Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరవైల్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలైన సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒకపక్క ఉన్నత చదువులు చదువుతూనే మరోపక్క కెరీర్‌ను ఎంచుకోవాలి. ఈ సమయం ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకం. ఎక్కువ తప్పులు చేసేది కూడా ఈ సమయంలోనే. అలాంటి తప్పులు చేయకుండ ఉంటే మంచి భవిష్యత్ మనదే అవుతుంది. అవేంటో తెలుసుకుందామా...
చదువు పూర్తైన తర్వాత చాలామంది కెరీర్‌ను ఎంచుకునే సమయంలో తమ సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. సంతోషం కలిగించే పని చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు మాత్రం ఏ పని బాగా చేయగలుగుతారో ఆలోచించుకోవాలంటున్నారు నిపుణులు.
కొంతమందికి కొంతకాలం తర్వాత చేస్తున్న ఉద్యోగం సంతృప్తినివ్వకపోవచ్చు. ఇలాంటివారిలో చాలామంది ఒక్కసారి కెరీర్ ఎంచుకున్నాక రిటైరయ్యేవరకు అందులోనే కొనసాగాలనే అపోహలో ఉంటారు. దీనివల్ల భవిష్యత్తులో పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చేస్తోన్న ఉద్యోగం నచ్చకపోతే మరో రంగంలోని ఉద్యోగాన్ని ఎంచుకోండి.
కొత్త కెరీర్లో నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టినా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందచ్చు. కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి నిర్ణయాలు చాలామందే తీసుకున్నారు. కాబట్టి కెరీర్‌ని మార్చుకోవడమనేది సర్వసాధారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఇరవైల్లో ఉండే చాలామంది తమ సంపాదనలో అధిక భాగం పార్టీలు, టూర్లు అంటూ ఎంజారు చేయడానికి ఖర్చు పెడుతుంటారు. దాంతో నెల తిరగకుండానే జీతం మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డుని ఉపయోగించడం మొదలు పెడుతుంటారు. ఫలితంగా అత్యవసరం వచ్చినప్పుడు ఇతరులను అడగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇరవైల్లో ఉన్నప్పుడే 50 శాతం జీతాన్ని నిత్యావసరాలకు, 30 శాతం సంపాదనను వ్యక్తిగత అవసరాలకు, కోరికలకు కేటాయించి మిగిలిన 20 శాతం సొమ్మును సేవింగ్స్ చేయమని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా మరొకరిని అడగాల్సిన పరిస్థితి ఎదురవ్వదు.
ఉద్యోగం సంపాదించే సమయంలో చాలామంది విపరీతంగా కష్టపడుతుంటారు. లెక్చరర్ల అభిప్రాయాలు తీసుకోవడం, సీనియర్ల నంబర్లు తీసుకోని వారితో మాట్లాడడం, నైపుణ్యాలు పెంచుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ ఉద్యోగం సంపాదించిన తర్వాత చాలామంది రిలాక్సవుతుంటారు. ఇలా చేయడం వల్ల నష్టాలున్నాయంటున్నారు నిపుణులు.
ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నిత్య విద్యార్థి లాగా ఉండాలి. కొత్త కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అలాగే మీరు ఎంచుకున్న రంగంలోని నిపుణులతో నెట్వర్క్ ఏర్పర్చుకోవాలంటున్నారు. దీనికోసం లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఖాతా తెరచి మీ కెరీర్‌కు సంబంధించిన వివరాలను పొందుపరచాలి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న రంగంలోని నిపుణుల గురించి తెలుసుకుని వారితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కెరీర్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.