Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాజులు, పట్టీలు, లోలాకులు, బుట్టలు అంటూ మనం ఎన్నో రకాల ఆభరణాలను పెట్టుకుంటుంటాము. గాజులు అయితే చీరలకు మ్యాచింగ్‌గా రంగుల గాజులు ధరిస్తాం. గాజుల్లో మట్టి గాజులు, ప్లాస్టిక్ గాజులు, మెటల్ గాజులు, లక్క గాజులు అంటూ ఎన్నో రకాల గాజులున్నప్పటికీ మట్టి గాజులకే ప్రధమ స్థానం ఇస్తాం. ఈ మధ్య కాలంలో వీటకి కాస్త ఆదరణ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మన అలంకరణలో మట్టి గాజులే ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే మనమీరోజు గాజులతో ఇంటి అలంకరణ వస్తువులను తయారుచేసుకుందాం. ప్రతి వారి దగ్గరా వాడని గాజులు ఎన్నో ఉంటాయి. వాటితో మనం పనికొచ్చే బొమ్మలను చేసుకోవచ్చు. వాటిలో కొన్ని ప్రయోగాలు ఈరోజు చేద్దాం.
డిజైనర్ గాజులు
పాత మట్టిగాజులతో డిజైనర్ గాజులు రూపొందించవచ్చు. కొత్త డ్రెస్ కోసం డిజైనర్ గాజులు కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆరు మట్టి గాజుల్ని తీసుకొని ఒక దానికి ఒకటి అతికించుకుని వెడల్పుగా చేయాలి. మనకు ఎక్కువ వెడల్పు కావాలంటే ఇంకో రెండు గాజులు ఎక్కువగా అతికించుకోవాలి. ఇప్పుడు వెడల్పైన ఈ గాజు మీద రాళ్ళ చైను అతికించుకోవాలి. అడుగున చదునుగా ఉండే తెల్లటి ముత్యాలు దొరుకుతాయి. చీరలు, జాకెట్లు ఎంబ్రాయిడరీలో వాటిని కుట్టుకుంటారు. అలాంటి ముత్యాలు ఒక వరస చిన్నవి అతికించాలి. దీని పక్కన కొద్దిగా పెద్దసైజు ముత్యాల వరస అతికించాలి. తర్వాత పక్కన కొద్దిగా పెద్దసైజు ముత్యాల వరస అతికించాలి. దీని పక్కన మొదట అతికించిన చిన్న ముత్యాల వరసను అతికించాలి. అంటే మధ్యలో పెద్దసైజు ముత్యాల వరస, దానికి రెండు వైపులా చిన్నసైజు ముత్యాల వరసలు అతికించినట్టు అన్న మాట. ఇప్పుడు మరల దీని పక్కన రాళ్ళ చైను అతికించాలి. ఇప్పుడు మొత్తం గాజుకు ఆ చివరా, ఈ చివరా రాళ్ళ చైను అతికించాం. ఇది కొత్త డిజైన్ గాజులా తయారయింది.
గాజుల చైన్లు
మా చిన్నతనంలో వేసవి సెలవులలో పాత గాజులన్నీ ముందు పోసుకొని మధ్యకు పగలగొట్టేవాళ్ళం. ఒక క్యాండిల్‌ను వెలిగించి దగ్గర పెట్టుకొని గాజు ముక్కను వేడిచేస్తే దగ్గరకు వంగి రింగులా తయారయ్యేది. మళ్ళీ మరో గాజు ముక్కను తీసుకొని ఈ రింగులో దూర్చి దాన్ని కూడా వేడిచేస్తే అది కూడా రింగులా తయారవుతుంది. ఇలా గాజు ముక్కలు ఒక దాంట్లో ఒకటి దూర్చి వేడి చేస్తూ రింగుల చైనులా తయారు చేసే వాళ్ళం. ఇలాంటి గాజుల చైన్లను ద్వారానికి రెండు వైపులా వేలాడ దీసుకునే వాళ్ళం. లేదంటే ఒక చైను మొదట తయారు చేసి దానికి కాళ్ళ పట్టీల జాలరి లాగా మరల చిన్న చిన్న చైన్లు చేసి అతికిస్తే చాలా అందంగా వచ్చేది. దీనిని ద్వారానికి మామిడాకులు కట్టినట్టుగా కట్టేవాళ్ళం. జాలరితో అందంగా ఉంటుంది. ఇలా ద్వారా తోరణాలు చేసుకునే వాళ్ళం. ఇంకా ద్వారానికి వెడల్పు సరిపోయేలా ఇరవై లైన్ల గాజుల చైన్లు తయారు చేయాలి. వెడల్పుగా ఉన్న చైనుకు ఈ ఇరవై లైన్లు వెలాడ దీయాలి. లేలాడదీసే లైనులు సైజుల వారిగా పెడితే అందంగా ఉంటుంది. ఇలా గాజుల కర్టెన్ చేసుకుని ఇంటికి తగిలించి మురిసపోయే వాళ్ళం.
