Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాచారం కోసం కొనుక్కునే వార్తా పత్రికలు ఇంట్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వార్తలు చదివేశాక పత్రికలను ఒక పక్కన పెడుతుంటాము. రెండు మూడు నెలలయ్యాక పాత పేపర్ల వాళ్ళకి అమ్మేస్తుంటారు. ఈ లోపల ఆ పేపర్లతో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతాం. అలమర్లలో సామాను సర్దుకునే ముందు పాత పేపర్లను వేసి పెట్టుకుంటాము. అలమర్లలో ఉండే తేమను పేపర్లు పీల్చుకొని వస్తువులు, చీరలు పాడవకుండా కాపాడతాయి. ఇంకా ఇంట్లో పిండి జల్లెడ పట్టుకోవాలన్నీ, పప్పు దినుసులు ఎండబెట్టాలన్నా, బయట చిన్న చిన్న హౌటళ్ళలో పునుగులు, బజ్జీలు, పకోడీలు పొట్లం కట్టాలన్నా పాత పేపర్లు అవసరమే. గతంలో అయితే కందిపప్పు, మినపప్పులు సైతం కాగితంలోనే పొట్లాలు కట్టేవారు. మా చిన్నతనంలో ప్లేట్లు, స్పూన్లు కూడా పేపర్లే. సాయంత్రం పూట తినే గుగ్గిళ్ళు పేపర్లు కత్తిరించి పెట్టేది మా అమ్మ. మేము హార్లిక్స్ పొడిని, పంచదారను కలిపి పేపర్లో పోసుకుని, వాటిని తినడానికి కూడా చిన్న పేపర్ ముక్కనే వాడేవాళ్ళం. ఆ పాత అలవాట్లే ఇప్పుడు బహుశా పేపర్ ప్లేట్ల తయారీకి కారణమై ఉంటుంది. అప్పుడు శనగపప్పు, గుగ్గిళ్ళు తిన్న పేపర్లనే గట్టిగా తయారు చేసి ఉప్మాలు, ఇడ్లీలు కూడా తినేందుకు వీలుగా తయారు చేస్తున్నారు. వీటిలో సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ కూడా లభిస్తున్నాయి. నేను వీటితో చాలా బొమ్మలు చేశాను. ఇప్పుడు పేపర్ ప్లేట్లతో, న్యూస్ పేపర్‌తో కొన్ని బొమ్మలు, అలంకార వస్తువులు తయారు చేసి చూపిస్తాను.
టోపీ
మొదటగా ఒక పేపర్ ప్లేట్ దగ్గర పెట్టుకోవాలి. న్యూస్ పేపర్‌ను బెత్తెడు వెడల్పుతో ముక్కలు పొడవుగా కత్తిరించాలి. ఈ పేపర్‌ను కుచ్చులు పెట్టుకుంటున్నట్టుగా గమ్‌తో పైవైపున అతికించాలి. ఈ పేపర్ కుచ్చుల్ని పేపర్ ప్లేట్ చుట్టూతా పెట్టి అతికించాలి. కుచ్చులా చక్కగా కనిపిస్తుంది. కుచ్చును లోపలికి వంచి దగ్గరకు చేర్చి ఒక లేసును అతికించాలి. ఇది తల భాగం పట్టే భాగమన్నమాట. ఇప్పుడు మొదట్లో కుచ్చులు పెట్టినట్టుగా మరల పేపర్ కత్తిరించుకుని కుచ్చులు పెట్టి అతికించాలి. ఈ కుచ్చుల్ని టోపీ తల భాగానికి చుట్టూ అతికించాలి. ఇప్పుడు చక్కని టోపీలా తయారయింది. అయితే దీనికి అలంకారకం చెయ్యాలి కదా! చుట్టూ బంగారు రంగు లేసులు, పూసలు, చిన్న పూలు అక్కడక్కడా అతికితే అద్భుతంగా ఉంటుంది. న్యూస్ పేపర్‌తో టోపీ అందంగా అమిరింది కదా!
పూలబుట్ట
ఈ పూలబుట్టను న్యూస్ పేపర్ రోల్స్‌తో కాకుండా పూర్వ కాలపు పద్ధతిలో చేస్తున్నాను. న్యూస్ పేపర్‌ను ముక్కలుగా తుంచి వాటిని మడత పెట్టి పూలబుట్టను చేస్తున్నాను. మా చిన్నతనంలో ఈ అల్లకాన్ని సిగరేట్ పెట్టెలతో చేసేవారు. మా అమ్మ కూడా ఏనుగు, కుక్కపిల్ల బొమ్మల్ని చేసేది. అందుకోసం మేము సిగరెట్ పెట్టెలను సేకరించుకుని వచ్చే వాళ్ళం. అదే పద్ధతిలో ఇప్పుడు చేస్తున్నాను. పది సెం.మీ పొడవు, 4 సెం.మీ వెడల్పుతో న్యూస్ పేపర్‌ను కత్తిరించాలి. అలా కత్తిరించిన ముక్కల్ని గట్టిగా ఉండేందుకు నాలుగైదు మడతలు వేసుకోవాలి. ఇలా మడత పెట్టి వాటిని ఒక దానిలో ఒకటి దూర్చితే గట్టిగా నిలబడుతుంది. ఒక్కొక్క ముక్కను కలుపుకుంటూ పోతుంటే వరసగా లేస్లాగా అల్లకం వస్తుంది. ఇవి ఎక్కువ వెడల్పు ఉండవు. కాబట్టి నాలుగైదు వరసలు చేసుకొని ఒక దానిపై ఒకటి నిలబెట్టాలి. ఇలి నిలబెట్టాక నాలుగు వరుసల్ని కట్టేస్తున్నట్టుగా పేపర్ మడతల్ని మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది గుండ్రంగా వస్తుంది. ఇప్పుడు అడుగు భాగాన్ని కూడా ఇదే విధంగా అల్లుకుంటూ రావాలి. పై భాగాన బుట్టను పట్టుకునే కాడ కావాలి. ఇదే విధంగా పేపర్ ముక్కలతో అల్లుకుంటూ వచ్చినపుడు సన్నని కాడ మాదిరిగా వస్తుంది. దీని కోసం చిన్న పేపర్ ముక్కలు ఉపయోగించాలి. ఈ కాడలా తయారైన భాగాన్ని బుట్టకు రెండు వైపులా దూర్చి కాడలా అమర్చాలి.
