Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీస్తా సెతల్వాద్... ఒక దృఢమైన స్త్రీవాది. దళితులు, ముస్లింలు, మహిళల హక్కులతో పాటు సామాన్యుల హక్కుల సాధన కోసం తన కలానికి, గళానికి పదునుపెట్టిన ధిక్కార స్వరం. ఆ స్వరం ఇప్పుడు చెరసాలలో బంధింగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకోవడమే ఆమె చేసిన నేరమా..? గుజరాత్ అల్లర్లలో సర్వం కోల్పోయిన బాధితుల పక్షాన నిలవడమే ఆమె చేసిన ఘోరమా..? ఆ అల్లర్ల వెనుక ఉన్న అసలు నిజాలు బహిర్గతం చేయడమే ఆమె చేసిన దేశద్రోహం. ప్రజాస్వామ్యం వర్థిల్లాలని తపించేవారందరూ బయటకు రావాల్సిన సమయం ఇది. అందుకే కొందరు సామాజిక కార్యకర్తలు ముందుకు వచ్చి ఆమెకు అండగా నిలిచారు.
తీస్తా సెతల్వాద్ 1962లో గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ముంబయిలోనే ప్రముఖ న్యాయవాది అయిన అతుల్ సెతల్వాద్. తల్లి సీతా సెతల్వాద్. ఆమె తాత ఎం.సి. సెతల్వాద్ భారతదేశపు మొదటి అటార్నీ జనరల్. జర్నలిస్టుగా ఉండి మైనారిటీ హక్కుల కార్యకర్తగా మారిన జావేద్ ఆనంద్‌ను సెతల్వాద్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, కొడుకు.
జర్నలిజం చేయాలని
తన కుటుంబంలో న్యాయవాద వృత్తి వారసత్వంగా వచ్చినప్పటికీ తండ్రి తనకు ఇచ్చిన ''అల్ ది ప్రెసిడెంట్స్ మెన్'' అనే పుస్తకాన్ని చదివిన తర్వాత జర్నలిజం వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆ కోరికతోనే రెండు సంవత్సరాలు న్యాయశాస్త్రం అభ్యసించినా మధ్యలోనే దాన్ని ఆపేశారు. తర్వాత 1983లో బాంబే విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి జర్నలిస్టుగా పని చేయడం ప్రారంభించారు. జర్నలిజంలోకి వచ్చిన తర్వాత ఆమె ది డైలీ (ఇండియా), ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికల ముంబై ఎడిషన్ల కోసం, తర్వాత బిజినెస్ ఇండియా మ్యాగజైన్ కోసం పని చేశారు. మొదటి నుండి ప్రజాస్వాయ్య హక్కుల గురించి ఆలోచించే ఆమె 1984లో భివాండిలో జరిగిన అల్లర్ల గురించి కవర్ చేయడంతో ఆమెపై మతపరమైన హింసాకాండ మొదలైంది.
ఉద్యోగాలను విడిచిపెట్టి
ప్రముఖ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన సెతల్వాద్ ఒక దశాబ్దం పాటు అదే వృత్తిలో కొనసాగారు. 1993లో ముంబైలోని హిందూ-ముస్లిం అల్లర్లకు ప్రతిస్పందనగా ఆమె, తన భర్తతో కలిసి ఉద్యోగాలను విడిచిపెట్టి కమ్యూనలిజం కంబాట్ అనే మాసపత్రికను ప్రారంభించారు. తమ గొంతును వినిపించడానికి పత్రిక ఒక మంచి అవకాశంగా భావించి దీన్ని ప్రారంభించారు. తర్వాత కాలంలో సెతల్వాద్, జావెద్ ఆనంద్, ఫాదర్ సెడ్రిక్ ప్రకాష్ (ఒక క్యాథలిక్ పూజారి), అనిల్ ధార్కర్ (జర్నలిస్టు), అలిక్ పదమ్సీ, జావేద్ అక్తర్, విజరు టెండూల్కర్, రాహుల్ బోస్ (సినీ ప్రముఖులు) వంటి వారితో కలిసి 2002, ఏప్రియల్ 1న 'సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' (సీజేపీ) అనే ఎన్జీఓని స్థాపించారు.
గుజరాత్ మారణహౌమం
గుజరాత్ రాష్ట్రంలో అల్లర్లు జరిగిన వెంటనే ఆ అల్లర్లలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ భాగస్వామ్యానికి వ్యతిరేకంగా వివిధ కోర్టులలో వ్యాజ్యం చేయడం తీస్తా సంస్థ ప్రారంభించింది. వారి ప్రయత్నాలు ఏప్రిల్ 2004లో కొంత వరకు విజయవంతమయ్యాయి. ఆ సమయంలో అత్యంత ఘోరకలిగా మారిన భారత ''బెస్ట్ బేకరీ కేసు''ని సుప్రీం కోర్టు మహారాష్ట్రకు బదిలీ చేసింది. 2013 నాటికి దాఖలు చేసిన అన్ని కేసులు న్యాయవ్యవస్థ మూడు స్థాయిలలో (ట్రయల్ కోర్టు, రాష్ట్ర హైకోర్టు, భారత సుప్రీంకోర్టు) కొట్టివేయబడ్డాయి. ఒక అప్పీల్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. అదే గుజరాత్ ప్రభుత్వంలో మాజీ మంత్రి మాయా కొద్నానీకి హైకోర్టు విధించిన శిక్షపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసిన విషయం.
