Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిట్టాలి సేథీ... గతంలో ఆర్థోడాంటిస్ట్. ప్రస్తుతం ఓ ఐఏఎస్ అధికారిగా మహారాష్ట్రలో పిల్లల అభివృద్ధి, విద్య కోసం కృషి చేస్తున్నారు. సీఇఓగా జిల్లా పరిషత్, చంద్రాపూర్ ప్రాంతాలలో విద్య, పారిశుధ్యంపై దృష్టి సారిస్తున్నారు. తన సేవా కార్యక్రమాల్లో భాగంగా మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతమైన మెల్ఘాట్లోని పిల్లల పోషకాహార సమస్య పరిష్కరించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పరిషత్ కార్యాలయం బయట ఉండే బోర్డుపై సీఇఓ అయిన మిట్టాలి సేథి ఫోన్ నంబర్ రాసి ఉంటుంది. అలా ఓ అధికారి ఫన్ నెంబర్ బహిరంగంగా రాసిపెడితే వచ్చే ఫోన్ కాల్స్‌తో ఇబ్బంది కాదా అనే అనుమానం కొంత మందికి వస్తుంది. అయితే 2017 బ్యాచ్ (మహారాష్ట్ర క్యాడర్)కు చెందిన ఐఏఎస్ అధికారి మిట్టాలి మాత్రం తనకు ఇప్పటి వరకు వచ్చిన ఫోన్ కాల్స్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. మిట్టాలి జూలై 1కి చంద్రపూర్‌లో బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అవుతుంది. గతంలో ఆమె మహారాష్ట్రలోని గిరిజనులు అధికంగా ఉండే మెల్ఘాట్లో సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చూశారు. ఆమె తన రెండు పోస్టింగ్‌లలో పిల్లల పోషణ, గిరిజనుల అభివృద్ధి, విద్యకు సంబంధించిన కార్యక్రమాలలో భాగమయ్యారు.
సివిల్ సర్వీస్ ఆలోచనే లేదు
జలంధర్‌లో పుట్టి పెరిగిన మిట్టాలి అమృత్సర్, చెన్నైలలో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్, మాస్టర్స్ పూర్తి చేశారు. పుదుచ్చేరిలో రెండేండ్లపాటు ఆర్థోడాంటిస్ట్‌గా పనిచేశారు. సివిల్ సర్వీసెస్ అనేది తన మనసులో పెద్దగా లేని ఆలోచన అని దాని పూర్తి రూపం కూడా తనకు తెలియదని అంటున్నారు. మిట్టాలి ఆర్థోడాంటిస్ట్‌గా తన ఉద్యోగాన్ని ఇష్టపడ్డారు. కానీ కాలక్రమేణా తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభించారు. ''పేషెంట్లను చూస్తున్న సమయంలో మధ్యలో నేను కూర్చున్న గది నుండి బయటికి రావాలనిపించేంది. ఇంతే కాకుండా ఇంకా నేను ఏమి చేయగలనని ఆలోచించేదాన్ని'' ఆమె చెబుతున్నారు. ''అయితే మొదట దీన్ని ఇష్టపడినప్పటికీ దంతవైద్యంలో ఆర్థోడాంటిక్స్గా నేను సౌకర్యవంతంగా లేను. ఇదంతా ధనవంతులకు మాత్రమే చేసే చికిత్స. అందుకే నాకంత తృప్తి ఇవ్వలేదు'' అన్నారు.
