Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడి... మూడక్షరాల పదమే కానీ తెగ కలవరపెడుతుంది. మామూలు అనారోగ్యమైతే కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. ఒత్తిడి అలా కాదు, అలసట కలిగిస్తుంది, అలజడి సృష్టిస్తుంది. శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాంటి ఒత్తిడితో బాధపడే బదులు దాన్నెలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం...
- ఒత్తిడికి ఉత్తమ థెరపీ శారీరక వ్యాయామం. వ్యాయామం అంటే చాలా మంది చెప్పే సమాధానం సమయం లేదనది. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను ఎవరినైనా తీసుకోండి... క్రమం తప్పక వ్యాయామం చేస్తారు. తమ టెన్షన్లకు ఉపశమనం అదేనంటారు. కాబట్టి దీన్ని మీరు కచ్చితంగా పాటించండి. ఫలితంగా తప్పకుండా వుంటుంది.
- ఇంటా బయటా పనులెక్కువై తీరిక లేకున్నా సరే.. రోజులో కనీసం అరగంట సమయాన్ని మీకంటూ కేటాయించుకోండి. ఆ కాసేపూ మొహమాటం పక్కన పెట్టి మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి.. దుస్తులు, అలంకరణ ఏదైనా సరే! పాడాలనుకుంటే శ్రుతిలయల్లో ప్రవేశం లేదని సంకోచించకుండా పాడేయండి. నృత్యం అయినా అంతే. మార్కులూ, సర్టిఫికెట్ల కోసం కాదుగా సొంత ఆనందం కోసం చేస్తున్నాననుకోండి.
- పుస్తకాలు మనకెన్నో కొత్త విషయాలు నేర్పిస్తాయి. ఎంతో ప్రశాంతను కూడా ఇస్తాయి. మనలో స్ఫూర్తిని నింపుతాయి. కాబట్టి మీకు నచ్చే అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవండి.
- మనసుకు కలిగిన ఎలాంటి దుఃఖాలైనా ఆప్తులతో చెబితే వాటి సాంద్రత లేదా తీవ్రత తగ్గుతుంది. కనుక 'నా విషయాలు నాకే సొంతం' అని దాచిపెట్టుకోకుండా ఇష్టమైన వ్యక్తితో చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడిక ఒత్తిడికి తావుండదు.
- సెల్ఫోను, టీవీ గొప్ప కాలక్షేపం అనుకునే వారిలో మీరు కూడా చేరారా? అయితే మీ ఆలోచనను వెంటనే మార్చుకోండి. అది కాలక్షేపం కాన్న మనకు చెడే ఎక్కువ చేస్తుంది. అందులో మెదడు నరాలకు ఒత్తిడి కలిగించడం ఒకటి. ఇంత అనర్థాన్ని కొనితెచ్చుకోవడమా.. వాటిని దూరం పెట్టడమా... నిర్ణయం మీదే!
- యాంత్రికతను ఛేదించండి. ఎంతసేపూ పనుల్లో మునిగితేలక కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పండి. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లిరండి. లేదా వాళ్లను మీ ఇంటికి ఆహ్వానించండి. కాసేపు ఏ పార్కుకో షికారుగా వెళ్లిరండి. ఇలాంటివి ఒత్తిడి తగ్గించడమే కాదు ఆనందాలు నింపుతాయి.
- రింగు, వాలీబాల్, కబడ్డీ లాంటి ఔట్డోర్ గేమ్స్ ఆడండి. కుదరకపోతే చదరంగం, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడండి. ఇంట్లో పిల్లలు ఉంటే కాసేపు వాళ్ళతో సరదాగా గడపండి. ఆటలు మనలోని ఒత్తిడిని దూరంచేసి ఉల్లాసాన్ని అందిస్తాయి.