Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సారా... ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. మంచి సంపాదన. భవిష్యత్‌లో మరింత సంపాదించే అవకాశం కూడా ఉంది. కానీ పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. సెవన్ రేస్ అనే సంస్థను స్థాపించింది. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఒక్క మెసేజ్ చేస్తే చాలు అక్కడకు వాలిపోతుంది. వారి అవసరాలను తెలుసుకుని తనకు సాధ్యమైనంత సాయం చేస్తుంది. ముఖ్యంగా వికలాంగులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలకు చేయూతనిస్తుంది. నిజమైన మహిళా సాధికారత కోసం నిత్యం తపిస్తుంది. ఇలా తన జీవితాన్ని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్న ఆమె పరిచయం మానవి పాఠకుల కోసం...
మా సొంత ఊరు కేరళ రాష్ట్రంలోని నాగర్‌కోయిల్. ఇది తమిళనాడు బోర్డర్లో కన్యాకుమారికి దగ్గరగా ఉంటుంది. మా నాన్న తాండవ మూర్తియ పిళ్లే, గర్నమెంట్ టీచర్‌గా చేసేవారు. అమ్మ అంబిక, హైజ్వైఫ్. నా అసలు పేరు శారథ. ఇక్కడ అందరూ సారా అని పిలుస్తుంటారు. అందరికి ఇదే పేరు తెలుసు. నా అసలు పేరు ఎవ్వరికీ తెలియదు. గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్స్ పిల్లలు అదే పాఠశాలల్లో చదవాలని గతంలో రూల్ ఉండేది. అలా నేను చిన్నప్పుడు గర్నమెంటు స్కూల్లోనే చదువుకున్నాను. చిన్నప్పుడు స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్‌లో పాల్గొనేదాన్ని. నా ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే. బిఎస్సీ మాథ్స్ తర్వాత ఎంసీఏ పూర్తి చేసి ఉద్యోగం రీత్యా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చి 18 ఏండ్లు అవుతుంది. గతంలో టీ హబ్‌లో జాబ్ చేసేదాన్ని.
జాబ్ మానేశాను
మొదటి నుండి పేద పిల్లలకు, మహిళలకు నాకు చేతనైనంత సాయం చేయాలని ఉండేది. అనాథాశ్రమాలకు, ఓల్డ్ ఏజ్ హౌమ్స్కి వెళ్ళేదాన్ని. వాళ్ళకు ఏం అవసరమో కనుక్కొని సాయం చేసేదాన్ని. అయితే నేను ఉండేది ఏ.ఎస్ రావు నగర్. ఉద్యోగరీత్యా చాలా దూరం ట్రావెలింగ్ చేయాల్సి వచ్చేది. దాంతో సేవా కార్యక్రమాలు చేయడానికి టైం సరిపోయేది కాదు. దాంతో జాబ్ మానేసి మొదట్లో కొన్ని ఎన్జీఓలతో కలిసి పని చేశాను. అలా చేస్తున్నప్పుడు కొన్ని సంస్థలు నాకు కరెక్టుగా లేవనిపించింది. అవినీతి బాగా ఉండేది. దాంతో నేనే సొంతంగా ఓ సంస్థ పెట్టి ఎందుకు చేయకూడదు అనుకున్నాను.
అవసరమైన వారికే చేరాలి
ఆ ఆలోచనతోనే 2016లో సెవన్ రేస్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాను. మొదట్లో చాలా చిన్నగానే మొదలుపెట్టాను. తర్వాతర్వాత సాయం చేయమంటూ విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చేవి. ఒక్కోసారి అన్ని ఫోన్స్ కాల్స్ మాట్లాడేందుకు టైం ఉండేది కాదు. దాంతో వాట్సాప్ చేయమనేదాన్ని. రాత్రి పూట ఆ మెసేజ్‌లన్నీ చూసి ఎవరికి ఏం అవసరమో తెలుసుకుని నేనే స్వయంగా వెళ్ళి సాయం చేయడం మొదలుపెట్టాను. మనం ఉపయోగించే ప్రతి రూపాయి అసవరమైన వారికే చేరాలి. వేస్ట్ కాకూడదు అనే దాంతో నేనే స్వయంగా వెళతాను.
ఎడ్యుకేషన్ సెంటర్
పిల్లల భవిష్యత్‌కు విద్య చాలా అసవరం. స్లమ్ ఏరియాల్లో చాలా మంది పాఠశాలలకు వెళ్ళకుండా పనులకు వెళుతున్నారు. పనులకు వెళ్లకుండా వాళ్ళను మనం ఆపలేము. అందుకే వారి కోసం సాయంత్రం పూట ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించాలని అనుకున్నాను. అలా సింగరేణి కాలనీలో సెంటర్ ప్రారంభించాము. అక్కడ వంద మంది పిల్లలు వస్తున్నారు. వాళ్ళకు రోజూ స్నాక్స్, పండగలకు బిర్యాని లాంటివి పెడుతుంటాము. వాటి కోసమైనా వచ్చి పిల్లలు చదువుకుంటారనే ఆలోచనతో ఇలా చేస్తున్నాను. చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా ఉంటాయి. దీనికోసమే ఉద్యోగులను కూడా పెట్టాము.
