Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచి పౌష్టిక ఆహారం అని తెలుసు కదా! పక్షులు పెట్టే గుడ్లలో మానవులు కొన్నింటిని ఆహారంగా తీసుకుంటారు. అందులో కోడిగుడ్లు ప్రధానమైనవి. కోడిగుడ్లలో ప్రోటీన్లు అధికశాతంలో ఉండటం మూలంగా ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డును ఆహారంలో తీసుకోవాలని డాక్టర్లు చెపుతున్నారు. సుమారు వంద గ్రాముల కోడిగుడ్డులో 149 కాలరీల శక్తి, పన్నెండు గ్రాముల ప్రోటీన్లు, పది గ్రాముల కొవ్వు లభిస్తుంది. కోడిగుడ్డులో ప్రోటీన్లు మాత్రమే కాక దాదాపు అన్ని రకాల విటమిన్లు, ఫాస్ఫరస్, జింక్ వంటి అనేక ఖనిజాలు లభిస్తాయి. కోడిగుడ్లు గట్టి పెంకు వంటి కవచంతో ఉంటాయి. కింద పడితే పగలిపోతాయి. కాబట్టి వీటిని ప్యాకింగ్ చేయడానికి అదే ఆకారంలో ఉండే అట్టలను తయారు చేస్తారు. ఇంట్లో నిల్వ చేసుకోవడానికి ప్లాస్టిక్ ట్రేలు ఉంటాయి. మార్కెట్ నుండి తెచ్చుకునే గుడ్లు అట్ట ప్యాకెట్లలో ఉంటాయి. ఈ అట్ట ప్యాకెట్లతో మనం ఈరోజు అందమైన బొమ్మలు చేసుకుందాం. ఇంట్లో అలకరించుకుందాం.
సెంటిపెడ్
గుడ్లు కొన్నప్పుడల్లా ఎగ్ బాక్సులు పారేయకుండా బొమ్మలను తయారు చేస్తే మనలోని నైపుణ్యాన్ని బయటకు తీయవచ్చు. మన అద్దాల షెల్ఫుకు బొమ్మలు కొనాల్సిన పని ఉండదు. ఎగ్ బాక్సులు రకరకాల ఆకారాలతో, రంగులతో దొరుకుతాయి. చాలా వరకు అట్ట రంగులోనే ఉంటాయి. నేను దీనితో 'సెంటిపెడ్'ను తయారు చేశాను. చూడండి పిల్లలతో సరదాగా చేయించటానికి లేదా పిల్లలు ఆటలు ఆడటానికి పనికొస్తుంది. పెద్ద ట్రే నుంచి పొడవుగా ఒకే వరుసను కత్తిరించాలి. దీనికి రంగు వేసుకున్నా బాగుంటుంది. వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు సన్నగా పొడుగ్గా ఉంటుంది. కాబట్టి మొదట్లో రెండు కండ్లను అతికించాలి. ఇప్పుడు ఇదొక పురుగులా కనిపిస్తుంది. దీని శరీరం అనేక ఖండితాలుగా ఉండి అనేక కాళ్ళను కలిగి ఉంటుంది. నేను దీని కాళ్ళ కోసం ఎండిపోయిన పువ్వులను వాడాను. చూడండి సెంటిపెడ్ అంటే కాళ్ళజెర్రిలా కనిపిస్తోంది. ఇంకా ఒక్కో ఎగ్ గుంటను విడివిడిగా కత్తిరించి అనేక జంతువుల్ని సృష్టించవచ్చు. దీనికి కొద్దిగా పొడుగ్గా ఉన్నవి బాగుంటాయి. ఒక అట్ట ముక్కతో కాళ్ళను కత్తిరించి ఎగ్ గుంటకు కింది భాగాన అతికించాలి. పెద్ద కళ్ళు, ముక్కు, రెక్కలు పెడితే పెంగ్విన్‌ను తయారు చేయవచ్చు.
చేపలు
ఎగ్ గుంట భాగాలను విడివిగా కత్తిరించి ఇప్పుడు చేపల్ని తయారు చేద్దాం. వీటిని చాలా సులభంగా చెయ్యవచ్చు. కత్తిరించిన విడి భాగాన్ని పక్కకు పడుకోబెట్టి కోలగా ఉన్న భాగాన్ని మూతిగా మార్చాలి. దీని కోసం పెయింట్ వేయవచ్చు లేదా గుడ్డ ముక్కను వాడవచ్చు. పెద్ద పెద్ద కళ్ళను పెట్టుకుంటే బాగా కనిపిస్తాయి. ఇంక రెండు రెక్కలు, తోక పెట్టుకుంటే చేప తయారైపోతుంది. నేనైతే చేప శరీరానికి రంగులు వేశాను. మీరు వెయ్యాలనుకుంటే వెయ్యవచ్చు. లేదంటే లేదు. గుడ్డ క్యారీ బ్యాగులు రెండు రంగుల్లో ఉన్నవి తీసుకోవాలి. ఆ మధ్య భాగాన్ని పట్టుకొని రెక్కలు వలె అతికిస్తే బాగుంటుంది. అదే విధంగా తోక భాగానికి కూడా అతికించాలి. అయితే దీనికోసం నలుదరాన్ని పెద్దగా కత్తిరించుకోవాలి. తోక పెద్దదిగా వస్తుంది. ఇలా ఐదారు చేపలు చేసి కుటుంబంలా అలంకరిస్తే బాగుంటుంది.
