Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్వరం వచ్చినా, అనారోగ్యం కలిగినా మంచి చేసేది కొబ్బరి నీళ్ళు. ప్రతి ఆసుపత్రి దగ్గర మందుల దుకాణం ఎంత ముఖ్యమో కొబ్బరి బోండాల దుకాణం కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. కొబ్బరి చెట్లను సంస్కృతంలో 'కల్పతరువు' అంటారు. జీవితానికి అవసరమైన అన్ని వస్తువులను ఇస్తుంది. మలయ్ భాషలో దీన్ని వెయ్యి ఉపయోగాల చెట్టు అంటారు. అలాగే ఫిలిప్పీన్స్‌లో ఈ కొబ్బరి చెట్టును జీవనచెట్టు అంటారు. కొబ్బరి కాయలే కాదు, ఆకులు, మట్టలు, మానులు, చెట్టులోని అన్ని భాగాలు మనిషి జీవితానికి పనికివచ్చేవే. మనం తలకు రాసుకునే కొబ్బరి నూనె, ఇల్లు చిమ్ముకునే చీపుర్లు, పందిళ్ళు వేసుకునే కొబ్బరాకులు ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి. మనమీరోజు వాడేసిన కొబ్బరి చిప్పలతో బొమ్మలు చేసుకుందాం. కొబ్బరి తిన్న తర్వాత పైన ఉండే గట్టి పెంకులాంటి చిప్పలతో ఎన్నో చేయవచ్చు. మా చిన్నతనంలో కొబ్బరి చిప్పలపై పెయింట్ చేసేవాళ్ళం. అలాంటి చిప్పలతో చేసే కొన్ని కళాకృతుల గురించి ఈరోజు తెలుసుకుందాం.
అమ్మాయి బొమ్మ
సముద్రతీర ప్రాంతాలలో కొబ్బరి చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి తీర ప్రాంతాలలో కొబ్బరి చిప్పలతో తయారు చేసిన బొమ్మలు అమ్ముతుంటారు. గట్టి పెంకు కలిగిన చిప్పలు కాబట్టి వీటితో ఎన్ని రకాలైన బొమ్మలైనా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి చిప్పలతో బొమ్మల తయారీ కుటీర పరిశ్రమగా బాగా విలసిల్లుతుంది. ఇప్పుడు మనం ఒక అమ్మాయి బొమ్మ తయారు చేద్దాం. మొదటగా కొబ్బరి చిప్పల మీద ఉండే పీచును తొలగించి పెట్టుకోవాలి. మా చిన్నప్పుడైతే మేము ఈ పీచును పోగొట్టడానికి బ్లేడును, శాండ్‌పేపర్‌ను వాడేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది షేవర్‌ను ఉపయోగిస్తున్నారు. సైజులు తేడాతో మూడు కొబ్బరి చిప్పల్ని తీసుకొని రంగులు వేయాలి. చిన్న చిప్పకు శరీరం రంగు వేసి, మిగతా రెండింటికి రెండు రంగులు వేసుకోవాలి. శరీరం రంగువేసిన చిప్పకు కళ్ళు, ముక్కు, నోరు పెయింట్ చేయాలి. నలుపు రంగు ఊలు తీసుకొని జుట్టు, జడలు లాగా తయారుచేసి అతికించాలి. మనమీ బొమ్మను తల ఊపే బొమ్మలా కూడా చేయవచ్చు. పూర్వం తిరణాలలో తల మీద తడితే తల ఊపే బొమ్మలు అమ్మేవారు. పెద్ద చిప్పలు రెండింటిని ఒక దానిపై ఒకటి పెట్టి అతికించాలి. ఇప్పుడు ఒక అట్ట గొట్టాన్ని దీనిపై పెట్టి అతికించాలి. ఈ గొట్టంపైన జడల్లిన చిప్పను అతికిస్తే తల ఊపే బొమ్మ వస్తుంది. తిరణాలలో అమ్మే బొమ్మలకు స్ప్రింగ్ పెడతారు. మనమలా చేయలేమని దీన్నిలా సులభంగా చేశాను.
వేలాడే బొమ్మలు
ఇది డాన్సింగ్ గర్ల్స్ అన్నమాట. దీనికి ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క కొబ్బరి చిప్ప చాలు. ఒక కొబ్బరి చిప్పను తీసుకొని దాని మీద ఫెవికాల్ రాసి కాగితం ముక్కలు అతికించాలి. న్యూస్ పేపర్చించి చిన్న ముక్కలుగా చేసుకొని అతి కించాలి. దానిమీద ఫెవికాల్ పూసి, ఎండిన తర్వాత రంగు వేసుకోవాలి. ఫాల్ అట్టను తీసుకొని గొట్టంలా మడిచి ఈ చిప్పపై అతికించాలి. ఇప్పుడు ఒక పేపర్ ఉండను తలలాగా అమర్చాలి. తలకు కళ్ళు, ముక్కు, చెవులు పెట్టాలి. జుట్టు కోసం రంగు గానీ, నల్ల ఊలు గానీ అమర్చాలి. కొబ్బరి చిప్పకు ఇందాక రంగు వేశాము కదా! దానికి డిజైన్లు, బార్డర్లు వేయాలి. అప్పుడు పరికిణి అందంగా ఉంటుంది. ఇప్పుడు కాళ్ళు పెట్టాలి కదా! బాల్ పెన్నులోని రీఫిల్‌ను తీసుకొని పేపర్‌ను సన్నగా రోల్ చేయాలి. ఇలా రెండు కాళ్ళవలె తయారుచేసి చివర్లు క్రాస్‌గా కత్తిరించాలి. దీనికి శరీరం రంగు వేయాలి. కాళ్ళకు బూట్లు వేయాలి. ఈ రెండు కాళ్ళను కొబ్బరి చిప్ప లోపల అతికిస్తే చక్కగా అమరుతాయి. దీని లాగే చేతులు కూడా పేపర్ రోల్స్‌తో చేయాలి. వీటిని మెడ కిందుగా అతికించాలి. చేతులు పైకెత్తినట్టుగా అమర్చాలి. అప్పుడే వేలాడ దీయడానికి సరిపోతుంది. ఇప్పుడు మరో పేపర్ రోల్‌ను లావుగా చేసుకొని ఈ బొమ్మల్ని దారం సహాయంతో వేలాడదీయాలి. వేలాడే డాన్సింగ్ అమ్మాయిలు రెడీ అయ్యింది.
కుండీలు
రెండు కొబ్బరి చిప్పలి తీసుకొని మొక్కల కుండీలుగా మారుద్దాం. ఇండోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్‌ను ఇలాంటి చిన్న కుండీల్లో పెట్టుకోవచ్చు. ఈ మధ్య వంటింట్లో సైతం చిన్న చిన్న మొక్కల్ని పెంచుకుంటున్నారు. మనమైతే కనీసం కొత్తిమీర, మెంతి మొక్కలు పెట్టుకోవచ్చు. లేదంటే అల్లం ముక్కనయినా ఈ మట్టిలో పెట్టుకుంటే ఎండి పోకుండా ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ పోతే ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి చిప్పల్ని బ్లేడు, చాకు, షేవర్లు ఉపయోగించే కాకుండా స్టవ్ మీద మంటలో పెట్టి కాల్చినా కూడా కొబ్బరి చిప్ప మీది పీచు పోతుంది. ఒక కొబ్బరి చిప్పకు కళ్ళు, ముక్కు, నోరు పెట్టి తలలా చేసుకోవాలి. దీనిలోనే మట్టి పోసుకొని మొక్కలు మొలకెత్తించేది. దీన్నిలా చేసి పక్కన పెట్టండి మరొక చిప్ప తీసుకొని రెండు చేతులు పెట్టాలి. పేపర్లను పొడుగ్గా చుట్టుకొని చేతులు చేయాలి. చేతులు చిప్పకు అతికించాలి. వీటిలో ఒక చెయ్యి బుగ్గ కానించి, మరో చెయ్యి కిందికి ఉన్నట్టుగా పెట్టాలి. లేదా ఈ రెండింటి మధ్యలో చిన్న బ్రష్ పెడితే బొమ్మ తయారు చేస్తున్నట్టుగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ కాలంలో చిప్పల్లో ముగ్గుపిండి పోసి పెట్టుకునే వాళ్ళు. గవ్వలు, చింతగింజలు పోసి దాచుకునే వాళ్ళు. నేనయితే కొబ్బరి చిప్పను నున్నగా పీచుగీకేసి కొండలు, కొబ్బరి చెట్లు, ఉదయించే సూర్యుడు, నీళ్ళు, మధ్యలో నావను చిత్రించాను. నేను ఏ వస్తువు కనిపించినా కాన్వాసుగా మార్చేస్తాను.
హంస
దీనికోసం కొద్దిగా పేపర్మాష్ కాని గోధుమపిండి కానీ కావాలి. దీనితో హంస మెడను, తలను తయారు చేయాలి. ఒక కొబ్బరి చిప్పకు రంగులు వేసి దానికి పేపర్ మాష్తో తయారైన మెడను అతికించాలి. మెడ మీద తలను, తలకొక ముక్కును అతికించాలి. పొడవైన మెడను సన్నగా చేసుకుంటే బాగుంటుంది. తల మీద ఒక మిరియం గింజను పెడితే కన్ను తయారౌతుంది. ఈ బొమ్మలో కొబ్బరి చిప్పను వెల్లికిలా పెట్టాలి. అప్పుడే ఇది రబ్బర్లు, పిన్నులు వంటివి పెట్టుకునే ఆర్గనైజర్లా కూడా పనికొస్తుంది. టీపారు మీద పెడితే అందంగానూ ఉంటుంది. ఈ హంసకు రెక్కలు పెట్టాలి. షర్టుల లోపల ఉండే అట్టతో రెక్కల వలె కత్తిరించుకొని దానికి రంగులు వేయాలి. అందమైన రెక్కల్ని చిప్పకు రెండు వైపులా అతికిస్తే హంస తయారౌతుంది.
పక్షులు
కొబ్బరి చిప్పతో పక్షిని చేద్దామిప్పుడు. రెండు, మూడు చేసుకుంటే బాగుంటుంది. రెండు మూడు కొబ్బరి చిప్పలకు ఎరుపు, బులుగు, నారింజ వంటి రంగులు వేసి ఉంచుకోవాలి. ఒక పేపర్ మీద పెద్ద గుండ్రాలు గీసి కత్తిరించాలి. ఈ గుండ్రాలను కళ్ళ వలె గీయాలి. ఇప్పుడు పసుపురంగు పేపర్‌ను కత్తిరించి కాళ్ళు తయారు చేసుకోవాలి. తర్వాత రెక్కలు కత్తిరించుకోవాలి. కొబ్బరి పీచుకు రంగులు వేసి తోక లాగా అతికించాలి. ఒక కొబ్బరి చిప్పకు రెండు కళ్ళు అతికించి, కాళ్ళు, రెక్కలు, తోక పెడితే పక్షిని తయారు చేయవచ్చు. రెండు మూడు పక్షుల్ని చేసి గోడకు పెడితే బాగుంటుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్