Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లాస్టిక్ సంచులు రంగురంగుల్లో ఉండి, సులభంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ నున్నని ఉపరితంతో అందిరి మనసులను గెలుచుకున్నాయి. అందరి మన్ననలూ పొందాయి. అత్యంత చౌకగానూ, అత్యంత అందంగానూ ఉండటం వల్ల మానవ సమాజంలోకి బాగా చొచ్చుకుపోయాయి. మనం కూరగాయలు తెచ్చుకున్నా, కూరలు తెచ్చుకున్నా, ఇడ్లీ తెచ్చుకున్నా ఇడ్లీ తయారయ్యే మినప్పప్పు తెచ్చుకున్నా ప్లాస్టిక సంచులే కావాలి. కానీ ఈ ప్లాస్టిక్ సంచులు వాడేశాక భూమిలో కలవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. హై డెన్సిటీ పాలీ ఎథిలీన్లతో తయారయ్యే ప్లాస్టిక్ సంచులు మానవ అనారోగ్యానికి హేతువులు. కాడ్మియం, సీసం వంటి విషపూరితమైన ధాతువులు ప్లాస్టిక్ సంచుల తయారీలో ఉపయోగపడతాయి. అందువలన వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ సంచులతో వేసినపుడు ప్రమాదకర రసాయనాలు వెలువడతాయి. ఇలా సీసం మన శరీరంలోకి ఎక్కువ రోజులు వెళ్ళినట్లైతే మెదడులోని కణజాలం క్షీణించి, కృశించిపోతాయి. అదే విధంగా కాడ్మియం గనుక శరీరంలోనికి వెళ్ళినపుడు గుండె పరిమాణం పెరగడం, వాంతులు అవుతుంటాయి. అలాంటి ప్లాస్టిక్ సంచులను బయటపడేసి పొల్యూషన్‌కు కారణం కాకుండా ఈరోజు మనం అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నాం.
పువ్వులు
నున్నని ఉపరితలంతో, ఆకర్షణీయమైన లేత రంగులో లభించటం వలన పువ్వులు చేసుకోవడం సులభంగా ఉంటుంది. లేత గులాబీ, లేతనీలం, పసుపు, ఎరుపు వంటి రంగుల సంచుల్ని తీసుకొని పువ్వుల్ని తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక సంచిని ముడతలు లేకుండా సమానంగా పరిచి రెండు చివరలు కత్తిరించాలి. ఇప్పుడు ఆ సంచి మొత్తాన్ని చిన్న చిన్న నలుచదరపు ముక్కలుగా కత్తిరించాలి. పది ముక్కల్ని తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి కుచ్చులుగా మడవాలి. ఇలా మడిచాక మధ్యన ఒక దారంతో ముడివేయాలి. ఒక పలుచటి తీగ తీసుకొని మడిచిన ప్లాస్టిక ముక్కల్ని ముడి వేయాలి. ఇప్పుడు ప్లాస్టిక్ ముక్కల్ని ఒక్కొక్కటిగా విడదీసి పైకి తీయాలి. అప్పుడు అన్నీ ఇలా విడదీశాక పువ్వు ఆకారం వస్తుంది. పువ్వు కింద ఉన్న తీగకు ఆకుపచ్చ టేపును చుట్టాలి. ఇలా ఆరేడు పువ్వుల్ని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్ది లావుపాటి తీగను తీసుకొని దానికి ఒక్కొక్క పువ్వును చుట్టుకుంటూ రావాలి. ఇవన్నీ చుట్టటం అయిపోయాక దీనిక్కూడా ఆకుపచ్చ టేపును అతికించాలి. ఇప్పుడు పూల కొమ్మ తయారయింది. ఈ పూల కొమ్మను పెట్టడానికి ఫ్లవర్‌వేజ్ కూడా వ్యర్థాలతోనే చేద్దాం. ఖాళీ పెప్సీ, కోకోకోలా టిన్నులను తీసుకొని దానికున్న రంధ్రం నుంచి పూల కొమ్మను గుచ్చాలి. అవసరం అయితే ఖాళీ పెప్సీ టిన్నును అందంగా అలంకరించుకోవచ్చు.
పూలమాల
కరకాంబరం రంగు గల ప్లాస్టిక్ సంచుల్ని తీసుకొచ్చి ముడతలు లేకుండా సరిచేయాలి. ఇప్పుడు సంచి రెండు చివరలు కత్తిరించి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఈ పూలదండకు ఎక్కువ సంచులు అవసరం పడతాయి. ఇప్పుడు ఒక దారం తీసుకొని ప్లాస్టిక్ సంచి ముక్కల్ని మధ్యకు పట్టుకుని పూలమాల వలె అల్లాలి. ఒక ప్లాస్టిక్ ముక్కను పైకి, ఒక ప్లాస్టిక్ ముక్క కిందికి పెట్టి అచ్చం పూలదండను అల్లినట్టే అల్లాలి. ఇలా మనకు ఎంత వరకు కావాలో అంత అల్లుకోవచ్చు. ఇలా తయారైన దండను మనకు ఇష్టమైనట్టు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు కనకాంబరాల దండను తయారు చేసుకున్నాం. అలాగే తెలుపు, ఆకుపచ్చ సంచుల్ని ఉపయోగించి మల్లె, మరువం దండలాగా కూడా అల్లుకోవచ్చు. ప్లాస్టిక్ ఉపయోగించి మల్లె, మరువం దండలాగా కూడా అల్లుకోవచ్చు. ప్లాస్టిక్ సంచుల్లో తెచ్చే ఆహారపదార్థాల వలన మాత్రమే నష్టం జరగడం లేదు. ఈ ప్లాస్టిక్ సంచులు డ్రైనేజీ గొట్టాలకు అడ్డంగా పడి నీళ్ళు పోకుండా నష్టం కలుగుతుంది. అంతేకాకుండా నదులు, సముద్రాలలో ఈ ప్లాస్టిక్ సంచులు పడి ఊపిరాడక పోవడంతో నీటిలో బతికే జీవులు ఎన్నో చనిపోతున్నాయి. అలాగే భూ మండలం మీద గుట్టల్లా పేరుకోవడం వలన భూమి లోపల నివసించే జీవులకు గాలి అందక అక్కడి జీవులూ చనిపోతున్నాయి. ఇలా ఎక్కడ పడితే అక్కడ జంతువులు చనిపోవటం వలన జీవవైవిధ్యంలో అసమతుల్యత ఏర్పడుతుంది.
