Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో జొన్నలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పూర్వ కాలంలో జొన్నలను ఎక్కువగా ఉపయోగించేవారు. జొన్న సంకటి, జొన్న రొట్టెలు లాంటివి చేసుకుని తినేవారు. అందుకే అప్పట్లో ఎక్కువమంది వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుత కాలంలో సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. కరోనా తర్వాత మళ్ళీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెరిగింది. దాంతో చాలామంది తృణధాన్యాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జొన్నల్లో అనేక రకములైన పోషకాలు దాగి ఉన్నాయి. అయితే జొన్నలతో మనం పెద్దగా వంటకాలు చేసుకోము. వాటితో ఏం చేసుకుంటాములే అని పక్కన పెట్టేస్తాము. ఎన్నో పోషకాలు దాగి ఉన్న జొన్నలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టడే ఆ వంటకాల గురించి తెలుసుకుందాం.
జొన్నల కార బూందీ
కావలసిన పదార్ధాలు: జొన్న పిండి - కప్పు, జీడిపప్పులు - పది గ్రా, గోధుమ పిండి/సెనగ పిండి - కప్పుకి కొద్దిగా తక్కువ, కారం - టీ స్పూను, నూనె - తగినంత, నీళ్లు - తగినన్ని, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి లేదా సెనగ పిండి వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు, కారం, నీళ్లు జత చేసి జారు పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద వెడల్పాటి బాండీలో నూనె పోసి వేడిచేయాలి. తయారుచేసి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూయాలి. దోరగా వేగిన బూందీని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నూనెలో వేయించిన జీడిపప్పు, కరివేపాకు జత చేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారాక సర్వింగ్ చేసుకోని తినాలి. ఇదేవిధంగా సజ్జలు, రాగులతో కూడా చేసుకోవచ్చు.
జొన్న బూందీ లడ్డు
కావలసిన పదార్ధాలు: గోధుమపిండి లేదా సెనగ పిండి - కప్పు, నెయ్యి లేదా నువ్వుల నూనె - వేయించడానికి తగినంత, బెల్లం పొడి - రెండు కప్పులు, జొన్న పిండి - ఒకటిన్నర కప్పు, ఏలకుల పొడి - టీ స్పూను, జీడి పప్పులు - తగినన్ని, కిస్మిస్ - తగినన్ని.
తయారుచేసే విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి లేదా సెనగ పిండి, జొన్న పిండి వేసి బాగా కలపాలి. కొద్డిగా నీళ్లు జత చేసి, బూందీ పిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగనివ్వాలి. కలిపి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూసి, దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేరొక పెద్ద పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి. తయారుచేసి ఉంచుకున్న బూందీని బెల్లం పాకంలో వేసి కలియబెట్టాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు జత చేసి లడ్డులా ఉండకట్టాలి. కొద్దిగా చల్లారిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. అంతే మనకి కావలసిన జొన్న బూందీ లడ్డూ రెడీ.
జొన్న బాక్రావాడి మసాలా
కావలసిన పదార్ధాలు: జొన్న పిండి - 50 గ్రా, గోధుమ పిండి - రెండు టేబుల్ స్పూన్లు, సెనగ పిండి - 50 గ్రా, మిరియాల పొడి - టీ స్పూను, సోంపు పొడి - టీ స్పూను, నువ్వుల పొడి - రెండు టేబుల్ స్పూన్లు (వేయించినవి), ఉప్పు - తగినంత, నీళ్లు - తగినన్ని, బాదం పప్పుల పొడి, టేబుల్ స్పూను, జీడిపప్పుల పొడి - టేబుల్ స్పూను, జీలకర్ర పొడి - టీ స్పూను, కారం - టీ స్పూను, ధనియాల పొడి - టీస్పూను, చాట్ మసాలా - టీ స్పూను, నూనె - టేబుల్ స్పూను, గసగసాల పొడి - టీ స్పూను.
తయారుచేసే విధానం: ముందుగా జొన్న పిండి, గోధుమ పిండి, సెనగ పిండి ఒకటిగా కలిపి జల్లెడపట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల కాచిన నూనె వేసి పిండిని బాగా కలపాలి. తగినన్ని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలిపి ఉండలు చేసుకోవాలి. ఒక పాత్రలో అన్ని పొడులను వేసి బాగా కలియబెట్టాలి. ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా ఒత్తాలి. తయారుచేసి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ మీద వేసి, చపాతీని రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొడి అన్ని పొరలకు అంటుతుంది. రోల్ చేసిన వాటిని చాకు సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న వాటిని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
జొన్న చుడువా
కావలసిన పదార్ధాలు: జొన్న అటుకులు - కప్పు, జీలకర్ర - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, నూనె - మూడు టీ స్పూన్లు, పచ్చి సెనగ పప్పు - టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, పల్లీలు - టేబుల్ స్పూను, ఎండు మిర్చి - మూడు, కొత్తిమీర తరుగు - టీ స్పూను, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక జొన్న అటుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక పచ్చి పల్లీలు వేసి వేయించాలి. మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించాలి. పసుపు వేసి మరోమారు కలియబెట్టి, దింపేసి, జొన్న అటుకుల మీద వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
జొన్నల్లో పోషకాలు
జొన్నల్లో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థం, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్ బి1, బి2, బి3, బి5 వంటి విటమిన్లు క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉండటంతో జొన్నలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని చెడు కొవ్వుని నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జొన్నల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ జొన్నలని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జొన్నలు త్వరగా ఆకలి కాకుండా చూస్తాయి.
జొన్నల్లో నియాసిన్ అనే బి6 విటమిన్ ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అయ్యి శక్తిలాగా మారడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల శరీరంలోని క్యాలరీలు పేరుకుపోకుండా ఉంటాయి. తద్వారా శరీర బరువు తగ్గుతుంది.
జొన్నలు బాలింతలకు చాలా మంచివి. వీటిల్లో ఉండే ప్రోటీన్సు పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడతాయి.
క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను దూరం చేసేందుకు జొన్నలు ఎంతగానో సహకరిస్తుంది. అందుకే సరైన ఆరోగ్యానికి జొన్నలు చాలా అవసరం.
జొన్నలు శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రోటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్త వృద్ధికి తోడ్పడే ఇనుము, ఫోలిక్ ఆమ్లాన్ని శరీరానికి అందిస్తుంది. అయితే ఇతర ధాన్యాల కన్నా జొన్నల్లో ఇనుము, జింక్ ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.