Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చినుకులు పడుతుంటే ఆ ముసురుకి కాస్త చిరాకు, బద్ధకం ఆవరిస్తుంటాయి. అలాగని అప్పటిదాకా జాగ్రత్తగా పెంచుకున్న మొక్కల్ని వదిలేస్తే ఇక అంతే సంగతులు. కాబట్టి వాటి గురించీ ఆలోచించండి.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నా ఎండ కూడా తగులుతోంది. కాబట్టి ఫర్లేదు. కానీ నిరంతరం వానలు పడుతూ, మబ్బు పట్టినట్టుగా ఉండి, అప్పుడప్పుడే ఎండగా ఉంటోంటే మాత్రం మొక్కలన్నింటికీ అది తగులుతోందో లేదో చెక్ చేసుకోండి. ఈ కాలంలో వారానికోసారైనా మొక్కలు ఎండలో ఉండాలి.
మొక్కలపై వర్షం, వర్షపునీరు నేరుగా పడకుండా చూసుకోండి. లేదంటే కుండీల్లో మట్టి సాంద్రత కోల్పోతుంది. సేంద్రియ ఎరువుల్ని కుండీలో తరచూ వేస్తుండండి. కుండీ అడుగున రంధ్రాలు సరిగా పని చేస్తున్నాయో లేదో సరి చూడండి. లేదంటే నీరు నిల్వ ఉండి, మొక్క వేర్లు కుళ్లిపోయే ప్రమాదముంది.
మొక్కల చుట్టూ పెరిగే గడ్డి, కలుపు, రాలిపడిన ఆకుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఆకులపై మచ్చలు, ఏవైనా వ్యాధి సోకిన గుర్తులు కనిపిస్తే వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి.
మబ్బు పట్టినట్టుగా ఉన్నప్పుడూ రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజులకోసారి పోస్తే సరిపోతుంది. అనుమానంగా ఉంటే కుండీ మట్టిలో వేలు పెట్టి చూడండి మరీ పొడిగా ఉన్నప్పుడు పోస్తే సరిపోతుంది.
మొక్కలకు ఫెర్టిలైజర్లు అవసరమనిపిస్తే ఉదయం ఏడు నుంచి 11 గంటల్లోపు మాత్రమే వేయండి. ఆ సమయం దాటితే వేయొద్దు.