పూలచక్రం
ముడతలు పడి నలిగి పోయిన సంచుల్ని నీట్‌గా మడిచి ఒక పేపర్ లోపల పెట్టి కొద్దిపాటి వేడితో ఐరన్ బాక్స్‌తో రుద్దాలి. నలిగిన ముడతలు పోయి చక్కగా వస్తుంది. ఈ సంచుల్ని పొడుగ్గా పీలికలుగా కత్తిరించుకోవాలి. ఒక అట్ట ముక్కను తీసుకుని దాన్ని గుండ్రంగా కత్తిరించుకోవాలి. దీనిలోపల మరొక వృత్తం తీసుకొని దాన్ని కత్తిరించి అట్టను తీసేయాలి. ఇప్పుడు ఐదు సె.మీ వెడల్పుతో ఒక చక్రంలా తయారవుతుంది. ప్లాస్టిక్ కవర్ ముక్కల్ని తీసుకుని ఈ చక్రానికి చుట్టుకుంటూ పోవాలి. అప్పుడు రంగుల చక్రం తయారౌతుంది. ఇంకో ప్లాస్టిక పీలికను తీసుకొని మధ్యకు మడిచి చివర్లు విడవకుండా కత్తిరించుకోవాలి. అంటే పైనా, కిందా కలిసిపోయి ఉండి మధ్యలో మాత్రమే కత్తిరించబడి ఉంటుంది. దీనిని ఒక తీగకు చుట్టుకుంటూ వెళితే పువ్వు ఆకారంలో వస్తుంది. ముద్దబంతి ఆకారంలో ఉంటుంది. అందుకని ఎక్కువగా పసుపు రంగు సంచులతో పూలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ గుండ్రటి చక్రానికి కింది వైపుగా పూలను వరసగా అతికించాలి. పై వైపున పూసలు లేదా పిస్తా తొక్కలు లేదా బీడ్స్ అతికించాలి. ఇప్పుడు అలంకరణకు సిద్ధమైన పూలచక్రం తయారైంది. దీనిని గోడకు తగిలిస్తే బాగుంటుంది.
కర్టెన్
వాకిలికి ఇరువైపులా కింది వరకు ఉండి మధ్యలో పైకి ఉండే హాఫ్ కర్టెన్ను ప్లాస్టిక్ సంచులతో చేసుకోవచ్చు. మొదటగా నిండు రంగుల్లో ఉన్న ప్లాస్టిక్ సంచుల్ని పైన కింద కత్తిరించి పెట్టుకోవాలి. చిన్న నలుచదరం ముక్కలుగా కత్తిరించాలి. దీనికి పెద్ద పూసలు, గంటలు, గొట్టం పూసలు తెచ్చుకోవాలి. సన్నని వైరు తీసుకుని గంటను గట్టిగా కట్టి ఉంచుకోవాలి. గంట పైభాగాన కొన్ని పూసలు గుచ్చాలి. పూసల రంగు ప్లాస్టిక సంచుల రంగుకు వ్యతిరేకంగా ఉంటే బాగుటుంది. లేదా బంగారు రంగు పూసలయితే అన్నింటికీ మ్యాచింగ్‌గా బాగుంటుంది. పూసలు గుచ్చాక పొడవు గొట్టం పూసను ఎక్కించాలి. ఇప్పుడు ప్లాస్టిక్ సంచుల ముక్కలు ఒక గుత్తిలాగా గుచ్చుకోవాలి. మరల గొట్టం పూస దాని తర్వాత ప్లాస్టిక్ సంచుల గుత్తి ఇలా వరసగా గుచ్చుతూ పోవాలి. సైజుల వారీగా వాకిలికి సరిపడా చేసుకొని వాకిలికి తగిలించుకోవాలి.
బొమ్మలు
ప్లాస్టిక్ సంచుల ముక్కలతో గుత్తులు చేసి పెట్టుకొని వేలాడే బొమ్మలాగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకు ఉయ్యాలలో గుండ్రంగా తిరిగే బొమ్మను కడతారు కదా! అలాంటి బొమ్మను దీనితో చేయవచ్చు. దీనికోసం ఒక గుండ్రని ఇనపరింగు కావాలి. క్రాఫ్ట్స్ షాపులో అల్యూమినియం, చెక్కల రింగులు కూడా దొరుకుతున్నాయి. దాన్ని తెచ్చుకొని దాని చుట్టూతా పైన చేసినట్టుగా చేసిన వరసలు చుట్టాలి. ఒక్కో వరసలో గంటలు, పూసలు, ప్లాస్టిక్ ముక్కల గుత్తులు, తళుకులు వంటివి ఎన్నో చుర్చవచ్చు. రింగుకు అన్నీ కట్టాక పైన వేలాడదీయాలి. లేదంటే పిల్లల ఉయ్యాలకు కూడా కట్టవచ్చు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్