Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీత దినోత్సవం మొదటిసారిగా ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. 1982, జూన్ 21 నుండి కొనసాగిస్తూ వస్తున్నారు. భారతదేశం సంగీత దేశం. అలనాటి అన్నమయ్య, త్యాగరాజులను మరచిపోలేము. ప్రముఖ గాయకుడు ఘంటసాలకు ప్రపంచ స్థాయిలో పేరు వచ్చిందంటే ఆ గొప్పతనం సంగీతానిదే. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, ఆఖరికి పక్షులు, జంతువులు సైతం సంగీతానికి ముగ్ధులవుతాయి.
భక్త రామదాసు భజన సాంప్రదాయానికి, కబీర్ దాస్ రామ చరిత్ మానస్‌కు, ముత్తుస్వామి దీక్షితులు నవవర్ణ కీర్తనలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆధునిక సంగీత కీర్తనలకు, ఎం.ఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీత రాగాలు ఇంకా అనేకమంది లబ్దప్రతిష్టులైన సంగీత ప్రముఖులకు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన సంగీతంతో వారు కూడా బహుముఖంగా కీర్తింపబడ్డారు. నాడు గ్రామ్ ఫోన్ ద్వారా వినే సంగీతాన్ని నేడు సెల్ఫోన్లో వింటున్నాం. ఎంత అభివృద్ధి చెందినా ఎప్పుడూ ఓల్డ్ ఇస్ గోల్డ్. సంగీత వాయిద్యాలు వీణ, సన్నాయి, మృదంగం, డోలు, డప్పు, వైలెన్, హార్మోనియం, వేణువు వంటి అనేకం ఉన్నాయి.
నేడు ఎందరో సంగీతమే ప్రాణంగా జీవిస్తున్నారు. అచేతనంగా మారిన శరీరాన్ని సైతం, చైతన్య శీలంగా మార్చే శక్తి సంగీతానికి ఉంది. మనసుకు ఉల్లాసాన్ని అందించే సంగీతానికి పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. కాలం మారింది. కాలంతో పాటు సంగీతంలో కూడా కొత్తదనం వచ్చింది. స్వరములు ఏడు. అయినా రాగాలు ఎన్నెన్నో అన్నట్టుగా 1970 నుండి సంగీతంలో కొత్త ఒరవడి ప్రారంభమైందని చెప్పవచ్చు. 1980 నుండి ఇళయరాజా వంటి వారితో నూతన శకం మొదలైంది. దక్షిణ భారత దేశంలో పాశ్చాత్య సంగీతంలో విశాలమైన వినసొంపు అయిన జిలుగులను ప్రవేశపెట్టారు.