Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగాలు చేసే అమ్మాయిల్లో చాలామందికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటోంది. దీంతో పెట్టుబడి నిర్ణయాలూ స్వయంగా తీసుకుంటున్నారు. అయితే అవి వేటి ఆధారంగా తీసుకుంటున్నారు? తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఎలా..?
సొంత నిర్ణయాలు, ఆర్థికంగా నిలబడాలనుకోవడం మంచిదే. అయితే స్వయంగానే చేయాలనేం లేదు కదా. కాబట్టి నిపుణుల సాయం కోరండి. ఎవరో చెప్పారని సలహా పాటించి పొరబాటున నష్టపోయారో బాధపడేది మీరే. మీ ఖాతా ఉన్న బ్యాంకు లేదా కొన్ని ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిచ్చే నిపుణులుంటారు. వారిని కలవండి. మీ బడ్జెట్, ఆశిస్తున్న లాభాలకు తగినవేవో సూచిస్తారు. రిస్క్, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపైనా అవగాహన కల్పిస్తారు.
తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలు.. వినడానికి ఎంత బాగుంటుంది. ఎక్కువమందిని ఆకర్షించేది ఇదే. అందుకే చాలామంది బోల్తా పడుతుంటారు. దేనిలోనైనా డబ్బులు పెట్టేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. అవసరమైన పరిశోధన చేయండి.
చాలామంది వచ్చిన లాభాల గురించే మాట్లాడతారు. మరి నష్టాల సంగతో? దాన్నీ తెలుసుకోవాలి. లేదూ.. సమంజసమైనదే అని అనిపిస్తే ప్రస్తుతం చేతిలో ఉన్న మొత్తం గురించే ఆలోచించొద్దు. భవిష్యత్లో కట్టగలిగే వీలునూ చూసుకోవాలి. అలాగే ఆదాయంలో కనీసం 20 శాతం మొత్తాన్ని ఆదాకు తప్పక కేటాయించాలి. రిస్క్ ఉన్నవాటికి నెలలో 5 శాతం మాత్రమే పెట్టుబడి పెట్టాలి. లాభాలు వచ్చినా.. నష్టపోయినా అక్కడితోనే ఆగిపోవాలి.
ఎంత నమ్మకస్థులైనా మీ కార్డు, లావాదేవీలు మీ ఆధీనంలోనే జరగాలి. బ్యాంకు ఐడీ, పాస్వర్డ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ వేరొకరికి ఇవ్వొద్దు. ఆర్థిక నియమాల్లో ఇది అత్యంత ప్రధానమైంది. దీన్ని తప్పక ఆచరించండి.