పక్షుల గూళ్ళు
దీనికి కూడా గాజుల్ని ఒకదానిపై మరొకటి పెట్టి ఆరు గాజులు లేదా ఎనిమిది గాజుల్ని అతికించాలి. ఇలా ఐదారు సెట్లు చేసి పెట్టుకోవాలి. ఒక్కో సెట్ ఒక్కో రంగు గాజులతో చేసుకుంటే బాగుంటుంది. ఈ గుండ్రని గాజు లోపల మధ్యలో చిన్న పక్షి బొమ్మను అతికించుకోవాలి. ఇలా ఆరు గుండ్రాల్లో ఆరు పక్షుల బొమ్మల్ని అతికించాలి. పెద్ద స్కేలు పొడవులో ఒక కర్రపుల్లను తీసుకొని దానికి పూలను చుట్టుకోవాలి. లేదా 'రేల పూలు' అనే చెట్టు కాయలు నున్నగా అడుగు, అడుగున్నర పొడవుతో ఉంటాయి. ఈ కాయల్ని వాడుకోవచ్చు. దీనికి ఊలు చుట్టుకోనవసరం లేదు. కాయలు ముదురు కాఫీరంగు లేదా నలుపు రంగులో ఉంటాయి. నునుపుగా సాఫీగా ఉంటాయి. కాబట్టి ఊలు లేకున్నా పరవాలేదు. పొడవుగా ఉన్న కర్ర పుల్లకు ఈ ఆరు గాజుల గుండ్రాలను ఊలు దారంతో వేలాడ దీయాలి. కర్రపుల్లకు మధ్యలో దారం కట్టి గోడకు వేలాడ దీయవచ్చు. అందంగా పక్షులు వేలాడుతూ ఉంటాయి.
వాల్ హాంగింగ్
కొన్ని అలంకారాలు సింపుల్‌గా చేసుకోవచ్చు. గాజుల్ని మొదట ఊలుతో చుట్టుకోవాలి. ఊలుతో చుట్టేటపుడు ఒక ముడితో చుట్టాలి. అలా గాజులన్నీ ఊలుతో చుట్టాక చదరంగా గానీ, డైమండ్ ఆకారంలో గానీ అమర్చాలి. అంటే అంటే ఒక గాజుకు మరొక గాజును దారంతో ముడివేయాలి. డైమండ్ ఆకారంలో తయారైన గాజుల చట్రానికి కిందకు వేలాడదీయడానికి గంటలు, పువ్వులు తేవాలి. పువ్వుల్ని ఊలుతో చేయవచ్చు. ఒక అగ్గిపెట్టెకు ఊలును 30,40 వరసలు చుట్టి మధ్యలో దారం కట్టి చివర్లు కత్తిరిస్తే ఊలు పువ్వు తయారౌతుంది. ఇలా ఊలు పువ్వుల్ని గంటల్ని పూసల్ని ఊలు దారానికి ఎక్కించి గాజుల చట్రానికి వేలాడదీయాలి. ఇలా తయారైన వాల్ హాంగింగ్ను డ్రాయింగ్ రూంలో వేలాడదీసుకోవచ్చు.
ఫ్లవర్‌వేజ్
గతంలో మహిళలు ఎక్కువగా మట్టి గాజులే వేసుకునే వారు. దాంతో అవి ఎక్కువగా పగిలిపోతుంటాయి. అలా గాజు ముక్కలన్ని దాచిపెట్టి తామర పువ్వు, కోడి పుంజుల్ని చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాంటివి చేయవచ్చు. లేదంటే కొత్తగా చేసుకోవచ్చు. గాజు సీసానొక దాన్ని తీసుకొని దానిపై గాజు ముక్కల్ని అతికించుకోవచ్చు. మొదటగా గాజు ముక్కల్ని దాదాపుగా ఒకే సైజులో కట్ చేయాలి. గాజుల్ని ఒక కోసుగా ఉన్న రాయితో చితక్కొడితే ముక్కలు వస్తాయి. ఈ గాజు ముక్కల్ని రంగులు వరసల్లో వచ్చేలా సీసాపై అతికించుకోవాలి. సీసాపై గాజు ముక్కల డిజైన్ వెరైటీగా ఉంటుంది. ఇది ఫ్లవర్‌వేజ్‌గా ఉపయోగపడుతుంది. లేదంటే అలాగే అలంకరించుకున్నా బాగుంటుంది.
అర్గనైజర్
ఒక అట్టను నలుచదరంగా గానీ గుండ్రంగా కానీ కత్తిరించి పెట్టుకోవాలి. ఈ అట్టను ఒక బట్టతో అతికించి మూసేయాలి. ఇప్పుడు గాజుల్ని తీసుకొని ఇందాక చెప్పినట్టుగా ఒక డజను గాజుల్ని వరసగా పెట్టి అతికించాలి. ఒక అట్టను ఈ గాజుల కిందుగా పెట్టి అతికించి మిగతాది కత్తిరించేయాలి. ఇప్పుడు ఒక చిన్న డబ్బాలా తయారవుతుంది. ఇలా అరు గాజుల డబ్బాలను తయారు చేయాలి. ఇందాక బట్టతో కవర్ చేయబడిన అట్టమీద ఈ ఆరు గాజుల డబ్బాలను అతికించాలి. ఇప్పుడు మనం ఈ డబ్బాలలో చెవులను పెట్టుకునే రింగులు, లోలాకులు, జడకు పెట్టుకునే రబ్బరు బ్యాండ్లు, తలకు పెట్టుకునే పిన్నీసులు వంటివి పెట్టుకోవచ్చు. ఒక్కో డబ్బాలో ఒక్కోరకం పెట్టుకుంటే వెతుక్కునే పని ఉండదు. ఈ ఆర్గనైజర్‌కు మూత కూడా పెట్టుకోవచ్చు ట్రై చేయండి.