జీవితాన్ని మార్చిన ఒక శిబిరం
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఒక యువజన శిబిరానికి హాజరు కావాలని మిట్టాలి తీసుకున్న నిర్ణయం ఆమె ఊహించిన దానికంటే చాలా మార్గాల్లో ఆమె జీవితాన్ని మార్చింది. ఇదే ఆమెను సివిల్ సర్వెంట్ అయ్యేలా కూడా నడిపించింది. భర్త ఆమె నిర్ణయానికి మొదట్లో విముఖత చూపాడు. కానీ చివరికి ఒప్పుకున్నాడు. ''శిబిరంలో భాగంగా మేము గ్రామాలను సందర్శించాము. అక్కడ నేను ఆశ్చర్యపోయాను. ఇది దంత క్షయానికి ఉదాహరణ. ఇది పిల్లలలో సాధారణం. నోటిలో పాల సీసాలు పెట్టుకుని నిద్రపోతారు. నక్సల్స్ రోడ్లను పేల్చివేయడం వల్ల ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యం ఉండేది కాదు. దాంతో వారి పిల్లలకు ఎప్పుడూ పాలు పట్టలేదని వారు నాకు చెప్పారు'' ఆమె చెప్పారు.
వైవిధ్యంగా ఉండాలని
మరొక సందర్భంలో ఆమె నృత్యం ద్వారా విద్యార్థులకు ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడిని కలుసుకున్నారు. మిట్టాలీ నిజంగా తను చేయాలనుకుంటున్నది వైవిధ్యం అని అర్థం చేసుకునేంత పరివర్తన అనుభవాలను అక్కడే కనుగొన్నారు. ''నేను డెంటిస్ట్, నా భర్త రేడియాలజిస్ట్ కాబట్టి గడ్చిరోలికి మారాలని నా మొదటి ఆలోచన. ఈ మధ్య నేను సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఒకరిని కలిసి అడిగాను ఐఏఎస్ అంటే ఏమిటి అని. అతను నాకు అవగాహన కల్పించాడు'' అని ఆమె చెప్పింది. పది సంవత్సరాలలో మొదటిసారిగా మిట్టాలి చదవడానికి ఒక వార్తాపత్రికను తీసుకున్నారు. ప్రిలిమ్స్‌ను క్లియర్ చేయలేకపోయానని, మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యానని ఆమె చెప్పారు. దాంతో ఆమె ఆర్థోడాంటిస్ట్‌గా పని చేయడం కొనసాగించింది. అయితే మూడవ ప్రయత్నంలో ర్యాంక్ 56తో ఉత్తీర్ణత సాధించారు. మొదటి దశ శిక్షణ తర్వాత ఆమె పోస్టింగ్ అమరావతిలో ఉంది. రెండవ దశ తర్వాత సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, ప్రాజెక్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. అమరావతి జిల్లా మేల్‌ఘాట్‌లో సమగ్రాభివృద్ధి ప్రాజెక్టు అధికారి. పిల్లల ఆరోగ్యం, పోషణపై పని చేస్తోంది.
ఆరోగ్యం, పోషకాహారంపై
''మేల్ఘాట్ ఒక ప్రత్యేకమైన ప్రాంతం. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాలను పోలి ఉంటుంది. అయితే ఇది ఇతర గ్రామీణ ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది. ఇది విస్తారమైన పర్వత ప్రాంతాలను, 70 శాతం కోర్కు గిరిజన జనాభాను కలిగి ఉంది. ప్రజలకు మరాఠీ అర్థం కాదు. వారిలో కొందరు హిందీని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇది గతంలో మధ్యప్రదేశ్‌కు అనుబంధంగా ఉన్న విదర్భలో భాగం'' అని ఆమె చెప్పారు. మెజిస్టీరియల్ అధికారిగా, ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా వివిధ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఆమె వద్ద రూ. 100 కోట్ల నిధులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని అతి పెద్ద సమస్యలు ఆరోగ్యం, పోషకాహారం అలాగే అధికంగా ఉండే శిశు, ప్రసూతి మరణాల రేట్లు.