బాధితులకు మద్ధతు ఇచ్చినందుకే
గుజరాత్ అల్లర్ల వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు తీసుకురావడంలో, బాధితులకు అండగా నిలవడంలో తీస్తా ప్రముఖ పాత్ర పోషించారు. ఆనాడు గోద్రా ఘటనలో సజీవదహనమైన 68 మందిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జఫ్రీ కూడా ఒకరు. ఆ ఘటనపై సరైన విచార జరపాలని, దోషులను శిక్షించాలని ఆయన భార్య జకియా జఫ్రీ చేస్తున్న పోరాటానికి తీస్తా మద్దతుగా నిలబడ్డారు. ప్రజాస్వామ్యం కోసం, శాంతి కోసం, మహిళల కోసం, సామాన్యుల కోసం ఇంతగా కృషి చేస్తున్న ఆమెను 2022, జూన్ 25న గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. జూలై 1 వరకు పోలీసు కస్టడీకి పంపించారు. ముంబైలోని జుహులోని ఆమె నివాసం నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. ఆమె అరెస్టుకు నిరసనగా కొందరు గొంతు విప్పారు. ఐక్యరాజ్యసమితి సైతం దీన్ని వ్యతిరేకించింది. సెతల్వాద్ అరెస్టు మానవ హక్కుల కార్యకర్తలపై ప్రత్యక్ష ప్రతీకారం అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పేర్కొంది. జకియా జాఫ్రీ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో సెతల్వాద్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొనడాన్ని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరులో సామాజిక కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.
- సలీమ
ప్రజాస్వామ్యం భూస్థాపితమయింది
తీస్తా అరెస్టు చట్టబద్ధ పరిపాలనకు పూర్తిగా తిలోదకాలు వదలడం. సామాన్యమైన మనిషి కావొచ్చు, సామాజిక కార్యకర్త కావొచ్చు. తనకు న్యాయం కావాలని అడగొచ్చు, న్యాయం జరిగేంత వరకు నిలబడే హక్కు ఉంటుంది. ఇది ప్రాధమిక రాజ్యాంగ హక్కు. వీరు బాధితులకు అండగా నిలబడడం, వారి తరఫున పోరాటం చేశారు. ఇలాంటి వాళ్ళపై క్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తే ఏమవుతుంది. ప్రజాస్వామ్యం ఇలా జైల్లో ఉంటుంది. ఇప్పటికే ప్రజాస్వామ్యం చెరలో ఉంది. ఈ సంఘటనతో స్పష్టమయింది. అన్యాయం మేము పూర్తి స్థాయిలో చేస్తాము అని ప్రభుత్వాలు నిరూపించుకోవడమే ఈ సంఘటన. ప్రజాస్వామ్యం ఈ దేశంలో పూర్తిగా భూస్థాపితం అయ్యింది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, చట్టబద్ధపరిపాలన పైన ఏ మాత్రం ఆశలు ఉన్నా తీస్తాను, శ్రీకుమార్‌ను వెంటనే విడుదల చేయాలి. వారిపైన ఏమైనా ఆరోపణలు ఉంటే విచారణ చేయండి, సాక్షాలు ఉంటే అరెస్టు చేయండి. వీరి అరెస్టును ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించి తీరాలి.
- దేవి, సామాజిక కార్యకర్త
నిరంకుశ వైఖరిని నిలదీసినందుకే
2002లో గుజరాత్లో జరిగిన దుర్మార్గమైన మత మారణకాండ (జెనోసైడ్)కు ప్రత్యక్ష సాక్షిగా వున్న జకీయా జాఫ్రీకి న్యాయవాదిగా వ్యవహరించిన తీస్తా సెతల్వాద్‌పై, అప్పటి మారణకాండలో ప్రభుత్వ ప్రత్యక్ష పాత్రపై సాక్ష్యం ఇచ్చిన పోలీసు ఉన్నతాధికారులపై ఇరవై సంవత్సరాల తర్వాత నిర్బంధాన్ని ప్రయోగించటం, తమకు అనుకూలంగా కోర్టు తీర్పులను రప్పించుకోవటం అనే అంశాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటుందో తెలియజెప్పే తాజా ఉదంతాలుగా మన ముందుకువచ్చాయి. ఎప్పటికీ చెరిగిపోని మాయనిమచ్చ 2002 గుజరాత్ మారణ కాండ. దానిని ఏం చేసైనా సరే కప్పిపెట్టాలనే ప్రయత్నమే ఇప్పుడు తీస్తా సెతల్వాద్ తదితరుల మీద కేసులు పెట్టడం. ప్రజల హక్కులను కాలరాసే ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిలదీసే హక్కుల కార్యకర్తలను, రాజ్యాంగ బద్ధంగా బాధితుల తరఫు పోరాడే న్యాయవాదులను, అణగారిన సమూహాలకు అండగా పనిచేస్తున్న స్వచ్చంద, సామాజిక ఉద్యమ కార్యకర్తల మీద ప్రభుత్వాలు రోజురోజుకూ నిర్బంధాన్ని తీవ్ర తరం చేయటం మన కళ్లముందున్న వాస్తవం. రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం నిలబడటం, రాజ్యాంగ వ్యవస్థల జవాబుదారీతనాన్ని ప్రశ్నించటం ఈ ప్రభుత్వ దృష్టిలో తీవ్రమైన నేరంగా మారుతోంది. అందుకే ఒక పక్క సామాజిక మాధ్యమాలలో బాధితులకు అండగా నిలబడుతున్న హక్కుల కార్యకర్తల మీద జుగుప్సాకరమైన ధోరణిలో బెదిరింపులకు పాల్పడుతూ ఇంకో వైపు వారిపై ప్రత్యక్ష నిర్బంధానికి పాల్పడటం రోజు రోజుకీ పెరుగుతోంది. దీనిని నిర్ద్వంద్వంగా మనందరం ఖండించాల్సిన అవసరం మరింతగా పెరిగింది.