వికలాంగుల కోసం...
ఇప్పటి వరకు 70 మంది వికలాంగ మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చాము. 40 వీల్ చైర్స్ అందించాము. ఈ మహిళలకు ముగ్గుల పోటీలు కూడా పెట్టాము. నడవలేని ఆమె పడుకొని అందమైన ముగ్గు వేసింది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వీరి కోసం టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ కూడా నడిపించాము. నేర్పించిన ఆమె కూడా వికలాంగురాలే. టైలరింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు నా కోసం ఒక బ్యాగు కుట్టి ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. సాధారణ మహిళల కోసం మెదక్ జిల్లాలోని ఓ తండాలో టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించాము.
ఉపాధి చూపిస్తే...
నిత్యావసర వస్తువులైతే నిత్యం ఇస్తూనే ఉంటాము. అయితే ఇవి పంచేటపుడు నాకు ఒకటి అనిపించింది. మనం ఇలా పంచుతుంటే అవసరాలు ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. అందుకే వాళ్ళకు ఏదైనా ఉపాధి అవకాశం కల్పించి వాళ్ళంతట వాళ్ళే సంపాదించుకునే దారి చూపిస్తే బాగుంటుందని పించింది. ఆ ఉద్దేశంతో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాము. టైలరింగ్ అనే కాదు వాళ్ళు ఏ పని చేయగలిగితే అందులో సహకరిస్తాము. ఎవరైన చిన్న షాప్ పెట్టుకుంటానంటే దానికి కావల్సిన సాయం చేస్తాము. అమ్మానాన్న లేని పిల్లలకు, సింగిల్ పేరెంట్ ఆడపిల్లలకు పెండ్లి సమయంలో స్త్రీ ధనం పేరుతో చీరలు, మెట్టెలు, పుస్తెలు కూడా ఈ మధ్యనే ఇస్తున్నాము.
కరోనా సమయంలో...
కరోనా టైంలో అయితే చాలా కార్యక్రమాలు చేశాము. పేదలకు ఆక్సిజన్ సిలెండర్లు అందజేశాము. 30 వేల రైస్ కిట్లను పంపిణీ చేశాము. ఆ టైంలో చాలా మంది బయటకు రాలేక ఇబ్బంది పడ్డారు. కరోనా వచ్చిన పేదల కుటుంబాలకు ఇంటికే భోజనాలు పంపించాము. అలాగే మెడిసెన్ కిట్లు అందజేశాము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటైజర్ ఎలా వాడాలి వంటి వాటిపై అవగాహన కల్పించాము. వాటితో పాటు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి, భర్త వదిలేసిన ఒంటరి మహిళలకు, మంచానికే పరిమితమైన పిల్లలకు కావల్సిన సహకారం అందిస్తున్నాము.
స్కూల్స్ మానేస్తున్నారు
సోషల్ మీడియా ద్వారా కొంత మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మా ప్రాంతంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నాను. ఆస్కూల్స్లో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాను. వాళ్ళకు ఏం కావాలన్నా మమ్మల్నే కలుస్తారు. చాలా పాఠశాలల్లో వాష్రూంమ్స్, వాటర్ సౌకర్యం ఉండడం లేదు. దాంతో పీడియడ్స్ మొదలైన పిల్లలు ఆ పాఠశాలలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ఈ సమస్యలతోనే స్కూల్ మానేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాంటి పాఠశాలల్లో సాధ్యమైనంత వరకు సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు టెస్ట్ పెడతాము. అందులో ఎంపికైన వారికి పై చదువులు మా సంస్థ ద్వారానే చదివిస్తున్నాము.
ఏ ఫీల్డ్‌లోనైనా పూర్తి సపోర్ట్ ఉండదు
వికలాంగులకు ఇంకా చాలా చేయాలని ఉంది. వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ను బయటకు తీసుకురావాలి. కొంత మంది బ్యూటీషన్ కోర్సు చేయాలని కోరుకుంటున్నారు. అలాంటి వారికి ఏర్పాటు చేయాలి. దాంతో పాటు ఎక్కడ ఎవరికి ఏం అవసరమో తెలుసుకుని సాయం చేయాలి. మహిళలకు సపోర్ట్ అనేది ఏ ఫీల్డ్‌లోనైనా పూర్తిగా ఉండదు. నా విషయానికి వస్తే ఇక తను సేవకే అంకితమయింది అని అర్థం చేసుకున్నారు. మా వారు కూడా నేను చేయలేకపోతున్నాను తను చేస్తుంది కదా చెయ్యని అని అనుకుంటారు. సేవ చేసినందుకు ఎన్నో అవార్డులు అందుకున్నాను. డాక్టరేట్ కూడా వచ్చింది. కానీ సాయం పొందిన వాళ్లు ఒక మంచి స్థాయికి ఎదిగితే అదే నాకు గొప్ప అవార్డుగా అనిపిస్తుంది.
- సలీమ