Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిల్పా ద్యావయ్య... ప్రస్తుతం కేరళలోని కొట్టాయం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చూస్తుంది. ఆమె ఒక గొప్ప పోలీస్ అధికారి మాత్రమే కాదు 10 ఏండ్ల పాపకు తల్లి కూడా. ఇంజనీర్‌గా పూర్తి చేసి కొంతకాలం కార్పొరేట్ జీవితాన్ని గడిపారు. మంచి జీతం, విదేశాల్లో ఉద్యోగం అయినా అది ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. చివరకు యూనిఫాం ధరించి తన కలను నిజం చేసుకున్నారు. కార్పొరేట్ వృత్తిని విడిచిపెట్టినందుకు ఆమె ఒక్కరోజు కూడా బాధపడ లేదు. తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఆమె మనతో ఇలా పంచుకుంటున్నారు. మహిళా అధికారులు బాధ్యతలు చేపట్టే విషయంలో కేరళలోని కొట్టాయం జిల్లాను గొప్పగా చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ పి.జయశ్రీ (ఐఏఎస్) నుండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) శిల్పా ద్యావయ్య (ఐపీఎస్) వరకు కీలక బాధ్యతల్లో మహిళా అధికారుల బృందం నాయకత్వం వహిస్తుంది. వీరే కాకుండా డిప్యూటి కలెక్టర్ (జనరల్), అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అయిన జిను పున్నూస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్.ఎన్. ప్రియ కూడా ఉన్నారు.
కార్పొరేట్ ఉద్యోగిగా ఉన్నప్పటికీ
2010లో ఆమె ఉద్యోగ జీవితం ప్రారంభమయింది. ఉద్యోగరీత్యా వివిధ దేశాలకు వెళ్లినప్పటికీ, కస్టమర్-ఫేసింగ్ పాత్రలో పని చేస్తున్నప్పటికీ, అత్యుత్తమ కార్పొరేట్ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ శిల్పా ఎల్లప్పుడూ 'భారత పౌర సేవల్లో చేరాలనే తన కోరిక గురించి ఆలోచిస్తూనే ఉండేవారు. 2012లో కూతురు పుట్టిన తర్వాత ప్రసూతి విరామంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యారు. అయితే మొదటి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయింది. 2015లో తన రెండవ ప్రయత్నం విజయవంతమైంది.
చాలా సంతోషంగా ఉన్నాను
''నా మొదటి ప్రాధాన్యం ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అయినప్పటికీ నేను ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీస్)లోకి ప్రవేశించినందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఐపీఎస్ అనేది ఒక కష్టతరమైన ప్రయాణం అని అందులోనూ ఒక మహిళకు ఇది కఠినమైన పోస్ట్ అని అందరూ భావిస్తారు. కానీ నేను సేవలో చేరిన తర్వాత ఒక్కసారి కూడా అలాంటి ఆలోచన రాలేదు'' ఆమె చెప్పింది.
సంతృప్తిగా ఉంది
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శిల్పా తన కూతురికి నాలుగేండ్లు ఉన్నప్పుడు ఐపీఎస్ మొదటి సంవత్సరం కష్టతరమైన శిక్షణ తీసుకుంది. 2016లో కేరళ కేడర్‌లో చేరి శిక్షణ పొందారు. ఇప్పటివరకు చేసిన ప్రయాణం అద్భుతంగా ఉంది అని ఆమె చెబుతున్నారు. ''ఐపీఎస్ అయిన తర్వాత మీరు కార్పొరేట్ ఉద్యోగాన్ని మిస్ అయ్యారా లేదా విదేశాలలో పనిచేయడం మిస్ అయ్యారా అని చాలా మంది నన్ను అడుగుతారు. ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. కాబట్టి నేను ఆ జీవితాన్ని కోల్పోతున్నాను అని ఒక్క రోజు కూడా అనుకోలేదు. పోలీసు సేవ అనేది ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యతల్లో అందరికీ కనిపించే రూపం. పోలీసుల నుండి సహాయం కోరే వ్యక్తులు ఎంతో ఆశతో వస్తారు. మనం చేసే ప్రతి చిన్న సహకారం వారికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది'' అని శిల్పా అంటున్నారు.
