Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురుషాధిక్య సమాజంలో నాయకత్వ స్థాయిలో ఉండే మహిళల శాతమే తక్కువ. ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నా.. ఎన్నో సవాళ్లు. ఏం చేసినా ఫిర్యాదులొస్తోంటే.. అమ్మాయిని కాబట్టే ఇలా అని ఊరుకోకండి. ఈ అంశాలనూ చెక్ చేసుకోండి.
- ఒక స్థాయికొచ్చాక నిరూపించుకోవాలన్న ఆరాటం సహజమే. అయితే దానిలో పడి మీ కింది వాళ్ల గురించి పట్టించుకోవడం వదిలేస్తున్నారేమో చూసుకోండి. ఏదైనా విజయం సాధిస్తే మీదే అన్నట్టుగా ఉండొద్దు. అందరిదీ అన్న భావన కలిగించండి. తప్పు విషయంలో బాధ్యత వహించండి. ముందుండి నడపాల్సిన వారి లక్షణమది.
- కొత్తగా బృందంలోకి చేరిన వారికి ఉత్సాహం, బిడియం రెండూ ఉంటాయి. వాళ్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అది నిజమే, కానీ వారు ఏదైనా సలహానివ్వబోతే 'నీకు తెలియదు, నువ్వు కొత్త' లాంటివి చెప్పకండి. మీపై వారికి నెగెటివిటీ ఏర్పడుతుంది. ముందు వినండి. తర్వాత సాధ్యాసాధ్యాలను చర్చిస్తే.. విషయం వాళ్లకే అర్థమవుతుంది.
- లీడర్ స్థాయిలో ఉన్నంత మాత్రాన పని చేయకూడదన్న నిబంధనేమీ ఉండదు. వారితో కలిసి మీరూ పనిచేయండి. ఏం చేద్దాం? ఈ సమయంలోగా పూర్తవ్వాలంటే మనమేం చేయాలి అంటూ కలిసిపోండి. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్నవారిలో మన అన్న భావనని నింపగలుగుతారు.
- పైవాళ్లు ఏదైనా అంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు చాలామంది. అదే కిందివాళ్లు చిన్న తప్పు ఎత్తిచూపినా తట్టుకోలేరు. మీదీ అదే కోవా? అయితే మీరు సరైన నాయకురాలు కాదన్నట్టే. వాళ్లు చెప్పినదానిలో నిజం ఎంతవరకూ ఉందో మిగతా వారితో మాట్లాడి రూఢ చేసుకోండి. తప్పుగా అర్థం చేసుకున్నారనిపిస్తే వివరించే ప్రయత్నం చేయండి. నిజమే అయితే మిమ్మల్ని మీరు మార్చుకోండి. అంతేకానీ వారిని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయకండి.
- మీరు ఈ స్థాయికి చేరడానికి ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఉంటారు. బోలెడు అనుభవం సంపాదించి ఉంటారు. మీ అనుభవాలను కింది వాళ్లకీ పంచండి. మీ తర్వాత కాకుండా మీతో పోటీపడగల నాయకుల్ని తయారు చేయండి. మెంటార్‌గా వ్యవహరిస్తూ వారికి సాయం చేయండి. అసలైన నాయకురాలంటే అర్థమదే.. ఇతరుల్నీ నాయకుల్లా తయారు చేయడమే.