Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో మనం ఎంత సాధించినా.. వాటిని గుర్తించేవారు, మన గురించి నాలుగు మంచి మాటలు చెప్పేవారు లేకపోతే మంచి పని చేయాలన్న ఉత్సాహం కూడా పోతుంది. అందుకే ఎదుటివారు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు వారిని అడ్డుకోవడం, మీకు ఆ పొగడ్తలను స్వీకరించే హక్కు లేదన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదు. మరి, వత్తి ఉద్యోగాల్లో ఇతరులు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసా?
'కంగ్రాట్యులేషన్స్.. చాలా గొప్ప పని చేశావు. నీ వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత విజయవంతమైంది..' అని ఎవరైనా మిమ్మల్ని పొగిడితే ఏం చేస్తారు.. దగ్గరివాళ్లయితే 'మునగచెట్టు ఎక్కించకు' అని చెప్పడం.. అదే కాస్త పైఅధికారులతో మాట్లాడుతుంటే దాన్ని దాటవేయడం, లేదా నవ్వి వూరుకోవడం చేస్తుంటారా? అయితే ఇది సరైన పద్ధతి కాదు. అలా పట్టించుకోనట్టుగా ఉండడం వల్ల వారు ఇంకోసారి మీరు ఎంత గొప్ప పని చేసినా దాన్ని ప్రశంసించడానికి ఆసక్తి చూపించరు. అందుకే ఇలా ఎవరైనా మీపై ప్రశంసల వర్షం కురిపించినప్పుడు దాన్ని ఒప్పుకొని 'థాంక్యూ' చెప్పడం అలవాటు చేసుకోండి. అంతేకాదు.. దీనికి మీకు సహాయం చేసినవారి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం మర్చిపోవద్దు. ఫలితంగా వారు కూడా ఆనందంగా ఫీలవుతారు. గుర్తుంచుకోండి.. కష్టపడి పనిచేసినప్పుడు ఎదుటివాళ్లిచ్చే ప్రశంసలను పొందే హక్కు మీకుంది. దాన్ని పూర్తిగా ఆస్వాదించండి.
ఎదుటివాళ్లు తమను ప్రశంసిస్తున్నప్పుడు కొందరు ముడుచుకుపోతారు. మరికొందరేమో.. తామే గ్రేట్ అన్నట్లుగా హావభావాలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఈ రెండూ సరైనవి కావు. ఎదుటివారు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు చిరునవ్వుతో, హుందాగా దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. దీనివల్ల అవతలి వ్యక్తికి కూడా మీపై సదభిప్రాయం ఏర్పడి.. మరోసారి వారు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం దక్కుతుంది. అలాగే ఎదుటివారు మీ గురించి ప్రశంసాపూర్వకమైన మాటలు మాట్లాడుతుంటే కాళ్లు వూపడం, చేతులు నలుపుకోవడం, పెన్ను పట్టుకొని ఆడడం, తిప్పడం వంటివి కూడా చేయకూడదు. వారి కళ్లల్లోకే చూస్తూ ప్రశంసలను స్వీకరించాలి.
మిమ్మల్ని పైఅధికారులు ప్రశంసిస్తుంటే బాగానే ఉంటుంది. అయితే మీకింది వారికి అదే అవకాశం దక్కాలని వారూ కోరుకుంటారు. అందుకే మిమ్మల్ని ఎదుటివారు ప్రశంసిస్తుంటే 'అంతా నా అదష్టం..', 'ఇదేముంది? ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది..' అనే మాటలు వాడకండి. ఎప్పుడూ పాజిటివ్ ధోరణిలో ఆలోచించడం అలవాటు చేసుకోండి. సాధించిన విజయాన్ని తక్కువ చేసి చూడద్దు. ఒకవేళ మీరు సాధించింది నిజంగానే చిన్న విషయమే అయితే.. ముందు వారికి ధన్యవాదాలు తెలిపి.. 'నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని నా భావన..' అని వివరించాలి. ఇందులో మీకు సహాయం చేసిన మీ టీమ్ సేవలను కూడా గుర్తించడం.. అందరిలోనూ వారిని ప్రశంసించడం మర్చిపోవద్దు. ఒకవేళ మీ టీమ్‌లోని వారే మిమ్మల్ని ప్రశంసిస్తుంటే- ముందు వారు చెప్పాలనుకున్నదంతా విని, ఆ తర్వాత 'నేను కూడా నీ సేవలను ప్రశంసిస్తున్నా. నువ్వు చాలా బాగా చేశావు. భవిష్యత్తులోనూ మనం ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా..' అంటే వారు ఎంతో ఆనందిస్తారు. కేవలం ఇదేకాదు.. నలుగురిలో మాట్లాడేటప్పుడు విజయానికి మీరొక్కరే కారణమని చెప్పకుండా టీమ్ సహకారం గురించి వివరించడం వల్ల వారికీ సంతోషంగా, ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది.