Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్పనా సరోజ్... ఒకప్పుడు పేదరికం, గృహ హింస, అన్యాయాలను భరించలేక ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించింది. ఇప్పుడు మల్టీబిలియన్ డాలర్ల కార్పొరేషన్‌కి సీఈఓ అయ్యింది. ఆమె జీవితం కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది.
కల్పన 1961లో మహారాష్ట్రలోని అకోలా సమీపంలోని రోపర్ఖేడా అనే చిన్న పట్టణంలో పుట్టింది. పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఆమె వేధింపులకు గురైంది. 12 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. అప్పట్లో అమ్మాయికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెండ్లి చేసి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత. స్త్రీలు కుటుంబాన్ని, పిల్లలను, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది.
నిత్యం వేధింపులే
ఇలాంటి నేపథ్యాల నుండి వచ్చిన కల్పన కూడా అందరిలాగానే తన ఇంటిని, కుటుంబాన్ని చూసుకోవడం ప్రారంభించింది. తన కంటే వయసులో పదేండ్లు పెద్దవాడయిన భర్తతో కలిసి జీవించడానికి ముంబైకి వచ్చింది. ఆమెను ఒక మురికివాడకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమె తన భర్త, సోదరుడు, అతని భార్యతో కలిసి గదిని పంచుకోవాల్సి వచ్చింది. ఆమె బావ, అతని భార్య ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించేవారు. కల్పనను ఇద్దరూ కొట్టారు. తీవ్రంగా హింసించేవారు. నిత్యం శారీరక, మానసిక వేధింపుల కారణంగా ఆమె మనసు విరిగిపోయింది.
ఇంటికి తిరిగి తీసుకొచ్చారు
వేధింపులు తీవ్రత రోజురోజు పెరిగిపోయింది. కూతురికి పెండ్లి చేసి పంపించిన ఆరు నెలల తర్వాత తండ్రి ఆమెను కలవడానికి వచ్చినప్పుడు. అయితే అతను ఆమెను గుర్తు పట్టలేకపోయాడు. కూతురి కష్టాలను చూసిన అతను భరించలేకపోయాడు. ఆమెను తనతో పాటు తిరిగి తీసుకువెళ్లి చదువు కొనసాగించమని చెప్పాడు. అయితే పెండ్లయిన ఒక ఆడపిల్ల తన తల్లి ఇంటికి తిరిగి రావడాన్ని వారి సంస్కృతి ఆమోదించలేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో ఒత్తిడికి లోనయ్యారు.
సమాజం ఒప్పుకోలేదు
సమాజం ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా హింసించింది. ఒక వివాహిత బాలికను తన తల్లి ఇంటికి తిరిగి రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భరించలేని బాధలు, పరిస్థితులు ఆమెను 16 సంవత్సరాల వయసులో మూడు పురుగుమందుల సీసాలు తాగేలా పురికొల్పాయి. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.
ఆ పరిస్థితుల నుండి బయటపడి
అయితే ప్రపంచం ఆమె కోసం వేరే ప్రణాళికలు రూపొందించింది. ప్రాణాపాయంలో ఉన్న సరోజను ఆమె మేనత్త రక్షించింది. ఈ సంఘటనతో కల్పన దృక్పథం మారిపోయింది. ఆమె జీవిత విలువను గ్రహించింది. ఎలాగైనా జీవించాలని బలంగా కోరుకుంది. అప్పటి నుండి గ్రామస్తుల చులకన వ్యాఖ్యలకు భయపడకుండా వాటిని సవాలుగా తీసుకుంది. భయంకరమైన పరిస్థితుల నుండి బయటపడాలని నిర్ణయించుకుంది. తన మామతో నివసించడానికి ముంబైకి తిరిగి వెళ్లింది. కుటుంబాన్ని పోషించడానికి గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభించింది.
వ్యాపారం ప్రారంభించింది
తన తెలివితేటలో రూ. 50,000 అప్పు తీసుకుని టైలరింగ్ వ్యాపారం చేయడానికి కుట్టు మిషన్‌ను కొనుగోలు చేసింది. తర్వాత ఫర్నిచర్ దుకాణాన్ని నిర్మించే ప్రయత్నం చేసింది. అంతేకాదు కల్పన ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించి. మహారాష్ట్రలోని ఖైర్లాంజీలో ఒక దళిత కుటుంబ పోరాటం, వారు ఎదుర్కొన్న దౌర్జన్యాలపై 'ఖైర్లాంజిచ్య మత్యవార్' అనే పేరుతో ఒక కమర్షియల్ సినిమాని కూడా నిర్మించారు.
దళిత జీవితాలు తెరపైకి
ఆధునిక కాలంలో కూడా దళితులను ఎలా పరిగణిస్తున్నారనే దానిపై అవగాహన కల్పించేందుకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కథనాన్ని తెరపైకి తీసుకురావాలని ఆమె కోరుకుంది. ఈ సినిమా హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లోకి డబ్ చేయబడింది. నేరస్తులను అరికట్టకపోతే, అవగాహన కల్పించకపోతే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని కల్పన అంటుంది.
పద్మశ్రీ లభించింది
కల్పన త్వరలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. దాంతో మెటల్ ఇంజినీరింగ్ సంస్థ అయిన కమానీ ట్యూబ్స్ బోర్డులో పని చేయడం మానుకుంది. భారీగా అప్పులు చేయడంతో దివాళా తీసిన తర్వాత ఆమె దాని బాధ్యతలు చేపట్టింది. ఆ నష్టాలన్నీ తిప్పికొట్టి లాభదాయకమైన వ్యాపారంగా దాన్ని మార్చింది. ఆయా రంగాలకు ఆమె చేసిన కృషికి గుర్తింపు వచ్చింది. దానితో 2013లో పద్మశ్రీగా గౌరవం లభించింది.
అవకాశాలు పెరిగాయి
సాంకేతికత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిందని కల్పన గట్టిగా నమ్ముతుంది. గతం కంటే సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. అమ్మాయిలకు కూడా మునుపటితో పోలిస్తే కొత్త అభివృద్ధి అవకాశాలను కలిగి ఉన్నారు. మహిళలు తప్పనిసరిగా సుశిక్షితమై ఉండాలని, ఇబ్బందుల కారణంగా తమ ఇష్టాలను వదులుకునేలా ఉండకూడదని ఆమె అంటుంది.
- సలీమ