Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ ఎంతో మంది పుడుతుంటారు... పోతుంటారు. కొంత మంది మాత్రమే చరిత్రలో తమకంటూ ఓ పేజీ లిఖించుకుంటారు. మరణించినా ప్రజల గుండెల్లో చిరకాలం బతికేవుంటారు. అలాంటి కోవకు చెందిన ధిశాలి కల్లు సుగుణమ్మ. పీడిత వర్గాలపై సాగే దోపిడీ, దౌర్జన్యాలపై తమ సర్వశక్తీ ఒడ్డి ఎదిరించారు. పేదల కోసం అహర్నిశలూ శ్రమించారు. ప్రజా ఉద్యమం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఆమె 84 ఏండ్ల వయసులో ఈ నెల 5వ తేదీన కన్ను మూశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన త్యాగాలను ఓ సారి మననం చేసుకుందాం.
సుగుణమ్మ 1935లో వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో జన్మించారు. తల్లి సౌందరమ్మ, తండ్రి ముకుందరెడ్డి. అప్పట్లోనే ఆరో తరగతి వరకు చదువుకున్నారు. పెండ్లయ్యేంతే వరకు ఆమెకు పార్టీతోకానీ, ప్రజా ఉద్యమాలతో గానీ ఎలాంటి పరిచయం లేదు. కామ్రేడ్ రామచంద్రారెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె పార్టీకే అంకితమయ్యారు. రావినారాయణరెడ్డి, వారి కూతురు భారతి ఆధ్వర్యంలో ఆ జంట అప్పట్లోనే ఆదర్శ వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాతనే...
రామచంద్రారెడ్డితో వివాహం తర్వాత సుగుణమ్మ నల్లగొండ జిల్లా నకిరేకల్ వచ్చేశారు. అప్పటి నుండి భర్త చేస్తున్న పోరుబాటలో జీవితాంతం తోడుగా నిలిచారు. అప్పట్లో నకిరేకల్‌లో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం అంటూ ఉండేది కాదు. వారి ఇల్లే ప్రజా ఉద్యమాలకు పుట్టిల్లుగా, సీపీఎం కార్యాలయంగా విలసిల్లింది. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు రూప, కొడుకు ఉత్తమ్. పిల్లలిద్దరూ హైదాబాదులో ఉండే మేనమామ, ఇతర బంధువుల ఇండ్లల్లో ఉండి చదువుకున్నారు.
శ్రామిక జనులే తమ కుటుంబంగా
రామచంద్రారెడ్డి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు చిన్ననాటి నుండి దేశభక్తి మెండు. సహచరిగా సుగుణమ్మ తోడైన తర్వాత ఇద్దరూ నిరంతరం సామాజిక స్పృహతో బడుగు జీవుల కష్టసుఖాలలో భాగస్వాములై ఉండేవారు. శ్రామిక జనులే తమ కుటుంబంగా, కష్టజీవుల సంక్షేమమే తమ లక్ష్యంగా బతికారు. సోషలిస్టు సమాజ నిర్మాణమే మార్గదర్శంగా, సమసమాజ నిర్మాణం కోసం తపించేవారు.
ఆదర్శ వంతంగా ఉండేవారు
నకిరేకల్ ప్రాంతంలో సుగుణమ్మ దంపతులు పార్టీనాయకులుగానూ, పంచాయితీరాజ్లోనూ విశిష్ట సేవలు అందించారు. అప్పట్లో కామ్రేడ్ రామచంద్రారెడ్డి రైతు సంఘంలో పని చేస్తుంటే సుగణమ్మ అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) కు జిల్లా అధ్యక్షురాలిగా పని చేసేవారు. సుగుణమ్మ సేవ, ఆమె వ్యక్తిత్వం గురించి సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఎంతో గర్వంగా చెప్పేవారు. జిల్లాలో సంఘం బడ్జెట్, ఖర్చుల విషయంలో ఆమె చాలా కచ్చితంగా, పొదుపుగా, ఆదర్శ వంతంగా ఉండేవారు.
బాధితులకు అండగా...
ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిందని తెలిసినా భార్యాభర్తలిద్దరూ క్షణాల్లో వెళ్ళి పోయేవారు. బాధితులకు కావల్సిన సహాయ సహకారాలు అందించేవారు. వారి వ్యతిరేకులు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఈ జంట స్టేషన్‌కు వస్తున్నారంటేనే పోలీసులు వణికిపోయేవారు. సుగుణమ్మ పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారంటేనే పోలీసులకు చెమటలు పట్టేవని స్వరాజ్యంగారు ఎన్నో సార్లు చెప్పారు. స్వరాజ్యంగారు హైదరాబాద్‌లోని మహిళాసంఘం ట్రస్టు భవనంలోనే ఉంటూ మధ్యమధ్యలో సూర్యాపేట వెళ్ళి వస్తుండేవారు. అప్పటోప్ల కాలు దెబ్బతిని ఎల్.బి నగర్‌లోని తన కూతురు రూప ఇంట్లో ఉండే సుగుణమ్మ దగ్గరకు స్వరాజ్యం గారు వచ్చి వెళ్ళేవారు. అలాంటి సందర్భంలో ఒకసారి స్వరాజ్యంగారితో కలిసి నేను కూడా సుగుణమ్మను చూడటానికి వెళ్లాను. నడవలేని స్థితిలో కుర్చీలో ఉన్నారామె.