నిస్పాక్షికంగా నిర్వహిస్తాము
క్రియాశీల సేవలో ఉన్నప్పటి నుండి శిల్పా గత ఆరేండ్లలో ఇంజనీర్‌గా, ఎంబీఏ ఉద్యోగిగా, పోలీస్ ఆఫీసర్ అయ్యాక హత్యలు, గృహ హింస కేసులు, దొంగతనాలు, అల్లర్ల వరకు అన్నింటినీ చూశారు. ''కొన్నిసార్లు కోజికోడ్‌లోని కూడతాయి సైనైడ్ హత్యల వంటి వాస్తవికత, కల్పన కంటే వింతగా ఉంటుంది. ఆ సమయంలో ఏఎస్పీ (అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నేను దర్యాప్తు బృందంలో భాగమయ్యాను. అలాంటి కేసులను ఎలా దర్యాప్తు చేస్తారనేది అక్కడే నేర్చుకున్నాను'' అని ఆమె చెప్పారు. 2019లో కూడతాయి కేసు పెద్ద చర్చనీయాంశమయింది. 14 సంవత్సరాల వ్యవధిలో ఆరు హత్యలు జరిగాయి. దానిపై జరిగిన విచారణ జాలీ జోసెఫ్ అరెస్టుకు దారితీసింది. ఆమె అక్టోబర్ 2019లో అరెస్టు చేసిన తర్వాత సైనైడ్ ఉపయోగించి తన కుటుంబ సభ్యులలో ఆరుగురిని చంపినట్టు అంగీకరించింది. ఆ తర్వాత ఆమెను ఎప్పుడైనా మాట్లాడించారా అని అడిగినప్పుడు అటువంటి కేసుల విపరీత స్వభావం గురించి శిల్పా ఇలా చెప్పింది ''అదంతా వృత్తిలో భాగం. మేము దానిని అంగీకరించడం ప్రారంభిస్తాం. ప్రజలు ఒక నిర్దిష్ట మార్గంలో ఉండటానికి వారి కారణాలను వారు కలిగి ఉంటారు. మాకు తీర్పు చెప్పడానికి ఎవరూ ఉండరు. మేము మా ఉద్యోగాలను నిష్పాక్షికంగా నిర్వహిస్తాము. న్యాయం జరుగుతుంది అని నమ్ముతాము'' అంటున్నారు.
జిల్లాను మహిళలే నడుపుతున్నారు
''నా కంటే ముందు కేడర్‌లో ఇంకా చాలా మంది మహిళా అధికారులు ఉన్నారు. శ్రీలేఖ కేరళలో మొదటి ఐపీఎస్. అలాగే సంధ్య కూడా ఉన్నారు. వారు మంచి ప్రభావాన్ని చూపారు. కేరళ అభ్యుదయ రాష్ట్రమైనందున నాయకత్వ పాత్రల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ జిల్లాను మహిళా అధికారులు నడుపుతున్నారు. తమ బాధ్యతలను అందంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇక్కడ మరింత అవగాహనతో ఉంటారు. సంబంధిత సంస్థలను సంప్రదించే ఇతర సంస్థల వలె కేసులు నివేదించబడనప్పటికీ అక్కడ యంత్రాంగాలు ఉన్నాయి'' అంటున్నారు.
ఎలా పని చేయాలో నేర్చుకున్నాను
మతపరంగా సున్నితమైన జిల్లా అయినా కాసర్‌గోడ్‌కు స్వతంత్ర అధికారిగా నియమితురాలైన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి శిల్పా. 2020లో కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారినప్పుడు ఆమెను తిరిగి ఆ ప్రాంతానికి పిలిచారు. ''అంతా కొత్తది, వైరస్ కూడా కొత్తది, ఏం చేయాలో ఎవరికీ తెలియదు. కాసర్గోడ్ హాట్‌స్పాట్‌గా మారుతోంది. విజరు సాఖారే నాయకత్వంలో ఆ పరిస్థితులలో ఎలా పని చేయాలో నేర్చుకున్నాను. కేసులను తగ్గించడానికి ట్రిపుల్ లాక్డౌన్ స్ట్రాటజీని రూపొందించినప్పుడు మేము మార్చి 2020లో అక్కడికి వెళ్ళాము'' అని శిల్పా గుర్తుచేసుకున్నారు.
