Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోధుమరవ్వతో ఏం చేయొచ్చంటే చాలా మంది నుంచి వచ్చే సమాధానం ఉప్మా. అయితే మన వరీరానికి అవసరమైన మ్యాంగనీస్, మెగ్నీషియంలాంటి ఖనిజాలు, బి విటమిన్లనూ అందించే గోధుమరవ్వతో నోరూరించే ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం...
టిక్కీలు
కావల్సిన పదార్థాలు: గోధుమరవ్వ - కప్పు, ఉడికించిన ఆలూ - ఒకటి (మెత్తగా చేసుకోవాలి), పాలకూర తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం తరుగు - చెంచా, జీడిపప్పు పొడి - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, గరంమసాలా - అరచెంచా, నూనె - వేయించడానికి సరిపడా, పాలు - కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ.
తయారు చేసే విధానం: ముందుగా గోధుమరవ్వను దోరగా వేయించుకోవాలి. వేడి తగ్గాక పాలల్లో నానబెట్టుకోవాలి. ఓ గిన్నెలో ఉడికించిన ఆలూ ముద్దతో పాటు మిగిలిన పదార్థాలన్నీ నానబెట్టిన గోధమరవ్వతో సహా ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టిక్కీలా అద్దుకుని కాగుతున్న నూనెలో వేయాలి. ఇలా మిగిలిన మిశ్రమాన్ని కూడా చేసుకుంటే వేడివేడి టిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని టొమాటో సాస్‌తో కలిపి వడ్చించవచ్చు.
లడ్డు
కావల్సిన పదార్థాలు: గోధుమరవ్వ - కప్పు, బొంబాయి రవ్వ - అరకప్పు, చక్కెర - అరకప్పు, కరిగించిన నెయ్యి - అరకప్పు, జీడిపప్పు పలుకులు - కొన్ని, యాలకులపొడి - చెంచా.
తయారు చేసే విధానం: ముందుగా గోధుమరవ్వను వేయించుకోవాలి. వేడి చల్లారాక మిక్సీలో వేసుకుని బరకగా పొడి చేసుకోవాలి. అలాగే చక్కెరను కూడా పొడి చేసుకుని బొంబాయి రవ్వను కూడా వేయించుకుని ముందుగా చేసి పెట్టుకున్న గోధమరవ్వ పొడిలో వేయాలి. చివరగా ఇందులో యాలకుల పొడీ, జీడిపప్పు పలుకులూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్లు చుట్టుకుంటే సరిపోతుంది. ఇవి పది రోజుల వరకూ తాజాగా ఉంటాయి.
పొంగలి
కావల్సిన పదార్థాలు: గోధుమరవ్వ - ముప్పావుకప్పు, సెనగపప్పు - కప్పు, చక్కెర - రెండు కప్పులు, కొబ్బరి తురుము - కప్పు, యాలకులపొడి - చెంచా, నెయ్యి - పావుకప్పు, అరటిపండు - ఒకటి.
తయారు చేసే విధానం: సెనగపప్పును దోరగా వేయించుకుని సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత గోధుమరవ్వను కూడా సరిపడా నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఈ రెండింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని మరికొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి, చక్కెర వేసుకోవాలి. కాసేపటికి చక్కెర కరుగుతుంది. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే మిశ్రమం దగ్గరపడుతుంది. అప్పుడు దోరగా వేయించిన కొబ్బరి తురుమూ, నెయ్యీ, యాలకుల పొడీ వేసి బాగా కలపాలి. దీన్ని మరో గిన్నెలోకి తీసుకుని పైన అరటిపండు ముక్కలు వేసుకుంటే నోరూరించే పొంగలి సిద్ధం.
ఇడ్లీలు
కావల్సిన పదార్థాలు: గోధుమరవ్వ - కప్పు, మినప్పప్పు - అరకప్పు, ఉప్పు - కొద్దిగా, క్యారెట్ తురుము - అరకప్పు, ఆవాలు - అరచెంచా, సెనగపప్పు - పావుచెంచా, కరివేపాకు రెబ్బలు - రెండు మూడు, నూనె - పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువగా.
తమారు చేసే విధానం: మినప్పప్పు, గోధుమరవ్వను విడివిడిగా నానబెట్టుకోవాలి. నానిన మినపప్పును ఇడ్లీపిండిలా మెత్తగా రుబ్బుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. నానబెట్టిన రవ్వలోని నీటిని పిండేసి దాన్ని మినప్పిండిలో వేయాలి. అందులో క్యారెట్ తురుమూ, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి గంటసేపు నాననివ్వాలి. ఈ పిండిని వాడుకునే ముందు బాణిలో చెంచా నూనె వేడిచేసి ఆవాలూ, సెనగపప్పు, కరివేపాకు వేయించి అందులో కలపాలి. తర్వాత నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లల్లో ఈ పిండిని కొద్దికొద్దిగా వేసుకుని ఆవిరిమీద ఉడికించుకుంటే సరిపోతుంది. వీటిని వేడివేడిగా తింటేనే బాగుంటాయి.