Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీతం... ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో చెప్పలేనిది. సంగీతం ఎంతో మధురమైంది. రాగం.. తానం... పల్లవి. ఈ మూడు సంగీతానికి ప్రాణాధారాలు. సప్తస్వరాలే సంగీత ప్రపంచానికి మూలాధారాలుగా నిలుస్తున్నాయి. కాలాన్ని సైతం మరిపించి.. మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని అందించే శక్తి సంగీతానికి మాత్రమే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతంతో తన అనుబంధాన్ని మానవితో ఇలా పంచుకుంటున్నారు.
మా అమ్మ విజయలక్ష్మి భారతి, నాన్న కోడూరి బోస్. నేను ఒక్కదాన్నే వారికి సంతానం. నేను పుట్టింది కర్ణాటకలోని అమరేశ్వర క్యాంప్. తాతగారి వాళ్ళది రాజమండ్రి దగ్గర కొవ్వూరు. చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే కూడా సంగీతం మీద మక్కువ ఉండేది.
గాయని కావాలనుకున్నాను
నా ఆరేండ్ల వయసులో శంకరాభరణం సినిమా చూసి అలా పాటలు పాడేయాలని అనుకునేదాన్ని. పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అందుకే గాయనిని కావాలని అనుకున్నాను. నా గురువుగారు శివదత్తా. వారు హార్మోనియం మీద నేర్పించేవారు. అలా చిన్న తనంలోనే నా సంగీత ప్రస్థానం ప్రారంభం అయింది.
పన్నెండేండ్లకే దర్శకత్వం
నేను ఒకటి అనుకుంటే మరోలా జరిగింది. గాయనిని కావాలని అనుకున్న నేను అనుకోకుండా సంగీత దర్శకురాలిని అయ్యాను. నాకు పన్నెండేండ్లు ఉన్నప్పుడు మొదటి సారి తమిళ సినిమాకు సంగీత దరకత్వం వహించాను. ఆ తర్వాత తెలుగులో దాసరి నారాయణరావు నటించిన 'నాన్నగారు' సినిమాకు సంగీత దరకత్వం వహించాను.
అన్నీ తట్టుకోగలగాలి
నేను చూసినంత వరకు ఈ రంగంలోకి మహిళలు ఎక్కువగా రావడం లేదు. ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి. ప్రపంచంలో ఎందరో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ ఎందుకు గుర్తింపు తెచ్చుకోలేదు. అదృష్టం కూడా కొంత ఉండాలి అనేది నా నమ్మకం. ఆడవాళ్లు కొన్ని కట్టుబాట్లు, ఆకాంక్షల మధ్య పెరుగుతారు. ముఖ్యంగా సంగీతం నేర్చుకునే వాళ్ళు సంప్రదాయాల మధ్య పెరుగుతారు. అటువంటి వారికి సినిమా రంగం కాస్త కష్టమే. డైరెక్టర్ ఎప్పుడు రమ్మంటారో తెలియదు, మనం కంపోజ్ చేసిన మ్యూజిక్ నచ్చకపోతే వాళ్లకు నచ్చే వరకు కంపోజ్ చేస్తూ ఉండాల్సిందే. కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇవన్నీ తట్టుకోగలగాలి.
అర్ధరాత్రి అయినా వెళ్ళాల్సిందే
పగలు, సాయంత్రం, రాత్రి, తెల్ల వారుఝాము అనేవి ఉండవు. అర్ధరాత్రి వచ్చి మ్యూజిక్ కంపోజ్ చేయమంటే వెళ్లి చేయాల్సిందే. కపోసింగ్ వేరే ఊర్లో చేయవలసి రావచ్చు. మా అమ్మనాన్నలను తీసుకుని వస్తాను అంటే కుదరకపోవచ్చు. ఒంటరిగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన వాళ్లకు ఇళ్లలో పర్మిషన్ ఇవ్వరు. అలాంటపుడు ఈ రంగంలో రాణించడం కష్టమే. ఒక్కొక్క సారి సినిమా విడుదల డేట్ నిర్ణయించుకుని ఆ లోపల మాకు మ్యూజిక్ కంపోస్ చేసి ఇవ్వాల్సిందే అన్నప్పుడు ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది.
మహిళా దర్శకులు వస్తే
ఆడవాళ్లు సహజంగా సున్నిత మనస్కులు. ఏదైనా అంటే తట్టుకోలేరు. నేను కూడా మొదట్లో ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత తర్వాత రాటు తెలిపోయాను. అది కాకా ఒక్కొక్క దర్శకుడి మైండ్‌సెట్ ఒక్కో రకంగా ఉంటుంది. 100 మంది మగాళ్ల మధ్యలో ఒక్క ఆడది పని చేయగలగాలి. సినిమా రంగంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మనకు ఎదుటివారి నుండి గౌరవం దొరుకుతుంది. మహిళా దర్శకులు ఎక్కువగా వస్తే, మహిళ సంగీత దర్శకులకు కూడాక అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది.
ధైర్యంతో ముందడుగు వేశారు
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వంటింటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లగలిగారు అంటే వారు ఎంత సాధికారత సాధించారో అర్ధం చేసుకోవచ్చు. వంటింటి నుంచి బయటకు రావడానికి ఎన్ని కష్ట నష్టాలు, ఆటుపోట్లు, ఇబ్బందులు, చీదరింపులు, వివక్షలు ఎదుర్కున్నారు. మానసిక ఘర్షణ అనుభవిస్తూ ధైర్యంతో ముందడుగు వేశారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కనుక మీకు నచ్చింది చేయండి. మీ ఇష్టాలని దూరం చేస్కోకండి. కోరుకున్నది చేసి చూపించండి.
- పాలపర్తి సంధ్యారాణి