నేనున్నానంటూ వెన్నుతట్టేవారు
సుగుణమ్మ తుదిశ్వాస విడిచేవరకు సమాజ మార్పు కోసం పరితపించారు. ఐద్వా రాష్ట్ర కమిటీలో ఎక్కువకాలం కొనసాగిన గొప్ప నాయకురాలు ఆమె. నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా నకిరేకల్ ప్రాంతంలో అందరికీ పెద్దదిక్కుగా ఉండేవారు. కష్టంగా ఉన్న ప్రతి ఒక్కరికీ నేన్నానంటూ వెన్ను తట్టేవారు. మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆమె ముందుండేవారు. మహిళలు ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలతో పాటు ఇతర అన్ని సమస్యలనూ పరిష్కరించడంలో తనదైన పాత్ర పోషించేవారు. 1968లో గుంటూరు జిల్లా కాజా గ్రామంలో మహిళా సంఘం రాష్ట్ర శిక్షణా తరగతులు జరిగాయి. వాటికి నల్లగొండ జిల్లా నుండి హాజరైన ముఖ్య నాయకుల్లో సుగుణమ్మ కూడా ఒకరు. పార్టీ విడిపోయిన తర్వాత ఆమె మల్లు స్వరాజ్యం, మాణికొండ సూర్యావతితో కలిసి మహిళా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. మహిళా సమస్యలపైనే కాకుండా రైతు, వ్యవసాయ కార్మిక సంఘంలో కూడా చురుగ్గా పని చేసేవారు. 2002లో అనారోగ్య కారణాల రీత్యా ఆమె మహిళా ఉద్యమం నుండి రిలీవ్ అయ్యారు. 1984లో భర్త రామచంద్రారెడ్డి మరణం ఆమెను కుంగదీసింది. అయినా ధైర్యం కూడదీసుకుని మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
సేవా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు
తల్లి సేవా వారసత్వాన్ని రూప కూడా కొనసాగించారు. తాను నివసించే హైదరాబాద్‌లోని ఎల్.బి.నగర్ ఏరియా నివాసుల సంక్షేమం కోసం పని చేస్తూ వారి సొసైటీ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. మల్లు స్వరాజ్యం, ఐద్వా నాయకురాలు ఇందిర సహకారంతో గతంలో బాలికలకు కరాటే శిక్షణా కేంద్రం కూడా రూప ఏర్పాటు చేశారు. తమ ఏరియాలో ఉన్న సీనియర్ సిటిజన్స్ లైబ్రరీ బిల్డింగ్‌కి సంబంధించిన ఖాళీ స్థలాన్ని కరాటే శిక్షణ కోసం మాట్లాడి దానికి కావల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో నడవలేని స్థితిలో ఉన్న సుగుణమ్మ కూతురు ఏర్పాటు చేసిన కరాటే శిక్షణా కేంద్రాన్ని సందర్శించేందుకు ఎంతో ఓపిక చేసుకుని మరీ వచ్చారు.
సమసమాజ స్థాపనకై కృషి చేయడమే
మహిళా సంఘం రాష్ట్ర కమిటీ తరపున మహిళల ఆత్మ రక్షణకై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు చిన్ననాటి నుండే కరాటే శిక్షణ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఆ పనికి ఇంత వరకు జరగలేదు. ఆడపిల్లలపై, చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ దోపిడీ దారులకే చెందుతున్నాయి. ప్రజల మూలుగులు పీల్చే ప్రభుత్వ అధికారాన్ని అంతం చేసి, సమసమాజ స్థాపనకై కృషి చేయడమే కల్లు సుగుణమ్మకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
అమ్మ తన జీవితం పార్టీకే అంకితం చేసింది
అమ్మా, నాన్న జీవితమంతా పార్టీకే అంకితం చేశారు. కుటుంబం కన్నా ఉద్యమానికి, ప్రజలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. నా మొదటి కాన్పు అయ్యి పది రోజులే అవుతుంది. అప్పుడే పార్టీ క్లాసులు జరుగుతుంటే బాలింతరాలైన నన్ను వదిలిపెట్టి నెల రోజుల పాటు అమ్మ ఆ క్లాసులకు వెళ్ళింది. పార్టీ అంటే అంతటి అభిమానం అమ్మకు. నాన్న పార్టీలో పని చేయడమే కాకుండా వైద్యం కూడా చేసేవారు. ప్రతి ఆదివారం మా ఇల్లు నిండిపోయేది. మాకైతే ఇంట్లోకి పోవడానికి కూడా సందు ఉండేది కాదు. అంతగా రోగులు వచ్చేవారు. వచ్చిన వారందరికీ మంచినీరు, టీ ఇవ్వడం అమ్మ పని. అవసరమైన వారికి భోజనాలు కూడా వండి పెట్టేది. పార్టీ కార్యకర్తల కోసం ప్రతి రోజూ మా ఇంట్లో సుమారు పది కేజీల బియ్యం ఉడికేవి. ఇక ఎన్నికలొస్తే మా ఇంట్లో పండగ వాతావరణం ఉండేది. రాత్రీ పగలు అమ్మ పార్టీ జెండాలు కుట్టేది. ఇనుముతో సుత్తీ కొడవలి ఆకారం చేసిన ఒక అచ్చు ఉండేది. దాన్ని మేము ఎర్రటి గుండపై పెట్టి ఆ అచ్చు మధ్యలో ఉండే ఖాళీలో తెల్లటి రంగు వేసి జెండాలు తయారు చేసేవాళ్ళం. ఆ రంగు వేసే బాధ్యత మా పిల్లలకు అప్పగించేవాళ్ళు. అమ్మ కుటుంబ సమస్యల పరిష్కారం కోసం కౌన్సెలింగ్ కూడా ఇచ్చేది. చనిపోయే వరకు పత్రిక చదువుతూనే ఉండేది. చివరి వరకు కంటి, వినికిడి సమస్యలు లాంటివి ఏవీ అమ్మకు లేవు. జ్ఞాపకశక్తి కూడా బాగుండేది.
- రూప, సుగుణమ్మ కూతురు
- అల్లూరి అమ్మాజీ