Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేకప్ ఆర్టిస్టు యూనియన్‌లో సభ్యత్వం అడిగితే తిరస్కరించారు. మహిళను మేకప్ ఆర్టిస్టుగా గుర్తించాల్సిందిగా పన్నెండేండ్లు ఎదురు చూసింది. చివరకు ఆమె ఎదురు చూపు ఫలించింది. 37 సినిమాలకు పని చేసిన తర్వాత, అనేక సవాళ్లు ఎదుర్కొన్న తర్వాత FEFKA మేకప్ యూనియన్‌లో సభ్యత్వం పొందింది. ప్రస్తుతం మలయాళ సినిమాల్లో సభ్యత్వం పొందిన మొదటి మేకప్ ఆర్టిస్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఆమే మిట్టా ఆంటోనీ.
మిట్టా ఆంటోనీ 12 ఏండ్లుగా వివిధ భాషల్లో 37 సినిమాలకు పని చేశారు. గత వారమే ఆమె ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ మేకప్ యూనియన్ లో సభ్యత్వం పొందారు. ప్రస్తుతం ఆమె కేరళలో అధికారికంగా గుర్తింపు పొందిన మొదటి మహిళా మేకప్ ఆర్టిస్ట్‌గా నిలిచారు. అంజలీ మీనన్ 'కూడే', 'డాన్ పలతర 1956', 'సెంట్రల్ ట్రావెన్కోర్' మిట్ట వంటి గొప్ప మలయాళ చిత్రాలకు ఆమె మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేశారు.
మహిళలకు అవకాశం లేదు
వాస్తవానికి ఆమె 12 సంవత్సరాల కిందటే యూనియన్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అప్పుడు ఆమె సభ్యత్వానికి తిరస్కరించబడ్డారు. ''నేను మెంబర్షిప్ కోసం FEFKA మేకప్ యూనియన్ని సంప్రదించినప్పుడు ఒక మహిళగా ఎలా దరఖాస్తు చేసుకోగలవు అని వారు నన్ను ప్రశ్నించారు'' అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె మొదటి సారి అరబిక్ చిత్రానికి పని చేశారు. ఇందులో ముంబైకి చెందిన టెక్నీషియన్లు ఉన్నారు. వారు భాగమైన ప్రాజెక్ట్‌లలో చేరమని ఆమెను కోరారు. దాంతో మిట్టా ముంబైకి వెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి భిన్నంగా లేదని అర్థం చేసుకున్నారు. ''నేను సినీ కాస్ట్యూమ్ మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్డ్రెస్సర్స్ అసోసియేషన్ (జజవీA)ని సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ ఇక్కడ కూడా మహిళలను బయటివారిలానే చూసేవారు'' అని ఆమె చెప్పారు.
ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే
మహారాష్ట్రలో మహిళలు మేకప్ ఆర్టిస్టులుగా ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించడం, మహారాష్ట్రలో ఐదేండ్లకు పైగా రెసిడెన్సీని కోరడం రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా చట్టబద్ధమైన నిబంధనలను అసోసియేషన్ ఉల్లంఘించిందని 2014లో చారు ఖురానా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు మహిళా ఆర్టిస్టులను అసోసియేషన్ వేధింపులకు గురిచేయకుండా అడ్డుకోవాలని, బై-లాస్‌ను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు తీర్పుతో...
''కోర్టు ఇచ్చిన తీర్పు మేకప్ ఆర్టిస్టులకు పెద్ద విజయం. ఆ తీర్పే సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి నన్ను అనుమతించింది. నేను చాలా ప్రాజెక్ట్‌లలో పనిచేశాను, ప్రొస్తెటిక్ మేకప్ కళను కూడా నేర్చుకున్నాను. భోజ్‌పురి, హిందీ, తమిళం, కన్నడ చిత్రాలలో పనిచేశాను'' అని మిట్టా చెప్పారు.
సరైన వేదికలేదు
2017లో మిట్టా కేరళకు తిరిగి వచ్చి లింగమార్పిడిపై ఆధారపడిన 'ఉడలాజమ్' అనే చలనచిత్రంలో పని చేసే అవకాశం పొందారు. అయితే అంజలీ మీనన్ దర్శకత్వం వహించిన 'కూడే' ఆమెకు జీవితాన్ని, కెరీర్‌ని మార్చివేసింది. ''అప్పటి వరకు మాకు యూనియన్‌లో సభ్యత్వం లేకపోవడంతో మహిళల పట్ల చెడుగా ప్రవర్తించే అవకాశం ఉండేది. నేను చేస్తున్న ప్రాజెక్ట్‌లలో నా సమస్యలు చెప్పుకోవడనానికీ, వాటిని పరిష్కరించుకోవడానికి సరైన వేదిక లేనందున నాతో పాటు పని చేసేవారు అసభ్యంగా ప్రవర్తించేవారు. ఇది మానసిక హింసకు సమానమైన బాధాకరమైన అనుభవం. అంతేకాకుండా మాకు పారితోషికం చాలా తక్కువగా ఉండేది. కొన్నిసార్లు నా సొంత సహాయకుల కంటే తక్కువ వేతనం పొందాను. నాలుగు సినిమాలకైతే ఎలాంటి వేతనం అందుకోలేదు'' అని చెప్పారు.
