Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె మనల్ని తన పచ్చని పట్టణ టెర్రస్ ఫారమ్ చుట్టూ తీసుకువెళుతుంది. కంపోస్టింగ్ ఎరువుల గురించి మాత్రమే కాదు సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసింది. అంతేనా పర్యావరణం, ఆరోగ్యం, మహిళల శ్రేయస్సు వంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుతుంది. ఆమే వాణీ మూర్తి.
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వార్మ్ రాణిగా ప్రసిద్ధి చెందారు వాణీ మూర్తి. ఆమె బెంగుళూరులోని మల్లేశ్వరంలోని తన టెర్రస్ గార్డెన్ పనిలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఆ తోట బ్రాహ్మి, రోజ్మేరీ, తులసి, కరివేపాకుతో పాటు అన్ని రకాల మొక్కలు, మూలికలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. వంకాయలు, నిమ్మకాయలు, టమోటాలు, బీన్స్ వంటి కూరగాయలతో పాటు పండ్ల చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఆకుకూరలతో పాటు కంపోస్టింగ్ ఎరువులు, కుండీలు అందంగా పేర్చబడి ఉంటాయి. వాణి నిర్వహించే ఇంత పెద్ద టెర్రస్ గార్డెన్లో కోతులు, ఉడుతలు, కాకులు, ఇతర పక్షులు కూడా కనిపిస్తాయి.
పర్యావరణం పట్ల మక్కువతో
కోతులు మీ గార్డెన్‌కి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవా అని అడిగితే ''నేను వాటిని తరిమేయాలని ఎప్పుడూ చూడను. అవి వచ్చి నా తోట నుండి ఏదైనా తినాలనుకుంటే స్వాగతం. ఎవరైనా ఆ మొక్క నుండి ప్రయోజనం పొందితే చాలు. ఆ కూరగాయలు నేను తింటున్నానా లేదా కోతులు తింటాయా అనే విషయాన్ని పట్టించుకోను అంటూ వాణి చమత్కరించారు. పర్యావరణం పట్ల ఆమెకున్న మక్కువ ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. రీల్స్ ద్వారా కంపోస్టింగ్ గురించి, వంటగది నుండి ఉత్పన్నమయ్యే ప్రతి తడి వ్యర్థాలను ఆమె ఎలా ఉపయోగిస్తుందో తెలుస్తుంది.
రెండు లక్షల మంది ఫాలోవర్లు
వానపాములను ఆమె తన ''పెంపుడు జంతువులు'' అని అంటుంది. వర్మికంపోస్ట్ డబ్బాలతో గడపడం ఆమెకు ఎంతో ఆనందం. చిరునవ్వులు చిందించే మోమో, తనపై తనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసే మాటలు ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్లతో ఇంటర్నెట్ సంచలనంగా మార్చాయి. ''నాకు ఎప్పుడూ ఇంట్లో ఉండటమంటే ఇష్టం. మొదటి నుండి ఉమ్మడి కుటుంబంలో ఉన్నందున వేరే ఉద్యోగాలు చేసేందుకు సమయం లేకుండా పోయింది'' అని ఇటీవల 61వ పుట్టిన రోజును జరుపున్న వాణి చెప్పారు.
మార్పు కోసం కృషి చేసే వారితో...
ఆమె తన 40 ఏండ్ల మధ్యకాలంలో స్థానిక పౌర సంస్థలో స్వచ్ఛంద సేవకు వెళ్లారు. అది మరొకదానికి దారితీసింది. ''నేను మార్పు కోసం కృషి చేసే చాలా మంది స్త్రీలను కలిశాను. నేను కూడా మెల్లగా అటువైపుకు వెళ్ళాను. అక్కడ మరింత నేర్చుకోవాలనుకున్నాను. నేను ఎక్కడ సరిపోతానో అర్థం చేసుకోవాలనుకున్నాను'' అని వాణి చెప్పారు. బెంగళూరులోని ప్రముఖ గైనకాలజిస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మీనాక్షి భరత్ ప్రభావం తనపై ఎంతో ఉందని ఆమె అంటున్నారు.