వాల్ హ్యాంగింగ్
నాలుగు ఐస్‌క్రీం పుల్లలు తీసుకుని నలుచదరంగా పెట్టి అతికించాలి. ఇప్పుడు న్యూస్ పేపర్‌ను నాలుగు ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఒక్కొక్క ముక్కను తీసుకొని పొడుగాటి పెన్సిల్ పెటివ్ట గుండ్రంగా రోల్ చేసుకోవాలి. పెన్సిల్ తీసేసి చివర్లు గమ్‌తో అతికించాలి. ఇలా న్యూస్ పేపర్ రోల్స్ చాలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఐస్‌క్రీం పుల్లల చదరంలో పేపర్ రోల్స్ వరసగా పెట్టి అతికించాలి. వరసగా అతికించినపుడు చక్కని నలుచదరం తయారైంది. ఒక పేపర్ కప్పును తీసుకొని ఈ చదరానికి అతికిస్తే పూలు పెట్టుకునే వేజ్లా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిజం పూలు పెట్టుకోవచ్చు. లేదా న్యూస్ పేపర్‌తో గులాబీలు చేయవచ్చు. ఆ గులాబీలు పేపర్ కప్పు వేజ్లో పెట్టుకుంటే బాగుంటుంది.
గులాబీలు
అందమైన పింక్ రంగు గులాబీలను చూస్తుంటాం. గులాబీ అంటే పింక్ రంగే. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రంగుల గులాబీలు దొరుకుతున్నాయి. అయితే మనం ఇప్పుడు అక్షరాలను ఒంటి మీద నింపుకున్న గులాబీలు చేద్దాం. సన్నగా పొడవుగా చీలికలుగా న్యూస్ పేపర్లు కత్తిరించి పెట్టుకోవాలి. సాటిన్ రిబ్బన్లను మడిచి గులాబీలను తయారు చేస్తున్నట్టే ఈ పేపర్ చీలికలతో గులాబీలను చేయవచ్చు. పొడవైన పేపర్ చీలికలను తీసుకొని ఒక మూలను కొద్దిగా లోపలికి మడవాలి. ఒక మడత లోపలికి, ఒక మడత బయటకు వేస్తూ మొత్తం పేపర్ చుట్టడం పూర్తయ్యేసరికి గులాబీ తయారవుతుంది. ఇలాగే అన్ని పువ్వులనూ తయారు చేసుకోవాలి. ఈ పువ్వుల్ని కొమ్మలకు అతికించి ఆకుల్ని అమరిస్తే గులాబీ కొమ్మలు రెడీ.
ఆఫ్రికన్ మహిళ బొమ్మ
ముందుగా న్యూస్ పేపర్‌ను రోల్స్‌గా మార్చి తయారుచేసి పెట్టుకోవాలి. చిన్నప్పుడు చేసుకున్న తాటాకుల బొమ్మలాగే దీన్ని కూడా చెయ్యాలి. పొడుగాటి పేపర్ రోల్స్‌ను మడిచి దానికి అడ్డంగా ఒక పేపర్ రోల్‌ను దూర్చాలి. అడ్డంగా ఉన్న పేపర్ రోల్ చేతులన్నమాట. నిలువుగా ఉన్న పేపర్ రోల్‌కు పై భాగాన గుండ్రంగా చుడుతూ వెళ్తే గుండ్రంగా తలలా తయారవుతుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ రోల్స్ తీసుకొని చేతల కిందుగా కట్టలా కట్టాలి. మా చిన్నతనంలో మేము కూల్‌డ్రింగ్ స్ట్రాలను ఉపయోగించి ఈ బొమ్మల్ని చేసేవాళ్ళం. అయితే మన తెలుగు మహిళల్లా తీర్చిదిద్దేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఆఫ్రికన్ మహిళల్ని తయారు చేస్తున్నాను. ఈ బొమ్మలకు మెడ పొడవుగా, ముఖం కోలగా ఉండేలా చూడాలి. చేతుల్ని పై వైపుకు వంచి నెత్తిమీద గంపను పట్టుకున్నట్టుగా పెట్టాలి. లేదా పేపర్ రోల్స్ కొన్ని పెట్టి కట్టెల మోపు మోస్తున్నట్టుగా కూడా చూపవచ్చు. ఇంక దీనికి అలంకారం మీ ఇష్టం. బట్టలు, పూసలు, కుందన్లు, లేసులు ఏమైనా మీ బొమ్మ మీ ఇష్టం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్