- సజయ, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే
గుజరాత్ మారణహౌమం అత్యంత దారుణమయింది. అందులో మూడువేల మంది ముస్లింలో ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధితులకు అప్పటి నుండి తీస్తా అండగా నిలిచారు. ఎన్ని దాడులు జరిగినా వారి తరఫున పోరాడుతున్నారు. జకియా జఫ్రీ పోరాటానికి అండగా నిలిచారు. పోలీస్ ఐపీఎస్ అధికారి సంజరు భట్‌ను అరెస్టు చేశారు. తీస్తా అయితే ఓ ఓఎన్జీఓని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. కేవలం గుజరాత్ ఊచకోతకు గురైన బాధితులకు అండగా నిలిచినందుకే ఆమెపై కక్ష కట్టారు. కేసు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీం ఆ ఘోరానికి కారణం ఎవరో కూడా విచారణ చేయించాలి. నిజాయితీగా పని చేసినందుకు పోలీసు అధికార్లును కూడా అరెస్టు చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా స్పందించాల్సిన సమయం ఇది. అలాగే ఇది కేవలం ఒక్క తీస్తా సెతల్వాద్ విషయం మాత్రమే కాదు భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంగా చూడాలి. సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన వెంటనే జకియా జఫ్రీ ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో తీస్తా కూడా పాల్గొన్నారు. దీనిపై కాస్త వర్క్ చేస్తున్నారని గమనించి ఎప్పటి నుండో పెట్టుకున్న కక్షను ఇలా తీర్చుకున్నారు. ఇన్నేండ్ల నుండి మౌనంగా ఉన్న అమిత్ షా తీస్తా గురించి కామెంట్ చేయడం, ఆయన అన్న కొన్ని గంటలకే ఆమెను అరెస్టు చేయడం ఇదంతా కావాలని జరిగిందే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కోసమే.
- సంధ్య, పీఓడ్ల్యూ
కక్ష సాధింపుతోనే...
ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, రిటైర్డ్ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌లపై అహ్మదాబాద్‌లో అక్రమంగా కేసే నమోదు చేసి అరెస్టు చేయటం అన్యాయం. ''పరిపాలనలోని ఓ విభాగానికి చెందిన కొందరు అధికారుల వైఫల్యం... అధికారుల ముందస్తు నేరపూరిత కుట్రగానో, మైనార్టీలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత నేరంగానో పేర్కొనడానికి ఆధారం కాదు'' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించటం విచారకరం. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లలో చనిపోయిన మాజీ ఎంపీ ఎహ్సాన్ జఫ్రీ భార్య జకియా జఫ్రీ ద్వారా కోర్టులో పిటిషన్లు వేసి, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధిపతి, ఇతర కమిషన్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చయడం శోచనీయం. హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టుకు, ఆమెను పోలీసు కస్టడీకి ఇవ్వడాన్ని ఐరాస మానవ హక్కుల విభాగం కూడా తప్పు పట్టింది. హక్కుల్ని కాపాడుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం నేరమేమీ కాదని తీవ్రంగా స్పందించింది. దేశంలోనూ పలు రాష్ట్రాల్లో మానవ హక్కుల సంస్థలు, ప్రజాసంఘాలు తీస్తా అరెస్టును తప్పు బడుతున్నాయి. ప్రధాని మోడీపై న్యాయపోరాటం చేసినంత మాత్రాన ఆమెపై కక్ష సాధించడం అక్రమం. గుజరాత్ అల్లర్ల కేసకులో తీస్తాకు చెందిన స్వచ్ఛంద సంస్థ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఆరోపించిన గంటల వ్యవధిలోనే గుజరాత్ ఏటిఎస్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం అక్రమం.
- ఇందిర, ఐద్వా