ఇష్టం కాబట్టే కొనసాగించాను
'కూడే' సినిమా తర్వాత మిట్టాకు గుర్తింపు రావడం మొదలయింది. అయితే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయని దీని అర్థం కాదు. ''కూడే తర్వాత నాకు ప్రధాన స్రవంతి సినిమాలు ఏవీ రాలేదు. చిన్నవి మాత్రమే వచ్చాయి. కానీ మేకప్ ఆర్టిస్ట్ అనేది నాకెంతో ఇష్టమైన పని కాబట్టి నేను దాన్ని కొనసాగించాను'' ఆమె జతచేశారు. అయితే ఒకానొక సమయంలో నిరాశ, నిస్పృహతో ఆమె పూర్తిగా సినిమా నుండి తప్పుకోవాలని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
వివిధ వర్గాల నుండి ఒత్తిడి
గత వారం తమ కార్యాలయానికి రావాలని ఫెఫ్కాకు చెందిన బి ఉన్నికృష్ణన్ నుండి ఆమెకు కాల్ వచ్చింది. అక్కడ ఆమెకు యూనియన్ సభ్యత్వం లభించిందని అధికారికంగా వార్తలు వచ్చాయి. ''విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (ఔజజ) ప్రధాన పాత్ర పోషించడంతో వివిధ వర్గాల నుండి మహిళల సభ్యత్వం గురించి ఒత్తిడి వచ్చింది. అంజలి మీనన్, సజితా మదతిల్ కృషి మీకు ఈ గుర్తింపును పొందేలా చేసింది'' అని ఆమె చెప్పారు.
దానిని నేను విచ్ఛిన్నం చేస్తే
'గత 12 సంవత్సరాలుగా మీరు మౌనంగా ఎందుకు ఉండిపోయారు' అని ఎవరైనా ఆమెను ప్రశ్నిస్తే దానికి తగిన సమాధానం మిట్టా వద్ద ఉంది. ''మహిళలు యూనియన్‌లోకి ప్రవేశించకూడదనేది అలిఖిత చట్టం. నేను దానిని విచ్ఛిన్నం చేస్తే నాకు ఎటువంటి ప్రాజెక్ట్‌లు లేదా పని లభించదు'' అని ఆమె చెప్తారు. చిన్నప్పటి నుండి మిట్టా అని విషాయలను నిశితంగా గమనించేవారు. సినిమాలను విపరీతంగా చూసేవారు. ఆ క్రమంలోనే పాత్రలను మెరుగుపరచడంలో మేకప్ పాత్ర పట్ల ఆకర్షితురాలయ్యారు.
ఇది కూడా గేమ్ ఛేంజర్ మాత్రమే
మేకోవర్ల కోసం మేకప్ కళను ఉపయోగించిన చిత్రాలలో కమల్ హాసన్ పాత్రల ద్వారా నేను ప్రభావితం అయ్యాను. అలాగే మమ్ముట్టి 'పంతంమడ' చూసినట్టు నాకు గుర్తుంది. ఇది మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి నాకు ఆసక్తిని కలిగించింది. ఈ ఉత్సుకతే నన్ను హెయిర్, మేకప్ కోర్సులలో చేరేలా చేసింది. ఎందుకంటే అప్పుడు కేరళలో మేకప్ అకాడమీ లేదు'' అని మిట్టా వివరిస్తున్నారు. మేకప్ ఆర్టిస్ట్రీలో ఒక సంవత్సరం డిప్లొమా, స్పెషల్ ఎఫెక్ట్స్‌లో మరో కోర్సును ఆమె పూర్తి చేశారు. అవసరమైన కోర్సులు పూర్తి చేసిన తర్వాత మెంబర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మిట్టా భావించారు. అయితే అది 12 ఏండ్లుగా జరగలేదు. ఈ గుర్తింపు కూడా గేమ్ ఛేంజర్ అని మిట్టా అభిప్రాయపడ్డారు.
మరింత మద్దతు కోసం
''నేను మలయాళ సినిమాలో మరిన్ని అవకాశాలను పొందాలని ఆశిస్తున్నాను. ఈ రంగంలో ఇతర అర్హతలు, నైపుణ్యం ఉన్న మహిళలకు ఇది మార్గం చూపిస్తుందని ఆశిస్తున్నాను. యూనియన్‌తో పాటు నాతో పనిచేసే వారి నుండి మరింత మద్దతు కోసం నేను ఎదురు చూస్తున్నాను'' అంటూ ఆమె తన మాటలు ముగించారు.