Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పుట్టి పెరిగిన ఊరు... కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం... విప్లవ పుస్తకాల పఠనం... అన్నింటికీ మించి అన్యాయంపై తిరగబడే స్వభావం... ఉడుకు నెత్తురు ఉద్యమం దిశగా ప్రేరేపించగా... సరళంగా సాగుతున్న జీవితం సమర సన్నద్ధమై అడవిబాట పట్టింది... 'ఖాకీ' కోవర్టు అనే 'అన్నల' అనుమానపు ముద్ర బందూకై ఆమెను బలిగొంది. మన్నెం మింగిన 'వెన్నెల'లా ఓ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసింది'' ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కామంచికల్ గ్రామానికి చెందిన తూము సరళ జీవితం ఆధారంగా... కొద్దిపాటి సినిమాటిక్ మార్పులతో రచయిత, దర్శకుడు ఊడుగుల లక్ష్మణ్ 'విరాటపర్వం' మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమాలో సరళ పాత్రలో ప్రముఖ కథానాయిక సాయిపల్లవి నటన ప్రశంసలు అందుకుంటోంది. 'ఆమెను చూస్తే చెల్లే మళ్లీ వచ్చినట్టుంది...' అని సరళ అక్క, ఐద్వా నాయకురాలు వడ్డె పద్మ అంటున్నారు. సరళ యదార్థ జీవిత విశేషాలను పద్మ 'మానవి' ముందు ఆవిష్కరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
1977లో జోరుగా వానలు కురుస్తున్న సమయంలో సరళ జన్మించింది. పుట్టిన 20 రోజులకు కోమాలోకి వెళ్లింది. ఎట్టకేలకు ప్రాణాపాయం నుంచి బయట పడింది. నాకు చెల్లికి మధ్య ఏడేండ్ల వ్యత్యాసం. మధ్యలో పెద్దతమ్ముడు వెంకటేశ్వరరావు, చిన్నతమ్ముడు మోహన్‌రావు. అమ్మ స్వరాజ్యం గృహిణి. నాన్న భిక్షమయ్య వ్యవసాయం చేస్తూ గ్రామంలో భూముల కొలతలు కొలిచేవారు. మొదటి నుంచి మా కుటుంబానిది వామపక్ష భావజాలం. సరళ నాన్నకు దగ్గరగా ఉండేది. పుస్తకాలంటే ఆమెకు ఎనలేని ఇష్టం. నాన్న కమ్యూనిస్టు కావడంతో ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. తరగతి పుస్తకాలతో పాటు సరళ వాటినీ చదువుతూ ఉండేది. పత్రికలు కూడా బాగా చదివేది. చదివిన అంశాలపై ఇంట్లో వాదనలకు దిగేది. దాని ఫ్రెండ్స్ కూడా అలాగే ఉండేవారు. ఆమె స్నేహితురాలు సృజన ఇప్పుడు ప్రముఖ లాయర్.
ఉద్యమంపైనే ప్రేమ
సినిమాలో ఏమి చూపించారో నాకు తెలియదు. చెల్లి గుర్తొస్తేనే నా గుండె బరువు ఎక్కుతోంది. దు:ఖం తన్నుకొస్తోంది. బీపీ, షుగర్‌తో అవస్థపడుతున్నాను. సినిమా చూసి తట్టుకొలేనని వెళ్లలేదు. మా పిల్లలు చూశారు. టీవీల్లో పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా చెబుతున్న శంకరన్న అనే వ్యక్తి ఆమెకు తెలియదు. సినిమాలో శంకరన్నపై ప్రేమతో వెళ్లినట్లు చూపించారట. అది కల్పితం. సరళ ఐదో తరగతి వరకు భూపాలపల్లి జిల్లా సెల్పూర్‌లో చదివింది. ఆరో తరగతి ఖమ్మం వన్‌టౌన్ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుతున్నప్పడు ఓ వామపక్ష పార్టీ ఆఫీసులో సైకిల్ పెట్టి వెళ్లేది. అలా ఆ వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘానికి దగ్గరైందని అంటున్నారు. ఆ పరిచయాలు, ఎవరి ప్రేరణతోనో ఉద్యమాల పట్ల ఆకర్షితురాలై ఉండొచ్చు. అడవిబాట పడతానని వాళ్లతో అన్నప్పుడు మాకు చెప్పి ఉండాల్సింది. మేము ఏదో విధంగా నచ్చజెప్పేవాళ్లం. సరిగ్గా ఆమెకు 16 ఏళ్ల రెండు నెలల వయసులో 1992 ఫిబ్రవరి 18న చిన్నతమ్ముడి జేబులో నుంచి రూ.200, ఆమె రాసుకున్న డైరీ తీసుకుని ఇంటి నుంచి వెళ్లింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనైతే నాన్నకు తెలిసిన వారు సమాచారం ఇస్తారని కాబోలు... సుదూరంలోని నిజామాబాద్ జిల్లా మానాల అటవీ ప్రాంతానికి చేరింది. తాను రాసుకున్న డైరీ చూడకుండా అనుమానించి చంపి ఉంటారు. డైరీ చదివి తప్పు తెలుసుకుని ప్రకటన విడుదల చేశారు. నాడు టెలిఫోన్, టెలిగ్రామ్ సౌకర్యం ఉంది. అనుమానం ఉంటే ఆమెను విచారించి మాకు సమాచారం ఇవ్వాల్సింది.