అవగాహన పెంచడానికి
అక్కడ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం చాలా అవసరమని ఆమె గుర్తించారు. మిట్టాలి అక్టోబర్ 2019లో అక్కడ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2020 నాటికి కోవిడ్-19 ప్రస్తుతం ఉన్న ఆరోగ్య వ్యవస్థకు మరింత ఇబ్బందిని కలిగించింది. పూణేలో గిరిజన సంస్కృతిని ఇతివృత్తంగా చిత్రోత్సవం ప్రకటించినప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రదర్శించడానికి, అవగాహన పెంచడానికి రెండు సినిమాలు తీయాలనే ఆలోచన చేశారామె. ''కోర్కు జనాభాను పరిశీలిస్తే లింగ నిష్పత్తి జిల్లాలోనే అత్యధికంగా ఉంది. సంస్కృతి స్త్రీలకు అనుకూలమైనది. దానిని ఎందుకు ప్రదర్శించకూడదని నేను అనుకున్నాను. మేము దానిని ఒక కమ్యూనిటీ ప్రాజెక్ట్‌గా రూపొందించాము. ఇక్కడి తెగ ప్రజలు పాడతారు, నటిస్తారు. డాక్యుమెంటరీలలో ఒకటైన రాణి బేటి ఫెస్టివల్లో మూడవ బహుమతిని గెలుచుకుంది'' అని ఆమె చెప్పారు.
డిజిటల్ వ్యవస్థను రూపొందించారు
ఆరోగ్యం, పోషకాహారంపై పని చేస్తూ వారు ఐఐటీ బాంబేతో కలిసి ఒక ప్రాజెక్ట్‌ను పైలట్ చేసారు. సంఘం, ఎన్జీఓలు, ప్రభుత్వం మధ్య ఒక ట్రయలాగ్ను ప్రారంభించడం ద్వారా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఎన్జీఓల సంఖ్య, వారు పనిచేసే గ్రామాలు, యాక్సెస్‌ను మ్యాప్ చేయడానికి డిజిటల్ వ్యవస్థను రూపొందించారు. ప్రోషకాహార లోపం తారాస్థాయికి చేరిన నెలలను పరిశీలిస్తే అది వర్షాకాలంలో (అతిసారం ఒక కారణం) లేదా శీతాకాలంలో (అల్పోష్ణస్థితి) కాదని తెలిసి వారు ఆశ్చర్యపోయారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఆ సమస్య గరిష్టంగా ఉండేది.
పోషకాహారలోపం వుంది
''డేటాను పరస్పరం అనుసంధానిస్తున్నప్పుడు వలస వచ్చిన జనాభా హోలీ కోసం తిరిగి ఈ ప్రాంతానికి వచ్చారని తెలుసుకున్నాము. ఇటుక బట్టీల సీజన్ జూన్ వరకు ఉన్నందున వారు తిరిగి వెళ్లి, పంట కోసం తిరిగి వచ్చి అక్టోబర్‌లో మళ్లీ వలస వెళ్లారు. జిల్లాలోని 12 బ్లాక్‌ల కంటే నా ఆధ్వర్యంలోని రెండు బ్లాకుల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉందని గుర్తించాను'' అని ఆమె వివరించారు. పిల్లలు డేటా సెట్లలో భాగం కానందున వారికి అవసరమైన ఆరోగ్య సేవలు, వ్యాక్సిన్లను పొందే అవకాశం లేదు. ''ఒక పిల్లవాడు నా సరిహద్దును విడిచిపెట్టినట్లయితే అతను/ఆమె ప్రవేశించిన సరిహద్దు ఎవరికీ సంబంధించినది కాదు. ఈ కారణంగా వారు టీకాలు వేయలేకపోయారు. ఇది పిల్లల ఆరోగ్యంలో ఒక క్లిష్టమైన లోపం'' అంటూ ఆమె జతచేశారు.