సోషల్ మీడియా నిపుణురాలు
''చివరికి పర్యావరణం కోసం పని చేయాలనే నిర్ణయానికి వచ్చాను. వ్యర్థ పదార్థాల నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న ఇతర వ్యక్తులు నాతో కలిసి వచ్చారు. మేమంతా కలిసి ఒక బృందాన్ని ఏర్పడ్డాము. అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోలేదు'' ఆమె చెప్పారు. ఒక దాని గురించి బాగా తెలుసుకోవాలంటే విద్య లేదా అర్హత ఉండాలనే ఆలోచన నిజం కాదని ఆమె జతచేస్తున్నారు. వాణి ఒక సోషల్ మీడియా నిపుణురాలు. వివిధ రకాల మీడియాలతో ప్రయోగాలు చేస్తున్నారు. లాక్డౌన్ల సమయంలో ఆమె తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు. ''మహమ్మారి ప్రారంభంలో నాకు కేవలం 2000 మంది అనుచరులు మాత్రమే ఉన్నారు. కొన్ని పోస్ట్‌లు పెట్టిన తర్వాత అది ఇప్పుడే పెరిగింది. నా మేనకోడలు బ్లూ టిక్ గురించి నాకు అవగాహన కల్పించింది'' అంటూ ఆమె నవ్వుతుంది.
మనకంటూ సొంత బలాలు ఉంటాయి
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వాణి తన పాత్రను ఆస్వాదిస్తుంది. ''నా పిల్లలు పెరిగారు, ప్రస్తుతం నాకు బాధ్యతలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను నాకు ఇష్టమైన విషయాల కోసం నా సమయాన్ని వెచ్చించగలుగుతున్నాను. ఇది సోషల్ మీడియా ప్రపంచం. నేను గ్రహించిన ఒక విషయం ఏమిటంటే.. మనలో ప్రతి ఒక్కరికి మన సొంత బలాలు ఉన్నాయి. కానీ వాటిని మనం గుర్తించలేము. నేను కూడా మొన్నటి వరకు నేను వేరే పనులకు సరిపోను అని అనుకున్నాను. కానీ నేను ఎవరో అంగీకరించేందుకు సమయం వచ్చింది. అప్పటి నుండి ఇది మరింత సులభం అయింది. ఒకటే సారి ఇతర పనుల్లోకి రావడం కాస్త కష్టమే. అయినప్పటికీ ఇది క్రమంగా జరిగే ప్రక్రియ. నేను దానిని అధిగమించాను. ఎందుకంటే నేను నివసించే స్థలంలోనే నేను చాలా ఎక్కువ చేయవలసి ఉంది. నేను మరెవరిలానో ఉండాల్సిన అవసరం లేదు'' ఆమె వివరిస్తుంది.
ఒత్తిడి ఒక కిల్లర్
చాలా కాలం పాటు ఇంటి యజమానిగా సంతోషంగా ఉండే మహిళ వాణి. ఇంత వరకు రావడానికి చాలా సంవత్సరాలు నేర్చుకుంది. ఇల్లు, కుటుంబం, మన ఇష్టాల మధ్య నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలని ఆమె మహిళలకు సలహా ఇస్తుంది. ''హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి ఒత్తిడి సంబంధిత సమస్యలతో మనం ఎంతో నష్టపోతున్నాము. ఒత్తిడి ఒక కిల్లర్. నేను స్త్రీలను తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమను తాము కేంద్రీకరించుకోమని చెబుతాను'' అంటున్నారు.
బాగా తినండి హాయిగా నిద్రపోండి
''హడావుడి మధ్య కూడా ప్రశాంతంగా ఉండగలిగే సామర్థ్యాన్ని నాకు ఇచ్చింది ప్రకృతి. నేను నా శరీరానికి మంచి ఆహారం పెట్టాలని ఎంచుకుంటాను. సహజ ప్రపంచంతో కలిసి బతకాలని నిర్ణయించుకున్నాను. అది నా జీవితానికి ఎంతో సహాయపడింది. బాగా తినండి, హాయిగా నిద్రపోండి. మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి'' అంటున్నారు ఆమె.
ఎవరైనా చేయగలరు
ఒక సంవత్సరం కిందట వాణి తన టెర్రస్‌పై ఆకలితో ఉన్న గొంగళి పురుగు వీడియోను అప్లోడ్ చేశారు. అది విపరీతమైన ప్రజాదరణ పొందింది. దానిని పోస్ట్‌గా సేవ్ చేయమని అభ్యర్థనలతో ఆమెకు వేలాది సందేశాలు వచ్చాయి. ''నా వీడియోలు చూసిన తర్వాత పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. ఏనాడూ ఒక్క మొక్కను కూడా పెంచని నాలాంటి సిటీ అమ్మాయి ఇన్నేండ్ల తర్వాత తనలో దాగి ఉన్న రైతును బయటకు తీసి కూరగాయలు పండించగలుగుతుంది. అంటే ఇలాంటివి ఎవరైనా చేయగలరు. ఇప్పటి పిల్లలకు చిన్న వయసులోనే కూరగాయలను ఎలా పండించాలో చూపించినట్టయితే వారు మట్టిని తాకి, భూమితో అనుబంధాన్ని పెంచుకుంటారు. అది మన పర్యావరణంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది'' అంటూ వాణి తన మాటలు ముగించారు.