది.
చదువు కొనసాగించింది
18 ఏండ్ల పూజకు పూనమ్, తులసిలు చిన్నప్పటి నుండి తెలుసు. వారితో కలిసి పాఠశాలకు వెళ్ళింది. వారి మురికివాడ కూల్చివేసిన తర్వాత ఆమె వారిద్దరితో సన్నిహితంగా ఉంటూ తన చదువును కొనసాగించింది. వారు 10వ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ట్యూటరింగ్ సెంటర్లో తన స్నేహితురాళ్లతో కలిసి చదువుకోవడం ఆమెకు చాలా ఆనందంగా ఉండేది. కుటుంబానికి అవసరమైనప్పుడు పూజతో పాటు ఆమె తోబుట్టువులు ప్రతి వారం రెండు లేదా మూడు సార్లు చెత్త ఏరడానికి వెళతారు. ఇతర సమయాల్లో ఆమె ఇంటి పనుల్లో సహాయం చేస్తుంది. అయితే ఎక్కువ సమయం ట్యూటరింగ్ సెంటర్లో ఉండేందుకే ఇష్టపడుతుంది. అక్కడ తరగతులకు హాజరయ్యే చాలా మంది పిల్లలకు అది ఒక ఆశ్రయం అని ఆమె వర్ణించింది.
ఒకరికొకరు మద్దతుగా...
పూజ తన భావాలను వ్యక్తీకరించడంలో కాస్త మొహమాటపడినా ఓ కార్యకర్తగా పని చేస్తుంది. ఆమె తన అన్నయ్య పిల్లల్లో నలుగురిని స్కూల్లో చేర్పించడంలో సాయపడింది. ''నేను టీచర్ని కావాలనుకుంటున్నాను'' అంటుంది పూజ. అవసరమైన పిల్లలకు సహాయం చేయడం, వెనుకబడిన యువకులలో విద్యను ప్రోత్సహించేందుకు ఆమె తన వంతు పాత్ర పోషిస్తుంది. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి, గౌరవప్రదంగా జీవించడానికి ఒకరికొకరు మద్దతుగా నిలవడం అనేది ఇలాంటి కమ్యూనిటీలో చాలా అరుదు. అలాంటిది ఈ ముగ్గరు అమ్మాయిలు ఒకరినొకరు సహకరించుకుంటూ, అసమానతలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.
మొదట కష్టంగా ఉండేది
''నేను వరల్డ్ విజన్ ఇండియా లెర్నింగ్ సెంటర్‌కి హాజరైనప్పుడు నాకు మొదటిసారిగా పుస్తకాలు పరిచయం అయ్యాయి. ఇది నాకు చాలా అద్భుతంగా, కొత్తగా అనిపించింది. వారే నన్ను ప్రభుత్వ పాఠశాలలో చేర్చడంలో సహకరించారు. నా తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో పాఠశాలకు వెళ్లడం మొదట చాలా కష్టంగా ఉండేది. మా బతుకుదెరువు కోసం చెత్త ఏరుకోవడం, దాన్ని అమ్మడం కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ సెంటర్లోని టీచర్ల సహాయం, మార్గదర్శకత్వంతో నా జీవితంలో ఎన్నో విషయాలు మారడం ప్రారంభించాయి. ఇప్పుడు చదువు ప్రాముఖ్యతతో సహా అనేక విషయాల గురించి మాకు మరింత అవగాహన ఉంది'' అని పూనమ్ చెబుతుంది.
- సలీమ