Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా విషయాలు మర్చిపోతున్నారా? అయ్యో మతిమరపు వచ్చేసిందని దిగులు పడుతున్నారా? మర్చిపోవడం అనేది కొన్ని సార్లు సర్వసాధారణమే. అయితే ఆ సమస్య ముదరకుండా చూసుకోవాలి. దానికోసం ఈ చిన్న చిన్న సూత్రాలు పాటించండి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
పత్రికల్లో ఇచ్చే పజిల్స్ నింపడం చాలామంది వృథా ప్రయాస అనుకుంటారు. నిజానికవి మెదడుకు మేత. జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తాయి. గజిబిజి లెక్కల్లాంటివీ చేస్తే ఆలోచనలు పదునెక్కి మతిమరపు రాదు.
మానసిక ఒత్తిడికి మహత్తర ఔషధం వ్యాయామం. రోజూ కనీసం అరగంటయినా చేయండి. ఏరోబిక్ వ్యాయామాలు మెదడును చురుగ్గా ఉంచుతాయని రూఢగాీ తేలింది. వేగంగా నడవటం, పరుగెత్తడం, ఈత, నృత్యం లాంటి వాటిలో ఇష్టమైంది ఏదోటి చేయండి.
పంచదార తగ్గించండి. ఇది మెదడు మీద భారం కలిగిస్తాయని అల్జీమర్స్ మీద జరిపిన అధ్యయనాల్లో తేలింది. డార్క్ చాక్లెట్ మెదడు పనితీరును పెంచుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనంలో తేలింది. ఒత్తిడిగా అనిపించినప్పుడు కాస్త డార్క్ చాక్లెట్ తినండి.
సరకులు నిండుకున్నా, బంధు మిత్రులను పలకరిద్దామనుకుని మర్చిపోవడం లాంటివి జరిగితే మతిమరపు వచ్చిందంటూ బాధపడకండి. అలాంటి విషయాలు కాగితం మీద రాసి కనిపించేలా ఓచోట ఉంచితే సరి. పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోవడం లాంటివి పెద్ద విషయాలుగా పరిగణించొద్దు. సహజమేలెమ్మనుకోండి. లేదంటే ఒత్తిడి మరింత పెరుగుతుంది.