Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న.. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు కోపంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని త్యజించే త్యాగమూర్తి. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు. తన బిడ్డలు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను గౌరవించుకోవాలనే భావనతో వచ్చిందే ఈ ఫాదర్స్ డే. ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే గా జరుపుకుంటున్నాం. నాన్నలు మాత్రమే కాదు ఎంతో మంది ఒంటరి తల్లులు తమ పిల్లలకు అన్నీ తామై జీవిత గమ్యాన్ని చూపుతున్నారు. అలాంటి తల్లిదండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కొందరు బిడ్డలు తమ జీవితంలో తండ్రి పోషించిన పాత్ర గురించి మనతో పంచుకుంటున్నారు.
- పాలపర్తి సంధ్యారాణి
నా ప్రగతికి సోపానం నాన్నే
నాన్న పేరు చిన రామలింగేశ్వసర్ రావు, అమ్మ కమల. మా సొంతూరు నెల్లూరు జిల్లా, కావలి. నాన్న ఎస్వీ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. నాకు ఇద్దరు తమ్ముళ్లు.వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. నాన్న ఉద్యోగరీత్యా మేము ఉత్తర భారత దేశంలో పెరిగాము. ప్రతి మూడు సంవత్సరాలకి బదిలీలు ఉండేవి. కొత్త ప్రదేశాలు, కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు. ఇదంతా మాకు చాలా సరదాగా ఉండేది. చదువుల విషయం అంతా నాన్నే చూసుకునేవారు. స్కూల్ హోమ్ వర్క్ కూడా ఆయనే చేయించేవారు. నాన్న నాకు ఎన్నో విషయాలు నేర్పించేవారు. మన తెలుగు, సంస్కృతి సాంప్రదాయాలు, కథలు చెప్పేవారు. నాకు లెక్కలు, సైన్సు సబ్జెక్ట్స్ అంటే బాగా ఇష్టం. దానికి నాన్నే కారణం. అమ్మకు ఇంటి పనులతో, వచ్చే వారికి మర్యాదలు చేయడంతో తీరిక దొరికేది కాదు. ఆడపిల్లను అనే వివక్ష ఏనాడు చూపలేదు. మగపిల్లలతో సమానంగా నన్ను పెంచారు. నేను బై.పి.సి తీసుకుని డాక్టర్ అవుతాను అంటే ఎంతగానో ప్రోత్సహించారు. మాకు ఎప్పుడు మంచి మార్కులు వచ్చేవి. తన ఇష్టాలను ఎప్పుడు మాపై రుద్దలేదు. ప్రతి విషయంలో నాకు అండగా నిలిచారు. ఇంతటి గొప్ప తండ్రిని పొందడం నాకు దొరికిన మంచి అవకాశం. ఓర్పుకి మారు పేరు, నీతికి నిదర్శనం, భవిష్యత్ మార్గదర్శకులు, నా ప్రగతికి సోపానం నాన్నే.
- డా.మంజుల రావు, గైనకాలజిగస్ట్
దుర్గాబాయ్ దేశముఖ్ హాస్పిటల్
నేనెరిగిన తొలి నేస్తం
నాన్న పేరు బోగా వెంకటరమణ, అమ్మ లక్ష్మి. మాది వరంగల్. నాన్నది టెక్స్టైల్స్ వ్యాపారం. వారికి మేము ఇద్దరం అమ్మాయిలం. మాకు చిన్నప్పటి నుంచి నాన్నతో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వ్యాపార పనులతో ఎంత తీరుబడి లేకుండా ఉన్నప్పటికీ ప్రతిరోజు భోజనం ఒక పూట తప్పనిసరిగా అందరం కలిసి చేయాల్సిందే. అలాగే ఆదివారాలు మాత్రం తన సమయాన్ని కుటుంబానికి కేటాయించేవారు. ఆదివారం తప్పనిసరిగా అందరం కలిసి సరదాగా బయటకు వెళ్ళేవాళ్ళం. నాన్నకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా ఆయనకు ఇష్టమైన స్నాక్స్ చేసిపెట్టేదాన్ని. ఎంతో బావున్నాయంటూ ఇష్టంగా తినేవారు. నేను చదువులో ఎప్పుడూ ముందుండేదాన్ని. హైదరాబాదులోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతాను అన్నప్పుడు చాలామంది బంధువులు వద్దని వారించారు. ఆడపిల్లకు మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు, అంత పెద్ద చదువులు ఎందుకు, పెళ్లి చేసి పంపించేదానికి అని నాన్నతో అనేవారు. కానీ నాన్న మాత్రం నా ఇష్టాన్ని కాదనకుండా బంధువులకే సర్ధి చెప్పుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ సమయంలో నాకు ఒక కంచు కవచంలా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ రాజీపడలేదు. నాన్న కూడా నాకు అంతే కంఫర్ట్‌ని ఇచ్చారు. మెకానికల్ ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత టాటా ఏరోస్పేస్లో ఉద్యోగంలో చేరాను. అక్కడ రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత నా మనసు సివిల్స్ వైపు మళ్ళింది. బంధువులు, స్నేహితులు అందరూ కూడా ''మంచి ఉద్యోగం, మంచి జీతం, ఎంతో కంఫర్టబుల్ జీవితాన్ని వదులుకోవడం ఎందుకు'' అంటూ నన్ను నిరుత్సాహపరిచారు. అయితే నాన్నకి నా నిర్ణయాన్ని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ''నువ్వు ఏదైనా ఆలోచించి చేస్తావు, నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎవరేమన్నా పట్టించుకోకుండా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకో'' అని ప్రోత్సహించారు.
నేను సివిల్స్ పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. నా పెండ్లి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు నా ప్రేమ విషయం నాన్నకు చెప్పాను. ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నేను ఇష్టపడిన రాజస్థాన్‌కి చెందిన ఐ.ఎఫ్.ఎస్ ఆఫీసర్‌తో నా వివాహం ఎంతో ఘనంగా, సంతోషంగా జరిపించారు. నాన్న వాళ్ళ 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలను నేనూ, మా అక్క కలిసి ఎంతో ఘనంగా జరిపించాము. బంధువులను, స్నేహితులను పిలిచి వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇచ్చాము. వాళ్ళకి బాధ్యతలు తీరిపోయాయి కనుక వారిని ప్రపంచ యాత్రలకి పంపాలని అనుకుంటున్నాను. అయితే నాన్నకు వ్యాపార రీత్యా తీరుబడి దొరకటం లేదు. నమ్మకమైన వారికి కొద్దిరోజులు వ్యాపారం అప్పగించిన తర్వాత వారిని ప్రపంచ యాత్రలకి పంపాలని అనుకుంటున్నాను.
నాకు అనుక్షణం నాకు అండగా నిలిచి, అహర్నిశలు నా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఏ కష్టాన్ని కూడా నా దాకా రానివ్వకుండా నా సుఖ సంతోషాలోనే తన సుఖసంతోషాలు వెతుక్కున్నారు. నాన్నకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.
నాన్న సరి లేరు నీకెవ్వరూ... నేనెరిగిన తొలి నేస్తం నువ్వే నాన్న...
- బి.నిఖిత, ఐఎఫ్ఎస్
నాకు అండగా నిలిచారు