వలస జనాభాను ట్రాక్ చేయడానికి
ఈ బృందం మెల్ఘాట్ కోసం వలస ట్రాకింగ్ సిస్టమ్‌పై పని చేయడం ప్రారంభించింది. ఇది వలస జనాభాను ట్రాక్ చేయడానికి తర్వాత ఆరు జిల్లాలు, అంతర్రాష్ట్ర పైలట్లలో కూడా ప్రయోగించబడింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సందేహం మరొక సవాలు. కోర్కులో ఒక సీరియల్‌తో ప్రతి వారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌తో ఈ సమస్యను అధిగమించగలిగారు. చంద్రాపూర్ ఐఏఎస్‌గా మిట్టాలి దృష్టి విద్య, పారిశుధ్యంపై ఉంది. ఆమె పర్యవేక్షిస్తున్న 15 బ్లాకులలో మూడు గిరిజన ప్రాంతాలు, ఒక పట్టణ ప్రాంతం ఉన్నాయి. ''నా పనిలో చాలా వైవిధ్యం ఉంది. మెల్ఘాట్లో ఆరోగ్యం, పోషకాహారంలో నేను నేర్చుకున్నవన్నీ ఇక్కడ అమలు చేయగలుగుతున్నాను. ఇక్కడ నాకు 1,527 గ్రామాలు ఉన్నాయి'' అని ఆమె చెప్పారు.
పిల్లల స్థాయిని అంచనా వేసి
గత సంవత్సరం వారు గరుడ్జెప్ (మరాఠీ ఫర్ మేకింగ్ ఎ లీప్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ 1,560 పాఠశాలల్లోని 62,000 మంది పిల్లలు కోవిడ్ కారణంగా విద్యకు దూరమయ్యారని అంచనా వేశారు. ''45 రోజుల కార్యక్రమం ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా స్థాయి కోసం వర్ణమాల, పేరా లేదా కథలు చదవించడం ద్వారా పిల్లల స్థాయిని అంచనా వేసింది. చాలా మంది పిల్లలు రెడ్ జోన్లోకి జారిపోయారని గుర్తించాము. దీన్ని మార్చడానికి ఒక సర్వే చేయడానికి, దానికి అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ఐఐటి-బాంబేతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాము'' అని ఆమె వివరించారు.
బాలికలు తిరిగి పాఠశాలకు వెళ్లొచ్చు
ఆరు నెలల్లో 150 గ్రామీణ లైబ్రరీలను ప్రారంభించారు. కొత్తగా ఫంక్షనల్ టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న పధై భీ, సఫాయి భీ (విద్య, పరిశుభ్రత చేతులు కలిపి) ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా పిల్లలు ముఖ్యంగా బాలికలు తిరిగి పాఠశాలకు వెళ్లవచ్చు. పాఠశాలలు వారు నివసించే ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలకు సైకిళ్లను బహుమతిగా ఇచ్చే పథకం కూడా ఈ చొరవలో భాగం చేశారు. అలాగే అంగన్వాడీలను బొమ్మలు చేయడానికి టైర్లను ఉపయోగించమని, ఆట స్థలాలను కూడా నిర్మించమని ప్రోత్సహించి వారిలో సృజనాత్మక పెంచారు.
వికేంద్రీకరణతో...
''చాలా విషయాలకు ఎక్కువ డబ్బు అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయితే కొంత సృజనాత్మకత ఉంటే సరిపోతుంది'' అని ఆమె అంటున్నారు. పారిశుధ్యం అంశంలో మిట్టాలి పొడి చెత్తను విలువైన వస్తువులుగా మార్చే పనిలో ఉన్నారు. ఉదాహరణకు తన సొంత కార్యాలయంలో పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలతో చేసిన బెంచ్ ఉంది. ''వికేంద్రీకరణ జిల్లా పరిషత్‌లకు చాలా స్వయంప్రతిపత్తిని కల్పించినప్పటికీ ఇందులో విభిన్న సవాళ్లు కూడా ఉన్నాయి. మేము మైదానంలో చాలా మంది వ్యక్తులతో పని చేస్తుంటాము. అనేక మంది ఫీల్డ్ ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుండి పరోక్ష నియంత్రణ కూడా ఉంటుంది. కానీ మేము వ్యవహరించే స్వయంప్రతిపత్తి, విస్తారమైన ప్రాంతాలు ఇతర యంత్రాల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉంటాయి'' అని మిట్టాలి తన మాటలు ముగించారు.