ముగ్గురమే ఉన్నాము
విభిన్న పాత్రల్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడుతూ ముస్సోరీ, హైదరాబాద్‌లో తన మొదటి సంవత్సరం శిక్షణ గురించి ఆమె చెబుతున్నారు. ''ప్రసవం తర్వాత మహిళలు కాల్షియం లేక బాధపడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో మేము అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అకాడమీలో మేము ముగ్గురు మహిళలు ఉన్నాము. ఇది శారీరకంగా ఎంతో కష్టంగా ఉంటుంది. మేం ముగ్గురం బాగా ఎదుర్కొన్నాము. బలంగా తయారై బయటకు వచ్చాము. అయితే కొన్నిసార్లు జీవితంలోని అన్ని అంశాలను సమతుల్యం చేయడం సవాలుగా ఉంటుంది. కొన్ని రకాల వృత్తుల్లో మీ వ్యక్తిగత జీవితంలో కొంత భాగాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. నేను నా కూతురి పుట్టిన రోజు వేడుకకు వెళ్ళలేను. కానీ నా కుటుంబం చాలా సపోర్ట్ చేసింది. ఇది నా ఉద్యోగానికి అవసరమని నా తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, నా బిడ్డ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి అది నిజంగా నాకెంతో సహాయపడుతుంది'' ఆమె చెప్పింది.
భయాలను ఎదుర్కొనేలా చేసింది
శిల్పా తన తండ్రి, తన బిడ్డను చూసుకునే రోజులను ప్రేమగా గుర్తుంచుకుంటుంది. ఆ అనుభూతులతోనే తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రశాంతంగా చదువుకుంది. సివిల్ సర్వెంట్‌గా తన సొంత అనుభవంలోని పాఠాలు కూడా ఆమెకు సహాయం చేసాయి. ''నేను స్పోర్టి వ్యక్తిని కాదు. అయినప్పటికీ అకాడమీ మనలోని భయాలను ఎదుర్కొనేలా చేస్తుంది. రోజుకు మూడు కిలోమీటర్ల పరుగు నుండి బంగీ జంపింగ్ వరకు అన్నీ మనకు థైర్యాన్ని ఇస్తాయి. చట్టాన్ని అమలు చేయడం చాలా డైనమిక్‌గా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు విభిన్నంగా ఉంటుంది. మారుతున్న అనేక దృశ్యాలు ఉంటాయి. మేము వాటన్నింటినీ ఎదుర్కోవడం నేర్చుకుంటాము'' ఆమె చెప్పింది.
సానుకూల మార్పులే కారణం
''అత్యవసర సేవ అయినప్పటికీ ఇది చాలా సంతృప్తికరంగా ఉంది. మాకు కనీష్ట, గరిష్ట పని గంటలు ఉంటాయి. మా సిబ్బందికి మంచి విశ్రాంతి ఉందని మేము నిర్ధారించుకుంటాము. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జాకబ్ పున్నూస్ నేతృత్వంలో వచ్చిన సానుకూల మార్పులే దీనికి కారణం. ఆయన కమ్యూనిటీ పోలీసింగ్‌ను సమర్థించారు. పౌరుల భాగస్వామ్యం ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి కృషి చేశారు'' అంటున్నారు ఆమె.
స్నేహపూర్వక పోలీసుగా
యాదృచ్ఛికంగా శిల్పా దళంలోకి ప్రవేశించడానికి నెలరోజుల ముందు ఆమె అమీర్ ఖాన్‌తో సత్యమేవ జయతే ఎపిసోడ్లో జాకబ్ పున్నూస్ని చూశారు. అతని కమ్యూనిటీ పోలీసింగ్ విని ఆకర్షితురాలైన అనుభూతిని గుర్తుచేసుకున్నారు. ఏదో ఒక రోజు ఆమే స్వయంగా ఆ చర్చలో భాగస్వామి అవుతుందని ఆమె ఊహించలేదు. ఈ రోజు శిల్పా గొప్ప పోలీసుగా, తల్లిగా, భార్యగా, కూతురిగా, చిన్న చిన్న వివాహ గొడవలను సైతం పరిష్కరించే స్నేహపూర్వక పోలీసు అధికారి ఉన్నారు. అయితే జిల్లా అధికారులను కలవడం, క్రైమ్ సీన్‌ని పరిశోధించడం, తన అధికార పరిధిలో పర్యటించడం, పీటీఏ సమావేశానికి హాజరు కావడం వంటివన్నీ ఈ మహిళా అధికారికి ఒక రోజు పని.