నాన్న మంచాన పడ్డారు..
చిన్నకూతురు కావడం, ఎంతో కలుపుగోలుగా హుషారుగా ఉండే సరళ అంటే నాన్నకు ఎంతో అభిమానం ఉండేది. ఆమె కోసం ఊళ్లో భూములు, వ్యవసాయం వదిలేసి కుటుంబసమేతంగా ఖమ్మం వచ్చాం. ఇక్కడే డెయిరీ పామ్ నిర్వహిస్తూ నాన్న కుటుంబాన్ని పోషించేవారు. చెల్లి ఇల్లు వదిలి వెళ్లడంతో నాన్న మంచాన పడ్డారు. 2009లో ఆయన కాలం చేశారు. అమ్మ వరంగల్‌లో తమ్ముళ్ల దగ్గర ఉంటోంది. చిన్నతమ్ముడి భార్య ప్రశాంతి డాక్టర్ కాగా, తమ్ముడు ఓ డిజిటల్ మీడియా సంస్థకు ఎండీగా ఉన్నారు. ఇటు హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.
పెళ్లి ఆలోచనే లేదు...
సినిమాలో పెళ్లంటే ఇష్టంలేక వెళ్లిందని చూపించారట. అది తప్పు. నా పెళ్లి 1991 అక్టోబర్ 21న అయింది. 1992 ఫిబ్రవరి 18న చెల్లి ఇంటి నుంచి వెళ్లింది. నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేయరు కదా..! అలాగే సినిమాలో చెల్లి ఒక్కతే కూతురు అని కూడా చూపించారట. కానీ మేము నలుగురం. సినిమాటిక్‌గా ఉండాలని ఇలా కొన్ని కల్పితాలు చొప్పించినా మొత్తమ్మీద చెల్లి జీవితాన్ని 'విరాటపర్వం' రూపంలో తెరకెక్కించిన ఊడుగుల లక్ష్మణ్‌కు రుణపడి ఉంటాం.
అచ్చు సరళలాగానే ఉంది
సాయిపల్లవి ఇటీవల వరంగల్‌లో తమ్ముడి ఇంటికి వచ్చింది. తనను చూస్తే అచ్చు మా సరళను చూసినట్టే ఉంది. సినిమాలో సాయిపల్లవి పాత్రకు 'వెన్నెల' అని పేరుపెట్టారట. అలాగే మా చెల్లి జీవితం అడవి మింగిన వెన్నెల'లా అర్థాంతరంగా ముగియడం బాధగా ఉంది. బాధ్యతాయుతంగా చదవండి... కుటుంబానికి అండగా నిలవండి... సంఘంతో కలిసి నడవండి... సమాజ సేవ చేయండి. జనంలో ఉండి జనం కోసం పోరాడండి ఇదీ మా చెల్లి జీవితం నుంచి నేటి తరానికి మేము ఇచ్చే సందేశం.
సినిమాలో సాయిపల్లవి పాత్రకు 'వెన్నెల' అని పేరుపెట్టారట. అలాగే మా చెల్లి జీవితం అడవి మింగిన వెన్నెల'లా అర్థాంతరంగా ముగియడం బాధగా ఉంది. బాధ్యతాయుతంగా చదవండి... కుటుంబానికి అండగా నిలవండి... సంఘంతో కలిసి నడవండి... సమాజ సేవ చేయండి. జనంలో ఉండి జనం కోసం పోరాడండి ఇదీ మా చెల్లి జీవితం నుంచి నేటి తరానికి మేము ఇచ్చే సందేశం.
- కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం