Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టణ జీవితాన్ని విడిచిపెట్టి మారుమూల గ్రామాలను డిజిటల్ చేసేందుకు ముందుకొచ్చారు సయంతని. దాని కోసమే తన భర్త సుచయన్తో కలిసి అద్వైత బోధి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారి ల్యాబ్‌లు స్థానిక కమ్యూనిటీలు ఇకామర్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులతో పాటు మరిన్నింటిలోనే డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవడంలో సహాయపడుతున్నాయి. అ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న నదియా జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అక్కడ నివసించే ఇరవై ఏండ్ల రూపాలి తన రోజువారీ జీవితంలో అనేక పాత్రలు పోషిస్తుంది. పగలు కళ్యాణి యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే ఒక యూనివర్శిటీ విద్యార్థి. రాత్రిపూట కూలీగా చేస్తుంది. గ్రామీణ రహదారులపై తారు వేయడానికి వెళుతుంది.
రోజువారి కూలీ మానేసి
2021 ప్రారంభంలో రుపాలి గ్రామానికి సమీపంలో డిజిటల్ అక్షరాస్యత వర్క్‌షాప్ జరిగింది. అక్కడే ఆమె తన డిజిటల్ అవగాహనను పెంచుకునే అవకాశాన్ని పొందింది. దీనికోసం ఆమె రోజువారీ కూలీకి వెళ్ళడం కూడా మానేసింది. ఎందుకంటే కేవలం మాస్టర్స్ పొందినంత మాత్రానా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఆమెకు లేదు. కానీ కంప్యూటర్ నేర్చుకుంటే కచ్చితంగా ఉపాధి దొరుకుతుందని తెలుసు. అందుకే సయంతని చక్రబర్తి, సుచయన్ మండల్ ప్రారంభించిన అద్వైత బోధి ఫౌండేషన్‌లో మొదటి బ్యాచ్ విద్యార్థులలో రూపాలి కూడా ఉంది. ఈ సంస్థ డిజిటల్ ఎన్క్లూజన్, ఫైనాన్షియల్ ఎన్క్లూజన్, గ్రామణీ ప్రజలకు నాణ్యమైన విద్య, గ్రామీణ వ్యవస్థాపకత అనే నాలుగు స్తంభాలపై పనిచేస్తుంది.
నమ్మకాన్ని బలపరిచింది
''రూపాలి మా వర్క్‌షాప్‌కు నెలపాటు హాజరు కావడానికి సిద్ధంగా ఉంది. దీనికోసం ఆమె తన రోజువారీ వేతనాలను త్యాగం చేయడం మాకు ప్రేరణనిచ్చింది. ఇది మేము చేయాలనుకున్నదానిపై మా నమ్మకాన్ని బలపరిచింది'' అని సయంతని అంటున్నారు. ప్రసిద్ధ పబ్లిషింగ్ హౌస్‌లో మాజీ ఎడిటర్‌గా పనిచేసిన 30 ఏండ్ల సయంతని జర్నలిస్ట్ అయిన తన భర్తతో కలిసి కరోనాకంటే నోయిడాలో నివసించేవారు. మహమ్మారితో వర్క్ఫ్రంహౌమ్ కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని వారి స్వస్థలమైన కళ్యాణికి తిరిగి వెళ్లారు. అక్కడ వారు అట్టడుగు ప్రజలకు ఆన్లైన్ విద్య ఎంత కఠినంగా ఉందో ప్రత్యక్షంగా చూశారు. వారికి స్మార్ట్ఫోన్లు ఉన్నప్పటికీ యూ ట్యూబ్, వాట్సాప్‌లలో వీడియోలను చూడటం కంటే వాటిని ఎలా ఉపయోగించాలో వారికి తెలియదు.
జీవనోపాధి అభివృద్ధిపై
''భారతదేశం ప్రస్తుతం డిజిటల్ గ్యాప్‌పై ఆధారపడి ఉంది. దానిని మనం ఎలా పరిష్కరిస్తాము. ఈ డిజిటల్ విభజనను ఏదో ఒక విధంగా తగ్గించడానికి మేము పునాదులు వేయాలనుకున్నాము. ఆ ఉద్దేశంతోనే అద్వైత బోధి ప్రారంభమైంది. డిజిటల్ ద్వారా గ్రామీణ వర్గాల జీవనోపాధి అభివృద్ధిపై మా ప్రధాన దృష్టి ఉంది'' అని అద్వైత బోధి ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సయంతని అంటున్నారు. సయంతని, సుచయన్ డిజిటల్ ల్యాబ్‌ల కోసం మొదట స్థానిక గ్రామమైన చోసోరటిలోని ఒక పాఠశాలలో జన ప్రగతి ఉద్యోగ్(జీూఖ)ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రారంభించారు. జీూఖలు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీతో భౌతిక-డిజిటల్ ల్యాబ్‌గా పనిచేస్తాయి. ఇక్కడే ఆ జంట తమ మొదటి డిజిటల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. అందులో రూపాలి ఆసక్తిగల విద్యార్థిగా ఉంది.
ప్రాథమిక అంశాలతో...
ఈ వర్క్‌షాప్‌లో 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న దాదాపు 150 మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. జీూఖ అన్ని వయసుల గ్రామీణ ప్రజలు సంకోచం లేకుండా నడవడానికి, డిజిటల్, ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకునే మంచి అవకాశం కల్పించిందని సయంతని నిర్ధారించుకున్నారు. ''మా ఆలోచన ప్రాథమిక అంశాలతో ప్రారంభించబడింది. డిజిటల్ చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈకామర్స్‌లో విక్రయించడం, పాన్ కార్డ్‌లు, ఆధార్ కార్డ్‌లు, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం మొదలైనవాటిలో వారికి శిక్షణ ఇచ్చాము'' అని సయంతని చెప్పారు. మొదటి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులలో చాలామంది నేత కుటుంబాలకు చెందినవారు. ఈకామర్స్ పోర్టల్‌లు, ఫేస్బుక్, వాట్సాప్‌లలో తమ నేతలను ఎలా విక్రయించాలో తెలుసుకోవడానికి ఆసక్తి చూశారు.
నేత కార్మికులకోసం
''నజీర్పూర్, నిశ్చింతాపూర్ అనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఇవి బెంగాల్‌కు చెందిన ప్రత్యేక బాతిక్, టాంట్ చీరలను తయారు చేసే ప్రదేశాలు. ఇక్కడి చేనేత కార్మికులకు చీరల నేత ఆధారంగా కాకుండా రోజు వారీగా మాత్రమే జీతాలు అందుతాయి. వారు రోజుకు మూడు నుండి నాలుగు చీరలను నేయవచ్చు. కాని మధ్యవర్తులు రోజు కూలీ మాత్రమే చెల్లిస్తారు. అంటే వారికి రూ. 150 నుంచి రూ. 250 మాత్రమే చేతికి వస్తాయి. కానీ మధ్యవర్తులు ఒక్కో చీరకు రూ. 2000 వరకు సంపాదిస్తారు. తమ ఉత్పత్తులను నేరుగా ఆన్లైన్లో విక్రయించుకునేందుకు డిజిటల్ విద్యను అభ్యసించడమే తమ ముందున్న ఏకైక మార్గం అని నేత కార్మికులు అర్థం చేసుకున్నారు'' అని సయంతని అంటున్నారు. అలా మొదటి జీూఖ విజయం తర్వాత ఆ పదం మరింత వ్యాపించింది. గ్రామస్తులు, గిరిజనులలో నేర్చుకోవాలనే విపరీతమైన ఆకలిని ఆమె చూసింది. అందుకే మరింత సహాయాన్ని సమీకరించడం ప్రారంభించారు. ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను విరాళాల కోసం అడిగారు.
స్థిరమైన ఆదాయం అవసరం
నేడు అద్వైత బోధి రెండు జిల్లాల్లో ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఆరు జీూఖలు ఉన్నాయి. వారి ప్రారంభ విద్యార్థులు ముగ్గురు ఇప్పుడు ఈ కేంద్రాలలో పూర్తి సమయం శిక్షకులుగా పనిచేస్తున్నారు. రూపాలి వారిలో ఒకరు. సుచయన్ ప్రతి రోజు ఈ ప్రతి జీూఖలకు వెళుతుంటాడు, సయంతని వారాంతంలో వాటిని సందర్శిస్తున్నారు. ''ఎన్జీవోను నడపడం అంత సులభం కాదు. మాకు స్థిరమైన ఆదాయం కూడా అవసరం. కాబట్టి స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని పొందడానికి మాలో ఒకరు ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాము. నా భర్త ఇప్పుడు పూర్తిగా ఎన్జీవోకి అంకితమయ్యారు. తనతోపాటు మరో ఆరుగురు ఉద్యోగులు ఎన్జీవో చిన్నమొత్తంలో జీతం తీసుకుంటారు'' అని సయంతని వివరిస్తున్నారు. అద్వైత బోధి దాతలపై ఆధారపడి నడుస్తుంది. దాతల నుండి వచ్చే ద్రవ్య విరాళాలను, సంస్థల నుండి వచ్చిన ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను సంస్థ కోసం పయోగించుకుంటారు.
గిరిజన సమస్యలు
నదియా జిల్లాలో పని చేస్తున్నప్పుడే సయంతని, సుచయన్ మారుమూల గ్రామంలో ఆందోళనకరమైన పరిస్థితులను గమనించి గిరిజనుల అభ్యున్నతి కోసం పని చేయడం ప్రారంభించారు. గ్రామంలోని గిరిజనులు తాము పండించే బియ్యంతో దేశీ మద్యాన్ని తయారు చేసి రోజూ తాగుతారు. ఉదయాన్నే వెళ్లి మహువా పువ్వులు కోసి మహువా తయారు చేసేవారు. ''ఇది ఇంతకుముందు మా ఎజెండాలో లేదు. అయితే ఈ గిరిజనులు ఉదయం నుండి సాయంత్రం వరకు మద్యం తాగడం తప్ప ఏమీ చేయరు. పిల్లలు కూడా అదే నేర్చుకోవడం చూసి మాకు ఏదో ఒకటి చేయాలనిపించింది'' అని సయంతని చెప్పారు.
ఎలా ఉపయోగించాలో తెలియదు
గిరిజన గ్రామంలోని ఒక గుడిసెలో వెంటనే JPU కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దానిని నడపడానికి గ్రామంలోని కొంతమంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ''మేము వారికి ఒక కంప్యూటర్, రెండు పెన్ డ్రైవ్‌లను ఇచ్చాము. అందులో పిల్లల కోసం కార్టూన్ షోలు, వీడియోలు ఉన్నాయి. వాటితో పిల్లలను కట్టిపడేశారు. చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి. కానీ ఉపాధ్యాయులు లేరు. అయినప్పటికీ పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే వారికి అక్కడ మధ్యాహ్న భోజనం, గుడ్లు లభిస్తాయి కాబట్టి. ఈ విధంగా చూస్తే కనీసం పిల్లలకు పోషణ అందుతోంది. ఇక్కడ గమనించదగ్గ అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ గిరిజనులలో చాలా మందికి స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించాలో, వాటి నుండి ఎలాంటి ప్రయోజనం పొందవచ్చో తెలియదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి స్మార్ట్ఫోన్ల కోసం డబ్బును అందజేస్తుంది. అయితే వారికి విద్యను అందించడం అవసరం. డిజిటల్ అక్షరాస్యత వచ్చినప్పుడే అది ఉపయోగపడుతుంది'' అని ఆమె అంటున్నారు. సయంతని, సుచయన్లు వెళ్ళాల్సిన మార్గం చాలా పొడవుగా ఉంది. అయినప్పటికీ వారు చిన్న విజయాల నుండి ప్రేరణ పొందుతున్నారు.