నాన్న అమర్నాథ్, అమ్మ విజయ లక్ష్మి. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. నాన్నా మొదట్లో బట్టల వ్యాపారం చేసేవారు. తర్వాత ఇఎస్ఐలో ఫార్మాసిస్టుగా చేశారు. మాది చాలా పెద్దకుటుంబము. ఇంట్లో 35 మంది దాకా ఉండేవారు. ఎంతమంది ఉన్న నాకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. నాన్నకు నేనంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరగటం వల్ల మర్యాద, సభ్యత, పెద్దల పట్ల గౌరవం ఉండేవి. ఇంట్లో క్రమశిక్షణా వాతావరణం ఉండేది. పెద్దలకు ఎదురు సమాధానాలు చెప్పడం లాంటివి ఉండేవి కావు. అయినా నన్ను మాత్రం నాన్న బాగా గారబం చేసేవారు. కుటుంబ బాధ్యతలతో, వ్యాపారంతో ఎంత తీరిక లేకున్నప్పటికి నన్ను మాత్రం ఏదో ఒక వంకతో బైటకి తీసుకెళ్ళి. నాకు ఇష్టమైనవి తినిపించే వారు. ఆయనకు ఎంత ప్రేమ అంటే అర్ధరాత్రి లేచి ఆకలి వేస్తోంది అంటే ఇంత అర్ధరాత్రి ఏమి దొరుకుతాయి అని అనుకోకుండా ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచించే వారు. ఎప్పుడు కూడా చదువుకోమని కానీ, ఆంక్షలు విధించడం కానీ చేయలేదు. పైగా తెల్లవారుఝామున లేచి చదువు కుంటుంటే ''ఎందుకమ్మా నాలుగు గంటలకు లేస్తారు. హాయిగా పడుకోండి'' అనేవారు. కాకపోతే ఎప్పుడు ఒక మాట చెప్పేవారు. ''నువ్వు ఏ పని అయిన సరే నీకు నచ్చింది చేయి. ఒక కమిట్మెంట్తో చేయి'' అనేవారు. అయితే నాకు అనుకోకుండా మా ఇంటి ఎదురుగా ఉండే ఆంటీ పరిచయంతో టీవీలో నటించే అవకాశం వచ్చింది. ఇంట్లో నానమ్మ వాళ్లు అందరూ అభ్యంతరం చెప్పారు. నాన్న మాత్రం ''కాలం మారింది, సమాజం మారింది, ఆడపిల్ల ఇంటికే పరిమితం అవ్వాల్సిన రోజులు కావంటూ'' నాకు అండగా నిలిచారు. షూటింగ్స్ ఉంటే తనే నా సామాన్లు అన్ని రెడీ చేసి ఉదయం 5 గంటలకల్లా అన్ని సిద్ధంగా ఉంచేవారు. తర్వాత నేను బిజీ అవడం వల్ల ఒక్కోసారి వేరే ఊర్లలో షూటింగ్స్ ఉంటే ఇంటికి వచ్చే సమయం ఉండేది కాదు. అలాంటప్పుడు నాన్న నా లగేజ్‌తో పాటు దారిలో తినడానికి ఏమైనా తీసుకుని రైల్వే స్టషన్కి కానీ, ఎయిర్‌పోర్ట్‌కి కానీ వచ్చేవారు.
ఆడపిల్లలకు నాన్నతో చిన్నతనంలో ఉండే అనుబంధం కొంత యుక్త వయసు వచ్చాక తగ్గుతుంది. కానీ నా విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే అమ్మ ఒక రోజు బాత్రూమ్ పడింది. తర్వాత పూర్తిగా మంచానికి అంకితం అయిపోయింది. అమ్మతో నాకు బాగా అనుబంధం ఉండేది. అయితే అమ్మకు మూడు సంవత్సరాల తర్వాత మాట కూడా పోయింది.అప్పుడు చాలా ఒంటరితనం అనుభవించాను. ఎందుకంటే ఆ వయసులో అమ్మతో పంచుకునే విషయాలు నాన్నతో పంచుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. రాను రాను ఒక వైపు ఇంటి పనులు, మరో వైపు అమ్మను చూసుకోవడం, నా షూటింగ్స్ షెడ్యుల్స్ మొదలైన విషయాలు అన్ని కూడా నాన్నతో చర్చించా వలసి వచ్చేది. మొదట్లో కొంచం ఇబ్బంది అనిపించింది. కాని తర్వాత నాన్నతో అన్ని విషయాలు చర్చించడం అలవాటయిపోయింది. సంపాదన పట్ల అవగాహన ఉండాలని నాకు మొట్ట మొదటి రెమ్యూనరేషన్ చెక్ వచ్చినప్పుడు బాంక్‌కి తీసుకెళ్లి నా పేరు మీద అకౌంట్ తెరిపించి ''ఇక నుంచి నువ్వు సంపాదించే ప్రతి పైసా నీ అకౌంట్లోనే జమ కావాలి. నీ సంపాదన నీ ఇష్టం'' అని చెప్పారు. ఇక నా పెండ్లి అయ్యి పాప పుట్టిన 8 నెలలకి అమ్మ చనిపోయారు. అమ్మ సంవత్సరికం అయిన నాలుగు రోజులకే ఆయన పోయారు. అమ్మతో ఆయనకు చాలా చాలా బాండింగ్ ఉండేది.
- సుమన శ్రీ, నటి