దీపాలు
నా దగ్గర సీ గ్రీన్ కలర్లో ఉన్న ఎగ్ బాక్స్‌లు ఉన్నాయి. వీటితో దీపాలు తయారు చేశాను. వీటిని కూడా విడివిడిగా కత్తిరించి పెట్టుకున్నాను. ఇలా కత్తిరిస్తే పన్నెండు ముక్కలు వచ్చాయి. మా హాస్పిటల్లో దొరికే ప్లాస్టిక్ వాటర్ యాంపుల్స్ను తీసుకున్నాను. వీటికి ఎర్రరంగు వేశాను. గుంటలాగా ఉన్న ఎగ్ బాక్స్ భాగంలో ఒక్కొక్క వాటర్ యాంపుల్ పెట్టి అతికించాను. అది ఎర్రగా వెలుగుతున్న దీపంలా అనిపించింది. ఇలా పన్నెండు తయారయ్యాయి కదా! నేను అంతకు ముందు ధర్మాకోల్ ప్యాకింగ్లతో ఒక అపార్ట్మెంటును తయారు చేశాను. ఆ అపార్ట్మెంటులో ఈ దీపాలను అక్కడక్కడా పెట్టాను. చాలా బాగుంది. ఎక్కడ అలంకరించినా బాగుంటుంది.
డెకరేటివ్ పీస్
ఎగ్ బాక్సులను కత్తిరించకుండా అలాగే ఉంచి కూడా అలంకరించుకోవచ్చు. కొత్త షర్టులు కొన్నపుడు లోపల ఉండే అట్టను తీసుకొని పక్కన ఉంచాను. దాని మీద ఎగ్ బాక్స్‌ను విడదీసి అతికించాను. ఒకవైపు గుంటలు వచ్చాయి. మరోవైపు ఉబ్బెత్తులు వచ్చాయి. ఉబ్బెత్తుల వైపు 3డి గ్లిట్టర్ పెన్నులతో లైన్స్ గీశాను. ఇలా ఎగ్ బాక్స్ మొత్తం ఎంబోజ్డ్ డిజైన్ల వలె గీశాను. ఇప్పుడు ఎగ్బాక్స్ పోగా మిగిలిన అట్ట భాగమంతా కలర్లు వేశాను. మొత్తం ఏదో ఒక డెకరేటివ్ పీస్‌లా వచ్చింది.
జంతువులు, పక్షులు
ఎగ్ బాక్స్‌ను పన్నెండు భాగాలుగా విడగొట్టి బొమ్మలు చేద్దాం. మొదటగా ఒక పిల్లిని చేద్దాం. పొడుగ్గా ఉండే ఎగ్ ప్యాకింగ్ భాగాన్ని కింద వైపు పెట్టి, పొట్టిగా ఉండే ఎగ్ ప్యాకింగ్ భాగాన్ని పైన పెట్టి పిల్లిని చేయాలి. చిన్నచిన్న కళ్ళను పెట్టి ముఖానికి మూతి దగ్గర ఒక గుండీని అతికించాలి. పిల్లి కదా మీసాలు పెడితే బాగా వస్తుంది. ఒక వస్త్రపు ముక్కను కత్తిరించి దారపు పోగులు తీసి మూతికి అతికిస్తే చక్కగా సరిపోతుంది. ఎగ్ బాక్స్‌లో ముక్కనే కత్తిరించి చెవుల్లా అతికించాలి. చివరగా ఒక తోకను అతికిస్తే సరిపోతుంది. ఒక పొడుగు భాగం ఒక పొట్టి భాగంతో కోడి బొమ్మల్ని చేద్దాం. ఈ కోడి బొమ్మకు నెత్తిమీద తురాయి, ముక్కు కిందగా వేలాడే ఉబ్బెత్తులు పెట్టాలి. దీనికి కూడా తల భాగంలో కళ్ళు పెట్టుకోవాలి. బజార్లో కొన్నవి అందంగా ఉంటాయి. లేదంటే మిరియాలు అతికించేస్తే సరిపోతుంది. తర్వాత కోడికి ముక్కు పొడుగ్గా పెట్టాలి. ఒక అట్ట ముక్కను ముక్కులా కత్తిరించుకొని, మధ్యలో చీలిక చేయాలి. ఈ ముక్కును తల భాగంలో అతకాలి. ఇప్పుడు ఎర్రని వస్త్రాని తీసుకొని మధ్యలో దూది పెట్టి మందంగా తయారు చెయ్యాలి. లేకపోతే పడిపోతాయి. ఇప్పుడు వాటిని సరిగ్గా అతికించాలి. వెనక భాగంలో తోక ఉన్నట్టుగా ఏం చేయాలంటే పక్షి ఈకల్ని తెచ్చి చిన్నగా కత్తిరించి అతకాలి. కాళ్ళ కోసం సరదాగా పొడవుగా కార్టూన్ కోడిలా పెడదాం. దీనికి శుభలేఖలు కుండే తాళ్ళను అతికిస్తే చాలా బాగుటుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్